Begin typing your search above and press return to search.

బాయ్ కాట్ పుష్ప-2.. అప్పుడు అలా, ఇప్పుడు ఇలా!

ఇప్పుడు 'పుష్ప 2' సినిమాని కూడా బాయ్ కాట్ చెయ్యాలంటూ ఓ వర్గం నెటిజన్లు నెట్టింట రచ్చ చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   2 Dec 2024 12:01 PM GMT
బాయ్ కాట్ పుష్ప-2.. అప్పుడు అలా, ఇప్పుడు ఇలా!
X

ఈరోజుల్లో ఏదైనా పెద్ద సినిమా వస్తుందంటే చాలు.. సోషల్ మీడియాలో నెగెటివిటీని స్ప్రెడ్ చేయడానికి ఓ బ్యాచ్ రెడీ అయిపోతున్నారు. హీరో మీద వ్యతిరేఖత కారణంగానో లేదా ఇంకేదైనా కారణం చేతనో ఆ సినిమాని నిరంతరం ట్రోల్ చేస్తూ వస్తున్నారు. అలానే సినిమాని 'బాయ్ కాట్' చెయ్యాలని ట్రెండ్ చేసే మరో బ్యాచ్ కూడా ఉన్నారు. తమ మనోభావాలు దెబ్బ తిన్నాయనో, ఫలానా కంటెంట్ నచ్చలేదనో.. ఇలా ఏదొక రీజన్ చెప్పి ఆ చిత్రాన్ని బహిష్కరించాలంటూ పోస్టులు పెడుతుంటారు. ఇప్పుడు 'పుష్ప 2' సినిమాని కూడా బాయ్ కాట్ చెయ్యాలంటూ ఓ వర్గం నెటిజన్లు నెట్టింట రచ్చ చేస్తున్నారు.

మొన్నటి దాకా ''పుష్ప 2: ది రూల్'' సినిమాని బాయ్ కాట్ చెయ్యాలంటూ జనసైనికులు, పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ లో పాల్గొన్నారు. హీరో అల్లు అర్జున్ తన మిత్రుడైన వైసీపీ నాయకుడి కోసం నంద్యాల వెళ్లడాన్ని దీనికి కారణంగా చూపించారు. ఇప్పుడు టికెట్ ధరల విషయంలో #BoycottPushpa2 అంటూ పోస్టులు పెడుతున్నారు. సినిమా టికెట్ రేట్లు మరీ టూమచ్ గా ఉన్నాయని, ఇష్టానుసారంగా ధరలు పెంచుతూ సామాన్యులకు వినోదాన్ని దూరం చేస్తున్నారని, ఇదిలా కొనసాగితే ఇండియా సినిమా చచ్చిపోతుందని, అందుకే ఈ చిత్రాన్ని ఎవరూ చూడొద్దంటూ కొందరు సినీ ప్రియులు ఎక్స్ లో విమర్శలు చేస్తున్నారు.

'పుష్ప 2' సినిమాకి టికెట్ రేట్లు పెంచుకోడానికి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అనుమతి ఇవ్వడంతో, అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయిపోయాయి. సింగిల్ స్క్రీన్స్, మల్టీఫ్లెక్స్‌లలో వివిధ స్థాయిల్లో 19 రోజుల పాటు రేట్లు పెంచుకోడానికి అనుమతులు వచ్చాయి. బెనిఫిట్ షోలకు ఒక రేటు, మొదటి నాలుగు రోజులు ఇంకో రేటు, ఆ తర్వాత ఎనిమిది రోజులకు మరో రేటు.. ఇలా రోజులు గడిచేకొద్దీ తగ్గుతూ వచ్చేలా టికెట్ రేట్లు నిర్ణయించారు. ఈరోజో రేపో ఆంధ్రప్రదేశ్ లోనూ టికెట్ ధరలు పెంపుకు ప్రభుత్వం నుంచి పర్మిషన్ వస్తుందని భావిస్తున్నారు. అయితే 'పుష్ప 2' టికెట్ ధరలను ఎక్కువగా పెంచడాన్ని కొందరు నిరసిస్తున్నారు.

టికెట్ రేట్లు పెంచడం అనేది 'పుష్ప 2' సినిమాతో మొదలైంది కాదు. పెద్ద సినిమాలకు వారం, పది రోజులు టికెట్ ధరలు పెంచుకోడానికి ప్రభుత్వాలు వెసులుబాటు కల్పించడం అనేది ఎన్నో ఏళ్ళ నుంచి కొనసాగుతోంది. భారీ బడ్జెట్ తో తీసిన ఈవెంట్ ఫిలిమ్స్ కి మాత్రమే టికెట్ రేట్లపై కొంత సడలింపు ఇస్తూ వస్తున్నారు. కొన్ని సినిమాలకు పన్నులో రాయితీలు కూడా ఇచ్చేవారు. ఈ ఏడాదిలో రిలీజైన 'కల్కి 2898 ఏడీ' 'దేవర 1' లాంటి పాన్ ఇండియా చిత్రాలకు టికెట్ రేట్లలో హైక్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కాకపోతే ఆ రెండు సినిమాల కంటే ఇప్పుడు 'పుష్ప 2: ది రూల్' టికెట్ ధరలు ఎక్కువగా ఉండటం గమనార్హం.

నిజానికి తమ ఫేవరేట్ హీరోల సినిమాలకు హైక్స్ ఉండాలని అభిమానులే కోరుకుంటారు. బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ పెట్టడానికి, కలెక్షన్స్ లో రికార్డ్స్ క్రియేట్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి.. టికెట్ రేట్లు పెంచినా పెద్దగా పట్టించుకోకుండా సినిమాలు చూస్తుంటారు. ఏపీలో సామాన్యులకు సినీ వినోదం భారం కాకూడదు అంటూ గత ప్రభుత్వం టికెట్ రేట్లు తగ్గిస్తూ ఒక జీవో తీసుకొచ్చింది. అయితే దీనిపై సినీ అభిమానులు నిరసన వ్యక్తం చేసారు. ఇండస్ట్రీ అభివృద్ధి చెందాలంటే, సినిమాకి తగ్గట్టుగా అధిక టికెట్ ధరలు ఉన్నా ఇబ్బంది లేదని అభిప్రాయపడ్డారు. కనీస అవసరాల ధరలు తగ్గించకుండా, టికెట్ రేట్లు తగ్గించినంత మాత్రాన పేదవాడికి ఒరిగేదేమీ లేదని కామెంట్స్ చేసారు.

అప్పుడు 'పుష్ప 1' సినిమాకి ఆంధ్రాలో ఆశించిన స్థాయిలో వసూళ్లు రాకపోవడానికి కారణం తక్కువ రేట్లు ఉండటమే అనే అభిప్రాయాలు ఉన్నాయి. కట్ చేస్తే, ఇప్పుడు 'పుష్ప 2' సినిమాకి టికెట్ రేట్లు పెంచారని సోషల్ మీడియాలో కొందరు నిరసన తెలుపుతున్నారు. రైతులకు కనీస మద్దతు ధర పెంచమంటే పెంచరు కానీ, సినిమాలకు మాత్రం అడిగిన వెంటనే టికెట్ ధరలు పెంచుతారు అంటూ ప్రభుత్వం మీద ఫైర్ అవుతున్నారు. ఇలా సినీ అభిమానులు టికెట్ రేట్లు తగ్గించినప్పుడు ఒకలా, పెంచినప్పుడు మరోలా కామెంట్స్ చేస్తున్నారు. దీన్ని బట్టి మరీ తక్కువ కాకుండా, మరీ ఎక్కువా కాకుండా టికెట్ రేట్లు ఉంటే ఎవరికీ అభ్యతరం ఉండదని అర్థమవుతోంది.

కాకపోతే ఇక్కడ 'బాయ్ కాట్' ట్రెండ్ 'పుష్ప 2' మీద ఎలాంటి ప్రభావం చూపించడం లేదని తెలుస్తోంది. ఎందుకంటే పెంచిన రేట్లతోనే ఆన్ లైన్ లో విపరీతంగా అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ జరుగుతున్నాయి. రిలీజ్ కు మూడు రోజుల ముందే రూ. 75 కోట్లకు పైగా ప్రీ సేల్స్ వచ్చాయంటే ఈ సినిమాకి ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో, దీని కోసం జనాలు ఎంతగా ఎదురుచూస్తున్నారనేది అర్థం అవుతుంది. మరి సినిమా రిలీజైన తర్వాత రిపీట్ ఆడియన్స్ కోసం టికెట్ రేట్ల విషయంలో మేకర్స్ ఏమైనా పునరాలోచన చేస్తారేమో చూడాలి.