Begin typing your search above and press return to search.

సూప‌ర్‌స్టార్ తండ్రికి హ‌త్యా బెదిరింపు.. గ్యాంగ్ స్ట‌ర్ ఇన్వాల్వ్‌మెంట్?

హ‌త్యా బెదిరింపుల‌తో కొన్నేళ్లుగా స‌ద‌రు స్టార్ హీరో కుటుంబానికి కంటిమీద కునుకు లేదు.

By:  Tupaki Desk   |   19 Sep 2024 8:28 AM GMT
సూప‌ర్‌స్టార్ తండ్రికి హ‌త్యా బెదిరింపు.. గ్యాంగ్ స్ట‌ర్ ఇన్వాల్వ్‌మెంట్?
X

హ‌త్యా బెదిరింపుల‌తో కొన్నేళ్లుగా స‌ద‌రు స్టార్ హీరో కుటుంబానికి కంటిమీద కునుకు లేదు. జోధ్ పూర్ కు చెందిన ప్ర‌మాద‌క‌ర‌ గ్యాంగ్ స్ట‌ర్, అత‌డి అనుచ‌రులు ఇప్ప‌టికే ప‌లుమార్లు త‌న‌ కుటుంబాన్ని, త‌న‌ను బెదిరించ‌డంతో ఆ స్టార్ హీరో క్ష‌ణ‌క్ష‌ణం భ‌య‌ప‌డుతూ కాలం గ‌డుపుతున్నాడు. అత‌డు ఎక్క‌డికి వెళ్లినా మంది మార్భ‌లం. చుట్టూ సెక్యూరిటీతో క‌నిపిస్తున్నాడు.చివ‌రికి షూటింగ్ లొకేష‌న్ లోను ఇదే ప‌రిస్థితి. బుల్లెట్ ప్రూఫ్ కార్ త‌ప్ప‌నిస‌రి.


ఇటీవ‌లే త‌న ఇంటిపై తుపాకీ కాల్పుల క‌ల‌క‌లం అనంత‌రం, గ్యాంగ్ స్ట‌ర్ అనుచ‌రుల అరెస్ట్ వ్య‌వ‌హారం తెలిసిందే. స్టార్ హీరో ను చంపేందుకు కుట్ర చేయ‌గా, పోలీసులు దీనిని ఛేధించ‌డంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ప్ర‌స్తుతం పోలీసుల విచార‌ణ కొన‌సాగుతూనే ఉంది. కోర్టుల్లో గొడ‌వ ర‌న్ అవుతోంది. అయితే ఇంత‌లోనే మ‌రో బెదిరింపు షాకిస్తోంది. ఇదంతా ఎవ‌రి గురించో ఈపాటికే మీకు అవ‌గాహ‌న అయ్యి ఉంటుంది. ఆ స్టార్ హీరో మ‌రెవ‌రో కాదు.. ది గ్రేట్ స‌ల్మాన్ భాయ్. అత‌డి కుటుంబానికి గ్యాంగ్ స్ట‌ర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి ప్ర‌మాదం పొంచి ఉన్న సంగ‌తి తెలిసిందే.

తాజాగా ముంబైలో మార్నింగ్ వాక్ చేస్తున్న సమయంలో సల్మాన్ ఖాన్ తండ్రి సలీం ఖాన్‌కు హత్యా బెదిరింపులు ఎదుర‌య్యాయి. ఇద్దరు వ్యక్తులు అతడి వద్దకు వచ్చి లారెన్స్ బిష్ణోయ్ పేరు చెబుతూ వార్నింగ్ ఇచ్చారు. బాంద్రా పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. సలీం ఖాన్, అతడి కుటుంబ సభ్యుల భద్రతను నిర్ధారించడానికి అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అస‌లేం జ‌రిగింది? అంటే.. స‌లీం ఖాన్ మార్నింగ్ జాగింగుకు వెళ్ల‌గా... స్కూటర్‌పై వెళ్తున్న ఓ వ్యక్తి, బురఖా ధరించిన మహిళ సలీమ్‌ఖాన్‌ వద్దకు వచ్చి `లారెన్స్‌ బిష్ణోయ్‌ని పంపాలా?` అంటూ చిల్లింగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు. దీంతో వెంట‌నే అత‌డు పోలీసుల‌కు ఫిర్యాదు చేసారు. నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.

నిందితులపై నేరపూరిత బెదిరింపులకు సంబంధించిన సెక్షన్ 352(2), 292, మరియు 3(5) BNS సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అనుమానితుల‌ బెదిరింపు వెనుక ఉద్దేశ్యంపై అధికారులు ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు.

స‌ల్మాన్ తండ్రి స‌లీమ్ ఖాన్ మార్నింగ్ వాక్ లో ఉండ‌గా, రెండోసారి హ‌త్యా బెదిరింపును ఎదుర్కొన్నారు. ఇంత‌కుముందు అత‌డిని హెచ్చ‌రిస్తూ ఓ లేఖ‌ను గ్యాంగ్ స్ట‌ర్ అనుచ‌రులు పార్క్ లో వ‌దిలి వెళ్ల‌డం క‌ల‌క‌లం రేపింది. దానిపైనా పోలీసులు విచార‌ణ కొన‌సాగించ‌గా, ఇది లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప‌నేన‌ని రుజువైంది. తాజా ప‌రిణామంతో మ‌రోసారి స‌ల్మాన్ కుటుంబం క‌ల‌త‌లో ఉంది.