11 కాస్తా 2 : వైసీపీ రాజ్యసభ ఎంపీలు జంప్ నా...?
రాజ్యసభలో టీడీపీకి అసలు ప్రాతినిధ్యం లేదు. మరో రెండేళ్ల వరకూ ఆ ఊసు కూడా మర్చిపోవచ్చు
By: Tupaki Desk | 2 Aug 2024 7:30 AM GMTరాజ్యసభలో టీడీపీకి అసలు ప్రాతినిధ్యం లేదు. మరో రెండేళ్ల వరకూ ఆ ఊసు కూడా మర్చిపోవచ్చు. అయితే అంతవరకూ టీడీపీ ఆగుతుందా అన్నదే చర్చ. ఎందుకంటే లోక్ సభలో బీజేపీకి ప్రాణ వాయువుని టీడీపీకి చెందిన 16 మంది ఎంపీలు ఇస్తున్నారు. అదే బీజేపీకి రాజ్యసభలోనూ లోటు ఉంది.
అక్కడ బిల్లులు పాస్ కావాలంటే వైసీపీ ఎంపీల మద్దతు తప్పనిసరిగా కావాలి. వైసీపీకి ఏకమొత్తంగా 11 మంది ఎంపీలు ఉన్నారు. ఆ విధంగా వైసీపీ సాయం మీద బీజేపీ ఆధారపడడం ఏ మాత్రం టీడీపీ పెద్దలకు నచ్చడం లేదు అంటున్నారు. అందుకే ఫిరాయింపులను ప్రోత్సహించడం ద్వారా వీలైనంత మందిని లాగేయాలని చూస్తోంది అని అంటున్నారు.
దాని కోసం ప్రలోభాలకు తెర తీశారు అని కూడా వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఒక్కో ఎంపీకి ఇన్ని కోట్లు అని బేరం పెట్టారని కూడా ప్రచారం సాగుతోంది. నిండా అయిదేళ్ళ కాలం ఉంది. ప్రతిపక్షంలో ఉంటూ పోరాటాలు చేయడం పక్కన పెడితే ఎవరి బిజినెస్ లు వారికి ఉన్నాయి. అందువల్ల డీల్ మంచిది కుదిరితే జంప్ అయ్యేందుకు ఎవరైనా రెడీనా అంటే ఇపుడున్న కాలం బట్టి చూస్తే జవాబు ఎవరికి వారికే దొరుకుతుంది.
ఒకే సారి అటు శాసనమండలిలో ఇటు రాజ్యసభలో ఫిరాయింపులకు టీడీపీ తెర తీస్తోంది అని వైసీపీ అనుమానిస్తోంది. ఆ పార్టీ మీడియాలోనూ దీని మీదనే గట్టిగా ప్రచారం చేస్తోంది. ఇంతకీ వైసీపీ రాజ్యసభ సభ్యులలో ఎవరు ట్రాప్ కి చిక్కుతారు అంటే పేర్లు అయితే కొన్ని చెబుతున్నారు కానీ నిజంగా అలా జరుగుతుందా అన్నదే చర్చకు వస్తోంది.
రాజ్యసభలో వి విజయసాయిరెడ్డి వైవీ సుబ్బారెడ్డి ఉన్నారు. ఈ ఇద్దరూ పార్టీని మార్చరని ఘంటాపధంగా చెప్పవచ్చు అని అంటున్నారు. దాంతో మిగిలిన వారి మీద డౌటా అంటే పదకొండు నంబర్ కాస్తా రెండు అవుతుందని టీడీపీ అనుకూల మీడియాలో డిబేట్ల సందర్భంగా వస్తున్న మాటలు కౌంటర్లు చూస్తే కనుక ఏమో రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు అని అంటున్నారు.
అలా వస్తున్న వారిలో కొందరు టీడీపీకి కొందరు బీజేపీకి కూడా వెళ్తారని కూడా చెబుతున్నారు. దీంతో ఇదే కనుక జరిగితే ఏపీ రాజకీయాల్లో పెను ప్రకంపనలే చోటు చేసుకుంటాయని అంటున్నారు. అయితే టీడీపీ చేస్తున్న ఈ ప్రయత్నాలు వైసీపీ అధినాయకత్వానికి తెలుసు అని అంటున్నారు.
అప్రమత్తమైన వైసీపీ అధినాయకత్వం తన సొంత మీడియాలో ఈ ఫిరాయింపుల మీద స్టోరీ రాసి అచ్చేసింది. అయితే ఫిరాయించే వారు ఎవరైనా ఇపుడున్న రోజులలో కట్టడి చేస్తే ఆగేలా ఉండరని అంటున్నారు. వైసీపీ ఎన్నడూ లేనంతగా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న వేళ రాజ్యసభ ఎంపీలకు బిగ్ ఆఫర్లు వస్తే వదులుకుంటారా అన్నదే చర్చగా ఉంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.