పవన్, బన్నీ.. ఆ విషయంలో చొరవ తీసుకునేదెవరో?
కానీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సమయంలో వివాదాలు తీవ్రస్థాయికి చేరినట్లు సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది.
By: Tupaki Desk | 23 Jun 2024 1:30 AM GMTటాలీవుడ్ కు చెందిన ప్రముఖ మెగా, అల్లు కుటుంబాల మధ్య ఏదో జరుగుతోందని కొద్దిరోజులుగా జోరుగా చర్చ సాగుతోంది. రెండు ఫ్యామిలీల మధ్య బాగా దూరం పెరిగిందని టాక్ వినిపిస్తోంది. అయితే ఎప్పటి నుంచో తగాదాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నా.. అందులో నిజమెంత అనేది ఎవరికీ తెలియదు. కానీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సమయంలో వివాదాలు తీవ్రస్థాయికి చేరినట్లు సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది.
అందుకు కారణమేంటో కూడా అందరికీ తెలిసిందే. ప్రస్తుత ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి తరఫున పిఠాపురం నుంచి పోటీ చేశారు. ఆయనకు మద్దతుగా మెగా ఫ్యామిలీ మెంబర్స్ అంతా రంగంలోకి దిగారు. చిరంజీవి నెట్టింట వీడియో పోస్ట్ చేయగా.. మిగతా వారంతా పిఠాపురంలో పర్యటించారు. అదే సమయంలో అల్లు అర్జున్ కూడా పవన్ మావయ్యకు మద్దతుగా ఒక ట్వీట్ చేశారు.
అంతవరకు బాగానే ఉన్నా.. ఆ తర్వాత నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఇంటికి వెళ్లి మరీ విషెస్ తెలిపారు బన్నీ,స్నేహ రెడ్డి. పవన్ కోసం ఒక్క ట్వీట్ పెట్టి.. వైసీపీ అభ్యర్థి ఇంటికి బన్నీ వెళ్లడం మెగా ఫ్యాన్స్ కు అస్సలు నచ్చలేదు. దీంతో మెగా, అల్లు ఫ్యాన్స్ మధ్య పెద్ద ఎత్తున నెట్టింట మాటల యుద్ధం నడిచింది. ఆ తర్వాత నాగబాబు ట్వీట్ పెట్టడం, అకౌంట్ డీయాక్టివేట్ చేయడం, మళ్లీ యాక్టివేట్ చేయడం.. ఇదంతా తెలిసిందే.
కట్ చేస్తే.. పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలిచారు. ఆ సమయంలో అల్లు ఫ్యామిలీ నుంచి ఎవరూ విష్ చేయలేదు. చిరు ఇంట్లో జరిగిన వేడుకలకు హాజరు కాలేదు. గన్నవరంలో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవానికి కూడా అటెండ్ కాలేదు. అదే టైమ్ లో సాయిధరమ్ తేజ్.. అల్లు అర్జున్ ను అన్ ఫాలో చేశారని వార్తలు వచ్చాయి. దీంతో రెండు కుటుంబాల మధ్య గ్యాప్ బాగా పెరిగిందనే చర్చ సోషల్ మీడియాలో ఊపందుకుంది. జోరుగా సాగుతోంది కూడా.
అయితే డిప్యూటీ సీఎంతో పాటు పలు శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న పవన్.. మెగా, అల్లు కుటుంబాల మధ్య దూరం పెరుగుతుందనే విషయంలో చొరవ తీసుకోవాలని ఎప్పటి నుంచో రిక్వెస్టులు వస్తున్నాయి. అదే విషయమై మళ్లీ ఇప్పుడు పెద్ద ఎత్తున నెటిజన్లు స్పందిస్తున్నారు. మరోవైపు, డిప్యూటీ సీఎంతో పాటు మంత్రిగా పెద్ద పొజిషన్ లో పవన్ కళ్యాణ్ ఉన్నందున.. అల్లు అర్జున్ కూడా ముందుకు వచ్చి చొరవ తీసుకోవచ్చని అంటున్నారు.
మరి ఇలాంటి సమయంలో మంత్రిగా ఫుల్ బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ తన ఫ్రీ టైమ్ చూసుకుని రెండు కుటుంబాల మధ్య డిస్టెన్స్ విషయంలో చొరవ తీసుకుంటారా? లేకుంటే అల్లు అర్జునే సింగిల్ గా లేక కుటుంబ సమేతంగా వెళ్లి పవన్ ను అఫీషియల్ గా కలుస్తారా? లేక తన ఇంట్లో చిన్నపాటి వేడుకలా ఏర్పాటు చేసి పవన్ ను భోజనానికి సాదరంగా ఆహ్వానించి బన్నీ అంతా క్లియర్ చేసుకుంటారా? అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే.