పోసానిపై ఇండస్ట్రీ ఎటాక్ తప్పదా?
అంతకు మించి నటనలకు తనకంటూ ఓ శైలి ఉందని ముద్ర వేసిన నటుడు.
By: Tupaki Desk | 7 Jun 2024 5:53 AM GMTవిలక్షణ నటుడు పోసాని కృష్ణ మురళీ కెరీర్ జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. నటుడిగా, దర్శకుడిగా ఎన్నో సినిమాల్లో తనదైన ముద్రదేసారు. నిర్మాతగానూ కొన్ని సినిమాలకు పనిచేసారు. పోసానిని ఆదరించిన ప్రేక్షకాభిమానులు ఎంతో మంది. అంత ఫాలోయింగ్ ఉన్న నేపథ్యంలోనే ఇన్నేళ్ల పాటు జర్నీ సాగించగలిగారు. అంతకు మించి నటనలకు తనకంటూ ఓ శైలి ఉందని ముద్ర వేసిన నటుడు.
అలాంటి నటుడు రాజకీయాల్లోనే ముద్ర వేయాలని సీరియస్ గానే పనిచేసారు. సినిమాల్లో సక్సెస్ అయిన అనంతరం ఎన్నో రాజకీయ పార్టీల్లో పనిచేసారు. ప్రస్తుతం ఆయన వైకాపాలో కొనసాగుతున్నారు. ఆ ప్రభుత్వం చివరి దశలో పోసానికి ఫిల్మ్ డెవలెప్ మెంట్ కార్పోరేషన్ బాధ్యతలు కూడా అప్పగించింది. అయితే పోసాని వైకాపాలోకి వెళ్లిన దగ్గర నుంచి సినిమా అవకాశాలు తగ్గాయనే ప్రచారం కూడా గట్టిగానే జరిగింది. కానీ ఇక్కడ సన్నివేశం అందుకు భిన్నంగా కనిపిస్తుంది.
2019 నుంచి 2024 వరకూ వైకాపా ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో పోసాని 40 చిత్రాలకు పైగా నటించారు. అయితే ఇండస్ట్రీ నుంచి వైకాపాకి సరైన మద్దతు లేని నేపథ్యం సహా, పోసానిపై ఇండస్ట్రీ వ్యతిరేక బలాలు ఏమైనా పనిచేసాయా? అంటే లేదనే చెప్పాలి. అలాంటి ప్రభావం చూపించినట్లు అయితే 40 చిత్రాలకు పైగా చేసే అవకాశమే లేదు. అందులో చిరంజీవి కుటుంబానికి చెందిన సినిమాలున్నాయి.
నందమూరి కుటుంబానికి చెందిన సినిమాలున్నాయి. రాజకీయంతో సంబంధం లేకుండా అప్పుడు అవకాశాలు అందుకున్నారు. ఈ దశలోనూ పోసాని వైకాపాకి తీవ్రంగా మద్దతు సైతం ఇచ్చి టీడీపీ పార్టీపై తనదైన శైలిలో నిప్పులు చెరిగారు. అయితే తాజాగా ఏపీలో కూటమి ఏర్పడిన నేపథ్యంలో పరిశ్రమ ఊపిరి పీల్చుకుంటుంది. ఈ నేపథ్యంలో పోసానికి పరిశ్రమలో అవకాశాలు తగ్గుతాయా? పూర్తిగా పరిశ్రమ ఆయన్ని దూరం పెడుతుందా? అన్న కొత్త సందేహాలు తెరపైకి వస్తున్నాయి.
ఎందుకంటే మాజీ, తాజా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఇండస్ట్రీ పెద్దగా భావించే మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ సహా టీడీపీ అననూయలందరిపై పోసాని నిప్పులు చెరిగిన సందర్భాలెన్నో. సందు దొరికినప్పుడల్లా తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఇవన్నీ తాజా పరిణామాల నేపథ్యంలో పోసాని వృత్తిగత జీవితంపై ప్రభావం చూపిస్తాయా? అన్నది మీడియాలో వాడి వేడిగా సాగుతోన్న చర్చ. మరి సినిమా వేరు.. రాజకీయం వేరు అని ఇండస్ట్రీ భావిస్తుంది కాబట్టి పోసాని తదుపరి సినిమా జర్నీ ఎలా సాగుతుందన్నది చూడాలి.