షాకింగ్: 37 వయసుకే నటుడు రిటైర్‌మెంట్?
అయితే ఇప్పుడు బాలీవుడ్ యువహీరో విక్రాంత్ మాస్సే 37 ఏళ్ల వయసులో నటనకు రిటైర్మెంట్ ప్రకటించాడు.
By: Tupaki Desk | 2 Dec 2024 4:22 AM GMTప్రభుత్వోద్యోగులకు పదవీ విరమణ వయసు 60. కొన్ని ఎంపిక చేసిన ఉద్యోగాలు మినహా చాలా ఉద్యోగాలకు ఈ వయసు సరైనది. అయితే నటనారంగంలో 80 ఏళ్లు పైబడినా కెరీర్ లో కొనసాగుతున్న నటులు ఉన్నారు. ఇటీవల భారతీయ సినీపరిశ్రమల్ని ఏల్తున్న వారిలో 50 పైబడిన వారే అగ్ర హీరోలుగా కొనసాగుతున్నారు. టాలీవుడ్ నాలుగు మూలస్థంబాలు, బాలీవుడ్ లో ఖాన్ ల త్రయం, బచ్చన్ లు కపూర్ లు.. కోలీవుడ్ మాలీవుడ్ లోను పలువురు అగ్ర హీరోలు వీళ్లంతా 50 తర్వాత కూడా అగ్ర హీరోలుగా ఏల్తున్నారు.
చాలా చిన్న వయసులో అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్ నటనారంగం నుంచి దూరమయ్యాడు. అది అభిమానులకు అస్సలు నచ్చలేదు. అయితే ఇప్పుడు బాలీవుడ్ యువహీరో విక్రాంత్ మాస్సే 37 ఏళ్ల వయసులో నటనకు రిటైర్మెంట్ ప్రకటించాడు. గత కొన్ని నెలల్లో ట్వల్త్ ఫెయిల్, సెక్టార్ 36, సబర్మతి ఎక్స్‌ప్రెస్ వంటి వరుస హిట్ చిత్రాలతో భారీగా అభిమానులను సంపాదించుకున్న విక్రాంత్ మాస్సే ఇంత చిన్న వయసులో నటనను విరమిస్తున్నానని ప్రకటించి ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేశాడు. విక్రాంత్ ఇన్‌స్టాగ్రామ్ నోట్ సారాంశం ఇలా ఉంది. 2025లో చివరిసారిగా తన అభిమానులను కలుస్తానని పేర్కొన్నాడు.
గత కొన్ని సంవత్సరాలు .. అంతకు మించినవి అసాధారణమైనవి. మీ మద్దతుకు ధన్యవాదాలు.. కానీ నేను ఒక భర్తగా, తండ్రిగా, ఒక నటుడిగా ఇంటికి తిరిగి వెళ్లవలసిన సమయం ఆసన్నమైంది కాబట్టి 2025లో మనం ఒకరినొకరు చివరిసారి కలుసుకుంటాము. సరైన సమయంలో వెళుతున్నాను. గత 2 సినిమాలు.. చాలా సంవత్సరాల జ్ఞాపకాలు.. ప్రతిదానికి... మళ్ళీ ధన్యవాదాలు.. ఎప్పటికీ రుణపడి ఉంటాను! అని రాసాడు. విక్రాంత్ ప్రస్తుతం యార్ జిగ్రీ , ఆంఖోన్ కి గుస్తాఖియాన్ అనే రెండు చిత్రాల షూటింగ్‌లతో బిజీగా ఉన్నాడు.
అయితే విక్రాంత్ నిర్ణయాన్ని అభిమానులు స్వాగతించలేదు. వారంతా తమ విచారాన్ని వ్యక్తం చేసారు. ఇది నిజం కాదని నేను ఆశిస్తున్నాను అని ఒకరు వ్యాఖ్యానించగా.. ''మీరు బాలీవుడ్ తదుపరి ఇమ్రాన్ ఖాన్‌గా ఎందుకు మారాలనుకుంటున్నారు. అతను కుటుంబాన్ని ఎంచుకున్నందున మేము ఇప్పటికే అత్యుత్తమ నటులలో ఒకరిని కోల్పోయాము'' అని రాసారు. బ్రో మీరు పీక్‌లో ఉన్నారు...ఎందుకు ఇలా అనుకుంటున్నారు? అని ఒకరు ప్రశ్నించారు.
విక్రాంత్ మాస్సే సినీటీవీ నటుడిగా చాలా దూరం వచ్చారు - టెలివిజన్ నుండి పెద్ద స్క్రీన్ వరకు OTT వరకు ప్రయాణించారు. ధూమ్ మచావో ధూమ్ షోతో విక్రాంత్ టెలివిజన్‌లోకి అడుగుపెట్టాడు. 2009లో బాలికా వధు ద్వారా ఖ్యాతిని పొందాడు. కొంకణా సేన్ శర్మ దర్శకత్వం వహించిన ఎ డెత్ ఇన్ ది గంజ్‌లో తన అద్భుతమైన నటనతో అందరినీ ఆకర్షించాడు. ఛపాక్, రాంప్రసాద్ కి తెహ్ర్వి, హసీన్ దిల్‌రూబా, గ్యాస్‌లైట్ వంటి చిత్రాలలో తనను తాను నిరూపించుకున్నాడు. బ్రోకెన్ బట్ బ్యూటిఫుల్, క్రిమినల్ జస్టిస్, మీర్జాపూర్ వంటి వెబ్ సిరీస్‌లలో నటించాడు. గత సంవత్సరం విధు వినోద్ చోప్రా 'ట్వల్త్ ఫెయిల్' లో నటనకు గాను ఎన్డీటీవీ ఇండియన్ ఆఫ్ ది ఇయర్ 'యాక్టర్ ఆఫ్ ది ఇయర్' పురస్కారాన్ని గెలుచుకున్నాడు.