పారితోషికంలో కింగ్ ఖాన్‌ను మించిన సౌత్ హీరో?
ఇదే నిజమైతే బాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే నటుడిగా యష్ బాలీవుడ్ కింగ్ ఖాన్ ను కూడా అధిగమించినట్లేనని ఈ కథనంలో పేర్కొన్నారు.
By: Tupaki Desk | 7 Jun 2024 3:58 AM GMTబాలీవుడ్ లో ఖాన్‌ల త్రయం, హృతిక్ రోషన్ అత్యంత భారీ పారితోషికం డిమాండ్ చేసే హీరోలుగా చరిత్రకెక్కారు. 100 కోట్లు పైగా పారితోషికాలు, దీంతో పాటు లాభాల్లో వాటాలు, ఏరియా హక్కులు, పంపిణీ హక్కులు అంటూ చాలారకాలుగా సంపాదిస్తున్నారు హిందీ అగ్రహీరోలు.
అయితే ఇప్పుడు బాలీవుడ్ లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న నంబర్ వన్ హీరో ఎవరు? అన్న చర్చ ఉత్కంఠ కలిగిస్తోంది. బాహుబలి స్టార్ లేదా కేజీఎఫ్ రాకింగ్ స్టార్? ఆర్.ఆర్.ఆర్ స్టార్లు చరణ్- తారక్ లేదా పుష్పరాజ్ అల్లు అర్జున్ .. వీళ్లలో ఏ సౌత్ హీరో అత్యధిక పారితోషికం అందుకుంటున్నారు? అన్న చర్చా అభిమానుల్లో సాగుతోంది. అయితే కన్నడ రాకింగ్ స్టార్ యష్ రూ.200 కోట్ల పారితోషికంతో నంబర్ వన్ స్థానంలో ఉన్నారంటూ తాజాగా ప్రముఖ హిందీ మీడియా కథనం వెలువరించింది.
రణబీర్ కపూర్, సాయి పల్లవి ప్రధానపాత్రల్లో నితేష్ తివారీ దర్శకత్వం వహిస్తున్న రామాయణం చిత్రంలో యష్ కీలక పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే. అతడు రావణాసురుడి పాత్రలో నటిస్తున్నారన్న గుసగుసలు ఉన్నాయి. న్యూస్ 18 వెబ్ పోర్టల్ కథనం ప్రకారం కెజిఎఫ్ ఫేమ్ యష్ 200 కోట్ల మొత్తాన్ని వసూలు చేస్తున్నారని తెలుస్తోంది. రామాయణం పాన్ ఇండియన్ సినిమా. యష్ దక్షిణాదిన అతిపెద్ద స్టార్ డమ్ ఉన్న హీరో. ఈ చిత్రానికి యష్ 150 కోట్లు వసూలు చేస్తున్నట్లు ఇంతకుముందు కథనాలొచ్చాయి. కానీ అతడు తన పారితోషికం పెంచాడు, ఇప్పుడు అతడు 200 కోట్లు వసూలు చేస్తున్నాడు! అంటూ సదరు కథనం పేర్కొంది.
ఇదే నిజమైతే బాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే నటుడిగా యష్ బాలీవుడ్ కింగ్ ఖాన్ ను కూడా అధిగమించినట్లేనని ఈ కథనంలో పేర్కొన్నారు. షారుఖ్ ఖాన్ పఠాన్ కోసం 120 కోట్లు వసూలు చేశారని కథనాలొచ్చాయి. ఇప్పుడు యష్ 200 కోట్లు వసూలు చేస్తే అతడు ఇప్పటివరకు బాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే నటుడు అని చెప్పగలం.
రామాయణం చిత్రంలో సన్నీ డియోల్, లారా దత్తా, రవి దుబే తదితరులు కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కనుంది. మొదటి భాగం 2025 చివరలో లేదా 2026 ప్రారంభంలో విడుదల చేస్తారని భావిస్తున్నారు. యష్ ఈ చిత్రంలో కీలక పాత్రను పోషించడమే గాక నిర్మాతగాను పెట్టుబడులు పెడుతున్న సంగతి తెలిసిందే. బహుశా నటుడిగా, నిర్మాతగా అతడు రామాయణం పేరుతో భారీ మొత్తాన్ని ఆర్జించే ఆస్కారం ఉందని భావిస్తున్నారు.