OG అంటే వాళ్లు క్యాజీ అంటారు: పవన్ కల్యాణ్
సమస్యల పరిష్కారానికి అతడు చూపుతున్న చొరవ ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది.
By: Tupaki Desk | 3 July 2024 4:58 PM GMTఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రిగా జనసేనాని పవన్ కల్యాణ్ ప్రజల్లోకి దూసుకుపోతున్నారు. సేవే ధ్యేయంగా అతడు ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా ఆలోచిస్తున్నారు. సమస్యల పరిష్కారానికి అతడు చూపుతున్న చొరవ ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. నాయకుడిగా పవన్ పరిణతి చెందుతున్న తీరు అందరినీ ఆకట్టుకుంటోంది.
ఇదిలా ఉంటే.. పవన్ కల్యాణ్ నాయకుడిగా దూసుకుపోతుంటే సినిమాలు చేసేదెప్పుడు? అనే సందేహం అభిమానులకు కలిగింది. ఇదే విషయాన్ని ఆయన తాజా పర్యటనలో అభిమానులు విలక్షణంగా ప్రశ్నించగా.. పవన్ ఆసక్తికరంగా స్పందించారు. పవన్ సభలో ఓజీ ఓజీ అంటూ అభిమానులు గోల చేస్తుంటే.. నేను ఓజీ అంటే వాళ్లు క్యాజీ అంటారు అని వ్యాఖ్యానించారు. సినిమాలు చేసే టైముందంటారా? నిన్ను ఎన్నుకుంటే కనీసం రోడ్డు గుంతలు అయినా పూడ్చలేదు అని తిట్టించుకోకూడదు కదా! నా నిర్మాతలకు కూడా చెప్పాను. ఆంధ్రప్రజలకు సేవ చేసుకుంటూ కుదిరినప్పుడల్లా రెండు మూడు రోజులు సినిమాలు చేస్తానని చెప్పాను`` అని అన్నారు. ఓజీ బావుంటుంది .. థియేటర్లలో చూడండి అని కూడా అభిమానులకు సూచించారు.
సభ ఆద్యంతం పవన్ కల్యాణ్ సరదాగా మాట్లాడిన తీరు ప్రజల్ని ఆకట్టుకుంది. అతడి డ్రెస్సింగ్ ని బట్టి డివోషనల్ గా ధీక్షలో ఉన్నారని అర్థమవుతోంది. పవన్ కల్యాణ్ మాట్లాడుతూ .. గెలిచాం కదా అని ప్రత్యర్థులను తూలనాడవద్దని, కనీసం సోషల్ మీడియా పోస్టులు కూడా పెట్టొద్దని, వాళ్లు చేసిన తప్పులు మనం చేయొద్దని కూడా పవన్ తన అభిమానులకు సూచించారు. పవన్ కల్యాణ్ నటించిన ఓజీ, హరి హర వీర మల్లు రిలీజ్ కి రావాల్సి ఉంది. అలాగే తదుపరి హరీష్ శంకర్ తో పవన్ ఓ సినిమా చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం అతడు ప్రజల్లోనే నిరంతరం గడుపుతున్నారు. మరో మూడు నెలల పాటు గ్యాప్ లేకుండా ప్రజల్లోకి వెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కూడా పవన్ అన్నారు.