'దిశ' ఘటన పై సినిమా ఇప్పటికైనా సాధ్యమేనా?
అలాంటి వాళ్లకు ఇలాంటి శిక్షలే పడాలంటూ అంతా సంతోషించారు.
By: Tupaki Desk | 18 Jun 2024 7:30 AM GMTశంషాబాద్‌లో 'దిశ' అత్యాచార, హత్య ఘటన అప్పట్లో దేశ వ్యాప్తంగా ఎంత సంచలనమైందో తెలిసిందే. ఓ మహిళా డాక్టర్ పై లారీ డ్రైవర్లు..క్లీనర్లు చేసిన దాడిపై దేశ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమైంది. తక్షణమే శిక్షించాలంటూ రాష్ట్రం నినాదాలతో మోగింది. అందుకు తగ్గట్టే అప్పటి తెలంగాణ సర్కార్ వారందర్నీ ఎన్ కౌంటర్ చేసిన ఘటన అంతే సంచలనమైంది. అలాంటి వాళ్లకు ఇలాంటి శిక్షలే పడాలంటూ అంతా సంతోషించారు.
అయితే ఇలా ఎన్ కౌంటర్ చేయడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. పోలీస్ బాస్ లు చట్టపరంగా చిక్కుల్లోనూ పడ్డారు. దీనిపై ప్రత్యేకమైన కమిటీ ఏర్పాటు చాలా తతంగమే జరిగింది. ఈ ఘటనపై సంచలనాల రాంగోపాల్ వర్మ సినిమా కూడా తీయాలని ప్రయత్నించారు. నిందింతుల తల్లిదండ్రులని పిలిచి కథకి సంబంధించి కీలకమైన సమాచారం తీసుకున్నారు. `దిశ ఎన్ కౌంటర్` టైటిల్ తో సినిమా కూడా ప్రారంభించారు.
కొన్ని ప్రచార చిత్రాలు కూడా రిలీజ్ చేసారు. కానీ అప్పటికే కేసుపై న్యాయపరమైన చిక్కులు ఉండటంతో రిలీజ్ సాధ్యపడలేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఇదే ఘటనపై తీసేందుకు బాలీవుడ్ దర్శకులు మేఘనా గుల్జార్ సిద్దమయ్యారు. కరీనా కపూర్ ని మెయిన్ లీడ్ కి ఎంపిక చేసినట్లు సమాచారం. అలాగే ఆయుశ్మాన్ ఖురానా ఓ కీలక పాత్రకు తీసుకున్నట్లు వార్తలొస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ఈ కేసు ఇంకా హైకోర్టు విచరాణలోనే ఉంది.
ఈ పిటిషన్‌పై గత నెలలో విచారణ జరిపిన హైకోర్టు.. పోలీస్ అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దం టూ జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి స్టే విధించారు. దీంతో ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న పోలీసులకు కాస్త ఊరట లభించింది. మరి ఇలాంటి తరుణంలో సినిమా పట్టాలెక్కడం సాధ్యమవుతందా? అన్నది చూడాలి.