హిట్ తో ఇప్పుడా లెక్క సరిచేస్తారా?
అతడి మేకింగ్...కథలకు చాలా మంది హీరోలు కనెక్ట్ అవుతారు.
By: Tupaki Desk | 18 Dec 2024 2:45 AM GMTకోలీవుడ్ లో వెట్రీమారన్ కు డైరెక్టర్ గా మంచి పేరుంది. జాతీయ అవార్డు డైరెక్టర్ గా అవార్డులు..రివార్డులు అందుకున్నారు. 'పూలదావన్', 'ఆడుకాలం', 'వాసరానై', 'వడచెన్నై', 'అసురన్' లాంటి చిత్రాలు మంచి విజయం సాధించాయి. సూరి, విజయ్ సేతుపతితో నటించిన 'విడుతలై' మొదటి పార్ట్ కూడా మంచి విజయం సాధించింది. అయితే వెట్రీ మారన్ క్రేజ్ కేవలం కోలీవుడ్ వరకే పరిమితం. అతడి మేకింగ్...కథలకు చాలా మంది హీరోలు కనెక్ట్ అవుతారు.
అలా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా కనెక్ట్ అయ్యారు. ఆయనతో సినిమా చేయడానికి తారక్ సైతం వెయిట్ చేస్తున్నాడు? అంటే వెట్రీమారన్ స్పెషాల్టీ గురించి ఇంతకు మించి చెప్పాల్సిన పనిలేదు. అయితే ఆయన సినిమాలన్నీ కమర్శియల్ గా అనుకున్న స్థాయిలో సక్సెస్ అవ్వలేదు అన్నది అంతే వాస్తవం. ఆయన డైరెక్ట్ చేసిన సినిమాలు తెలుగులోనూ అనువాదమయ్యాయి గానీ పెద్దగా ఆడలేదు.
విడుతలై మొదటి భాగం తెలుగులో నష్టాలే మిగిల్చిందని సమాచారం. తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూటర్లు థియేట్రికల్ రైట్స్ 1.5 కోట్లకు కొనుగోలు చేయగా కేవలం 1 కోటి మాత్రమే వసూలు చేసింది. తెలుగు ఆడియన్స్ వెట్రీమారన్ సినిమాలకు అంతగా కనెక్ట్ కారు అనే విమర్శ ఉంది. ఈ నేపథ్యంలో 'విడుతలై-2' కూడా డిసెంబర్ లో రిలీజ్ అవుతుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుంది? అన్నది ఆసక్తికరంగా మారింది.
సినిమాపై అయితే మంచి అంచనాలే ఉన్నాయి. 'మహారాజ్' తో విజయ్ సేతుపతి మంచి విజయం అందుకున్న సంగతి తెలిసిందే. ఆ హిట్ తో మక్కల్ సెల్వన్ స్టార్ డమ్ రెట్టింపు అయింది. మరి ఆ ప్రభావం `విడుతలై -2` పై ఎలా ఉంటుందన్నది చూడాలి. ఈ సినిమా హిట్ తో వెట్రీమారన్ పై ఉన్న ఆ విమర్శ తొలగిపోతుందా? అన్నది చూడాలి. పార్ట్ 2లో విజయ్ సేతుపతి మెయిన్ లీడ్ పోషిస్తున్నట్లు తెలుస్తోంది.