ఏపీకి టాలీవుడ్ తరలింపు జరిగే పనేనా?
ఆ కారణంగా తెలంగాణ కళాకారులు వెలుగులోకి రాలేకపోతున్నారు? అన్న వాదన బలంగా వినిపించింది.
By: Tupaki Desk | 24 Dec 2024 5:47 AM GMTతెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక టాలీవుడ్ వైజాగ్ కి షిప్ట్ అవుతుందనే ప్రచారం అప్పట్లో ఎంత సంచలనమైందో తెలిసిందే? 2014 లో తెలంగాణ ఏర్పాటైంది. అంటే తెలంగాణ ఏర్పాటై ఇప్పటికీ పదేళ్లు పూర్తయింది. రాష్ట్రం ఏర్పాటైన వెంటనే టీఆర్ ఎస్ ప్రభుత్వం ఏర్పాటైంది. ఈ క్రమంలో ఇండస్ట్రీలో ఉన్న వాళ్లు అంతా ఆంధ్రా వాళ్లు. ఆ కారణంగా తెలంగాణ కళాకారులు వెలుగులోకి రాలేకపోతున్నారు? అన్న వాదన బలంగా వినిపించింది. ఈ క్రమంలో ఆంద్రా వాళ్లు అంతా హైదరాబాద్ వదిలి వెళ్లిపోవాల్సిందే.
వాళ్లతో పాటు ఇండస్ట్రీ కూడా వైజాగ్ కి తరలిపోతుందనే ప్రచారం పీక్స్ లో జరిగింది. మరి అది జరిగిందా? అంటే లేదు. అప్పటి నుంచి కేసీఆర్ ప్రభుత్వం ఇండస్ట్రీకి ప్రోత్సహాకాలు అందించడంతో పాటు హైదరాబాద్ ని ఫిల్మ్ హబ్ గా మారుస్తామని ప్రకటించారు. స్టూడియోల కోసం స్థలాలు సైతం కేటాయింపు జరిగింది. దీంతో టాలీవుడ్ వైజాగ్ కి షిప్ట్ అవ్వలేదు. హైదరాబాద్ కి సమాంతరంగా వైజాగ్ లో కూడా ఇండస్ట్రీ డెవలప్ అవుతుందనే కొత్త వాదన తెరపైకి వచ్చింది. అప్పటి నుంచి తెలంగాణతో పాటు ఏపీలోనూ విరివిగా సినిమా షూటింగ్ లు జరుగు తున్నాయి.
ఈ క్రమంలోనే 2019లో వైకాపా అధికారికంలోకి రావడంతో అప్పటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి టాలీవుడ్ షిప్ట్ అవ్వాలనే అంశాన్ని తెరపైకి తెచ్చారు. వైజాగ్ లో స్టూడియోలకు స్థలాలు ఇస్తామని...వైజాగ్ లోనూ జూబ్లీ హిల్స్, బంజారాహిల్స్ లాంటి కాలనీలు ఏర్పాటు చేసుకుందామన్నారు. ప్రత్యేకంగా సినీ పెద్దలతో భేటీ ఏర్పాటు చేసి మరీ చెప్పారు. మరి వైజాగ్ షిప్ట్ అవ్వడానికి పెద్దలేవరైనా ఆసక్తి చూపించారా? అంటే అదెక్కడా కనిపించలేదు.
తాజాగా అల్లు అర్జున్ -సంధ్యా థియేటర్ వివాదం తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా సర్కార్ అసహనం నేప థ్యంలో ఇండస్ట్రీ ఏపీకి తరలిపోతుందనే వాదన మళ్లీ ఊపందుకుంది. ప్రజల ప్రాణాల కన్నా తమకు ఎవరూ ముఖ్యంకాదని....ప్రాణాలు పోతున్నాయంటే? ఎలాంటి అనుమతులు ఇచ్చేది లేదని కరాఖండీగా చెప్పేసారు. ఈ నేపథ్యంలో మళ్లీ ఇండస్ట్రీ షిప్ట్ టూ వైజాగ్ అనే వాదన మొదలైంది.
అయితే ఇదే విషయంపై నిర్మాత నాగవంశీ ఏమన్నారంటే? ఇక్కడ నాకు ఇల్లు ఉంది. సినిమాలున్నాయి. ఇవన్నీ వదులుకుని ఏపీకి ఎందుకు వెళ్తాను అన్నారు. ఆయన అన్నది అక్షరాలా నిజం. హీరోలు, నిర్మాతలు, దర్శకులు అంతా హైదరాబాద్ సెటిలర్స్. అక్కడ వాతావరణానికి అలవాటు పడిన వారు. హైదరాబాద్ లో ఇండస్ట్రీ కొన్ని దశాబ్ధాలుగా ఉంది. ఎంతో అభివృద్ది పథంలో ఉంది. ఇండియన్ సినిమాని శాశించే స్థాయికి హైదరాబాద్ నుంచే టాలీవుడ్ ఎదిగింది.అలాంటి హైదరాబాద్ ని వదిలేసి ఇండస్ట్రీ ఏపికి ఎలా వెళ్లిపోతుంది. తరలింపు అన్నది అసాధ్యం. కానీ సమాంతరంగా పరిశ్రమను ఏపీలో అభివృద్ది చేసే ఆలోచనలో పెద్దలున్నారు అన్నది వాస్తవం.