'రామాయణం'లో రావణుడు 50-50 భాగస్వామి
అందుకే ఇటీవలి కాలంలో యష్ తన తదుపరి చిత్రాన్ని ఎంపిక చేసుకునేందుకు చాలా ఎక్కువ సమయం తీసుకున్నాడు.
By: Tupaki Desk | 24 April 2024 5:51 AM GMTరెండు KGF చిత్రాల విడుదల తర్వాత రాకింగ్ స్టార్ యష్ పాన్ ఇండియా మార్కెట్లో ఓ వెలుగు వెలుగుతున్నాడు. దేశీ బాక్సాఫీస్ వద్ద మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వసూళ్లు తేగలిగే అసాధారణ శక్తిగా గుర్తింపు పొందాడు. అతడి సినిమాలు పాన్-ఇండియా అప్పీల్ తో భారీ వసూళ్లను తేనున్నాయని మార్కెట్ లో టాక్. అందుకే ఇటీవలి కాలంలో యష్ తన తదుపరి చిత్రాన్ని ఎంపిక చేసుకునేందుకు చాలా ఎక్కువ సమయం తీసుకున్నాడు.
ఎంపిక చేసుకునే కథ, దర్శకుడు, నిర్మాణ సంస్థ ప్రతిదీ చాలా కీలకంగా భావించి అందుకు తగ్గట్టు ప్రణాళికల్ని రచిస్తున్నాడు. అతడు కొంత గ్యాప్ తీసుకున్నా కానీ.. బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాల్లో నటిస్తూ బిజీగా మారనున్నాడు. టాక్సిక్: ఎ టేల్ ఫర్ గ్రోన్-అప్స్ .. రామాయణం చిత్రాలతో బిజీ కానున్నాడు. టాక్సిక్ కి గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తుండగా, రామాయణం: పార్ట్ 1 కి నితేష్ తివారీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో రణబీర్ కపూర్ - సాయి పల్లవి సీతా రాములుగా నటిస్తున్నాడు. ఆసక్తికరంగా కెజిఎఫ్ స్టార్ యష్ ఈ రెండు చిత్రాలకు సహ నిర్మాత.
యష్ తాను నటించే రెండు భారీ చిత్రాలు టాక్సిక్ - `రామాయణం` లకు 50-50 భాగస్వామి అయ్యాడు. పారితోషికం ప్లస్ లాభాల వాటా మోడల్‌పై పని చేయడం ప్రారంభించాడు. అది అతడికి గొప్ప ఆదాయాన్ని అందించనుంది. ముఖ్యంగా KGF: చాప్టర్ 2 రూపంలో అతడు రూ. 200 కోట్లకు పైగా సంపాదించాడు. అతడి నిర్మాణ సంస్థ మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్‌కి వెంకట్ కె నారాయణకు చెందిన కెవిఎన్ ప్రొడక్షన్స్‌తో పాటు టాక్సిక్‌లో సమాన వాటా ఉంది.
అంతే కాదు రామాయణంలోనూ ఆయనకు సమానమైన వాటా ఉందని జాతీయ మీడియాలో కథనాలొస్తున్నాయి. రామాయణంలోని ప్రతి భాగానికి ప్రైమ్ ఫోకస్ ద్వారా మొదట అతడికి 150 కోట్లు ఆఫర్ చేశారు. అయినా కానీ డైనమిక్స్ - వాటాలను అర్థం చేసుకున్న యష్ - నమిత్ మల్హోత్రా సమానంగా భాగస్వాములు కావాలని, ఈ చిత్రాన్ని ప్రపంచానికి అందించాలని నిర్ణయించుకున్నారు.
నిర్మాత వెంకట్ కె నారాయణ యష్‌తో తన సహకారం గురించి మాట్లాడారు. వెంకట్ కె నారాయణ మాట్లాడుతూ, ``కెవిఎన్ ప్రొడక్షన్స్ అనేది ఉన్నత-నాణ్యత, వినోదాత్మక చిత్రాలను రూపొందించే లక్ష్యంతో ఉన్న నిర్మాణ సంస్థ. టాక్సిక్ సహా ఇతర విషయాలలో యష్ నాకు అద్భుతమైన స్నేహితుడు.. వ్యూహాత్మక భాగస్వామి. అతడు గొప్ప విజన్, అభిరుచిని కలిగి ఉన్నాడు. అతడి వ్యాపార చతురత, చాలా ముందస్తుగా ఆలోచించే సామర్థ్యం.. ప్రతిభను పెంపొందించుకోవడం కోసం అవిశ్రాంతంగా కృషి చేసే విధానం అన్నీ గొప్పవి. అందుకే మాదైన ముద్ర వేసేందుకు తెలివైన ఒరవడి సహకారంతో ముందుకు సాగుతున్నాం. భారతీయ సినిమా కోసం ఒక గ్లోబల్ డ్రీమ్.. మేం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను ఆకర్షించడానికి ఒక శక్తివంతమైన కథనాన్ని రూపొందించి, అసమానమైన ప్రతిభ కలిగిన తారాగణం అలాగే సాంకేతిక నిపుణులను సమీకరిస్తున్నాము... అని తెలిపారు.
నమిత్ మల్హోత్రా రామాయణంలో యష్‌తో తన అనుబంధం గురించి ఓపెనయ్యారు. నమిత్ మల్హోత్రా మాట్లాడుతూ, ``మన భారతీయ సినిమాను ప్రపంచ వేదికపై ప్రదర్శించడానికి యష్ నేను ఆలోచనలను షేర్ చేస్కున్నాం. అతిపెద్ద భారతీయ సూపర్‌స్టార్‌గా దేశం నుండి రామాయణాన్ని ప్రపంచ వేదికకు తీసుకెళ్లడంలో సహాయం చేయడంలో అతడి సహకారం గొప్పది. ఈ చిత్రాన్ని ప్రపంచంలో ఎవరూ తెరకెక్కించనంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నాం. రామాయణం ప్రపంచవ్యాప్తంగా ఆకర్షణ కలిగిన కథ వర్కవుటైతే.. అతడు ఆ చిత్రం ద్వారా ఎంత డబ్బు సంపాదిస్తారో ఊహించవచ్చు... అని అన్నారు.
టాక్సిక్ ఏప్రిల్ 2025లో థియేటర్లలో విడుదల కానుంది. యష్ ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఆయన రామాయణం పార్ట్ 1 షూటింగ్ ను జూలైలో ప్రారంభించనున్నారు. అతడు రావణ్ పాత్ర కోసం విస్తృతంగా ప్రిపరేషన్ కూడా చేయనున్నాడు. రామాయణం పార్ట్ 1 చిత్రం 2025 చివరిలో విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది.