'పుష్ప 2' మూవీకి ఇండస్ట్రీ సపోర్ట్ లభిస్తుందా?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, జీనియస్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'పుష్ప 2' సినిమా, డిసెంబర్ 5న గ్రాండ్ గా థియేటర్లలో రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది.
By: Tupaki Desk | 30 Nov 2024 3:41 AM GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్, జీనియస్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'పుష్ప 2' సినిమా, డిసెంబర్ 5న గ్రాండ్ గా థియేటర్లలో రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. దీనికి సంబంధించిన ప్రచార కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. ఇప్పటికే ఈ మూవీ సెన్సార్ ఫార్మాలిటీస్ కూడా పూర్తయ్యాయి. సినిమాపై నెలకొన్న అంచనాలు, హైప్ ను బట్టి చూస్తే.. పాజిటివ్ టాక్ వస్తే 1000 కోట్ల క్లబ్ లో చేరడం గ్యారంటీ అని అభిమానులు భావిస్తున్నారు. అయితే దీనికి ఇండస్ట్రీ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంటుందనేదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఏవైనా పెద్ద సినిమాలు, క్రేజీ మూవీస్ రిలీజ్ అవుతున్నప్పుడు ఇండస్ట్రీ అంతటా సందడి నెలకొంటుంది. టాలీవుడ్ హీరోలు, దర్శక నిర్మాతలు ఆ సినిమాలకు సోషల్ మీడియా వేదికగా తమవంతు మద్దతు తెలపడం మనం చూస్తుంటాం. చిరంజీవి, మహేశ్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్ లాంటి అగ్ర హీరోలైతే ఇతర చిత్రాలకి సపోర్ట్ చేయడానికి ఎప్పుడూ ముందుంటారు. కొందరు మూవీ రిలీజ్ కు ముందు, మరికొందరు విడుదలైన తర్వాత పోస్టులు పెడుతుంటారు.
ఈ ఏడాది రిలీజైన 'కల్కి 2898 ఏడీ' సినిమాపై దాదాపు టాలీవుడ్ సినీ ప్రముఖులంతా ప్రశంసలు కురిపించారు. తెలుగు సినిమా స్టాండర్డ్స్ ని నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లే మూవీ అంటూ కొనియాడారు. చిరంజీవి, నాగార్జున, మహేష్ లాంటి హీరోలు 'ఎక్స్' వేదికగా ఈ సినిమా గురించి పోస్టులు పెట్టారు. అదే సమయంలో 'దేవర 1' సినిమా గురించి ఏ ఒక్కరూ ట్వీట్ చేయలేదు. ఇతర సినిమాలు గురించి తరచుగా ట్వీట్లు చేసే సెలబ్రిటీలు ఈ సినిమా దగ్గరకు వచ్చేసరికి మౌనం వహించారు. జూనియర్ ఎన్టీఆర్ తో సన్నిహితంగా ఉండే స్టార్లు సైతం ఈ మూవీ విషయంలో సైలెంట్ గా ఉండటం ఆశ్చర్యపరిచింది.
'దేవర' సినిమాను టాలీవుడ్ పెద్దలు పూర్తిగా విస్మరించిన తర్వాత, ఇప్పుడు "పుష్ప 2: ది రూల్" సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయింది. భారీ బడ్జెట్ తో తీసిన ఈ యాక్షన్ డ్రామాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇటీవల కాలంలో నార్త్ లో ఇంత హైప్ ఏ సినిమాకీ రాలేదనే చెప్పాలి. ఈ చిత్రానికి టాలీవుడ్ స్టార్స్ సపోర్ట్ ఉంటుందా? 'కల్కి 2898 ఏడీ' మాదిరిగానే ఈ సినిమాకి కూడా సానుకూలంగా పోస్టులు పెడతారా? అనేది సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
సెలబ్రిటీల సోషల్ మీడియా పోస్టులు మరిన్ని బాక్సాఫీస్ కలెక్షన్స్ తెచ్చిపెడతాయని కాదు కానీ, స్టార్స్ ట్వీట్స్ చేయడం వల్ల సినిమా పట్ల సానుకూల దృక్పథం ఏర్పడుతుంది. అలానే సినిమా చుట్టూ మరింత చర్చ జరగడానికి, బాగున్న సినిమా నెక్స్ట్ లెవల్ కు చేరడానికి సహాయపడుతుంది. టాలీవుడ్ లో గతంలో 'బాహుబలి 2' చిత్రానికి అందరూ ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు. అదే విధమైన సపోర్ట్ ఇప్పుడు 'పుష్ప 2: ది రూల్' సినిమాకి దొరుకుతుందేమో చూడాలి. 'కల్కి'కి దొరికినంత సపోర్టు దొరికినా బన్నీ సినిమాకి ప్లస్ అవుతుంది.
'పుష్ప 2' కోసం యావత్ సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తెలుగుతో పాటుగా హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాళీ భాషల్లో ఈ మూవీ రిలీజ్ కానుంది. ఇప్పుడు ఆల్ ఇండియాలో పుష్ప ఫీవర్ కనిపిస్తోంది. అన్ని భాషల్లోనూ పుష్పరాజ్ మ్యానియా కొనసాగుతోంది. బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయమని ట్రేడ్ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. దీనికి ఇండస్ట్రీ నుంచి మద్దతు లభిస్తుందని అభిమానులు భావిస్తున్నారు. అయితే ఇటీవల విడుదలైన 'పుష్ప 2' ట్రైలర్ పై మెగా ఫ్యామిలీ హీరోలు ఎవరూ స్పందించలేదు. మరి సినిమా రిలీజైన తర్వాత సోషల్ మీడియాలో పోస్టులు పెడతారేమో చూడాలి.