తంగలాన్: విక్రమ్ న్యాయం చేశాడా లేదా?
అదే స్థాయి గుర్తింపు తెచ్చుకున్న నటుడు చియాన్ విక్రమ్.
By: Tupaki Desk | 16 Aug 2024 8:14 AM GMTఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో విలక్షణమైన నటుల జాబితాలో ముందు వరుసలో కనిపించే పేరు కమల్ హాసన్. యూనివర్సల్ యాక్టర్ కమల్ హాసన్ తన సుదీర్ఘ సినీ కెరియర్లో ఎన్నో విభిన్నమైన పాత్రల్లో నటించారు. కమల్ హాసన్ సినిమా అంటే తెరపై ఒక స్టార్ కాకుండా, అందులో ఉన్న క్యారెక్టర్ మాత్రమే కనిపిస్తుందనే అభిప్రాయం అందరిలో ఉంది. అదే స్థాయి గుర్తింపు తెచ్చుకున్న నటుడు చియాన్ విక్రమ్.
నటుడిగా విక్రమ్ శైలి చాలా భిన్నంగా ఉంటుంది. సినిమాలో క్యారెక్టర్ ఎలా ఉంటే దానికి తగ్గట్టుగా తనను తాను మార్చేసుకోవడం విక్రమ్ ప్రత్యేకత. ‘శేషు’ సినిమాలో పిచ్చోడిగా చేసిన పాత్ర కానీ, ‘శివపుత్రుడు’లో ఆయన చేసిన పాత్ర కానీ, విక్రమ్ ఎంత బెస్ట్ యాక్టర్ అనేది స్పష్టమవుతుంది. ‘శివపుత్రుడు’ సినిమాకి విక్రమ్ నేషనల్ అవార్డు కూడా అందుకున్నాడు. ‘అపరిచితుడు’ సినిమాలో మూడు విభిన్న పాత్రలు చేయడంలో విక్రమ్ తనదైన శైలిలో మెప్పించాడు.
ప్రకాష్ రాజ్‌తో ఉన్న యాక్షన్ సీక్వెన్స్‌లో విక్రమ్ చూపించిన వేరియేషన్స్ అందరికీ గుర్తుండే ఉంటాయి. ‘ఐ’ సినిమా కోసం విక్రమ్ పూర్తిగా ఫుడ్ తగ్గించి సన్నగా మారి, బాడీ బిల్డర్‌గా, మోడల్‌గా కనిపించాడు. ‘కురుపి’ పాత్రలో కూడా ఆయన మెప్పించాడు. ఈ విధంగా తన కెరీర్‌లో ఎన్నో విభిన్నమైన పాత్రలు చేస్తూ విక్రమ్ తన ప్రయాణం కొనసాగిస్తున్నారు.
అయితే, విక్రమ్‌కి ‘అపరిచితుడు’ లాంటి సక్సెస్ తరువాత పెద్దగా విజయాలు రాలేదు. విభిన్న కథలతో సినిమాలు చేస్తూ వచ్చినా, కమర్షియల్ సక్సెస్‌లు తక్కువే. తాజాగా పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన తంగలాన్ మూవీతో విక్రమ్ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలో కేవలం గోచి ధరించిన పాత్రలో విక్రమ్ కనిపిస్తాడు. ఆ పాత్ర కోసం విక్రమ్ ఎంతో కష్టపడ్డాడని తెలుస్తోంది.
సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. సినిమా చూస్తున్నంత సేపు తంగలాన్ తెగకి చెందిన ఒక నాయకుడు మాత్రమే కనిపిస్తాడు తప్ప, ఎక్కడా విక్రమ్‌ని ఆడియన్స్ చూడరు. అంతగా పాత్రలో పరకాయప్రవేశం చేసిన విక్రమ్ అందరిని ఆకట్టుకున్నాడు. ఈ మూవీ థియేటర్స్‌లో ఆడియన్స్‌ను ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుందనే టాక్ వినిపిస్తోంది. విక్రమ్ నట విశ్వరూపాన్ని మరోసారి చూసే అదృష్టం ‘తంగలాన్’ సినిమాతో ఆడియన్స్‌కు వచ్చింది. సదరు మూవీతో విక్రమ్‌కు ఎక్స్‌పెక్ట్ చేసిన సక్సెస్ లభిస్తుందని ఆయన అభిమానులు భావిస్తున్నారు.
సినిమాలో అడ్వెంచర్ సీన్స్ ఎన్ని ఉన్నా కూడా వాటిని విక్రమ్ అలా రకంగా డామినేట్ చేశాడని టాక్ వస్తోంది. విక్రమ్ ప్రతీ సినిమాలో కూడా తన పాత్రకు అనుకున్న దానికంటే ఎక్కువగానే న్యాయం చేస్తాడు. ఇక సినిమా ఫెయిల్ అయినా కూడా నటుడిగా అతను ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు. కొన్నిసార్లు కంటెంట్ లోపం వలన విక్రమ్ సరైన గుర్తింపు అందుకోలేదు. ఇక ఇప్పుడు తంగలాన్ తో కంటెంట్ తో పాటు విక్రమ్ క్యారెక్టర్ కూడా హైలెట్ అయ్యిందని అంటున్నారు. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.