సీనియర్స్‌ని డామినేట్ చేస్తోన్న జూనియర్స్..!
ఆయ్ సినిమాతో అంజి, కమిటీ కుర్రాళ్లు సినిమాతో వంశీ, మారుతి నగర్ సుబ్రహ్మణ్యం సినిమాతో లక్ష్మణ్ కార్య, వీరాంజనేయులు విహార యాత్ర తో అనురాగ్ లు మంచి పేరు సొంతం చేసుకున్నారు.
By: Tupaki Desk | 26 Aug 2024 4:30 PM GMTఒకప్పుడు స్టార్ హీరోల సినిమాలకు సీనియర్ దర్శకులు, హిట్ కొట్టిన పెద్ద దర్శకులు మాత్రమే దర్శకత్వం వహించడం చూశాం. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. మెగాస్టార్ చిరంజీవి మొదలుకుని చిన్న హీరోల వరకు ప్రతి ఒక్కరు కూడా కొత్త వారికి అవకాశం ఇవ్వాలి అనుకుంటున్నారు. ఒక్క సినిమాతో తమను తాము నిరూపించుకున్న దర్శకులు చాలా మంది ఇప్పుడు ఇండస్ట్రీని దున్నేసే స్థాయికి ఎదిగారు. చిరంజీవి ప్రస్తుతం బింబిసార దర్శకుడు వశిష్టతో సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. ఒక్క హిట్ తోనే ఏకంగా మెగాస్టార్ చిరంజీవి తో సినిమా చేసే అవకాశంను దక్కించుకున్నాడు.
వశిష్ట మాదిరిగా ఎంతో మంది దర్శకులు ఒక్క సినిమా హిట్ తోనే పెద్ద హీరోలను పట్టారు. ఉప్పెన సినిమాతో సూపర్ హిట్ ను సొంతం చేసుకున్న బుచ్చి బాబు రెండో సినిమాగానే రామ్ చరణ్ సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. తక్కువ సమయంలో స్టార్ హీరోల సినిమాలకు దర్శకత్వం వహించే అవకాశాలు దక్కించుకున్న దర్శకులు మరికొంత మంది ఉన్నారు. జాతిరత్నాలు దర్శకుడు అనుదీప్ ప్రస్తుతం రవితేజ తో ఒక సినిమాకు రెడీ అవుతున్నాడు. తాజాగా మరికొందరు కొత్త దర్శకులు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.
ఆయ్ సినిమాతో అంజి, కమిటీ కుర్రాళ్లు సినిమాతో వంశీ, మారుతి నగర్ సుబ్రహ్మణ్యం సినిమాతో లక్ష్మణ్ కార్య, వీరాంజనేయులు విహార యాత్ర తో అనురాగ్ లు మంచి పేరు సొంతం చేసుకున్నారు. ఈ కుర్ర దర్శకులు, కొత్త దర్శకులు టాలీవుడ్ లో రాబోయే ఒకటి రెండేళ్లలో స్టార్ హీరోల సినిమాలకు దర్శకత్వం వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో చాలా మంది హీరోలు సీనియర్ దర్శకుల కంటే కూడా ట్యాలెంట్ ఉన్న కుర్రాళ్లను ఎంకరేజ్ చేస్తున్నారు.
ప్రస్తుతం రవితేజ చేస్తున్న రెండు సినిమాలకు కొత్త కుర్రాళ్లు దర్శకత్వం వహిస్తున్నారు. ఇంకా చాలా మంది యంగ్ హీరోలు కూడా ఒకటి రెండు సినిమాలు చేసిన దర్శకుల వెంట పడుతున్నారు. చిన్న సినిమాలతో పెద్ద విజయాలను సొంతం చేసుకోవడంతో వారి వైపు ఆసక్తిగా యంగ్ హీరోలు చూస్తున్నారు. పలువురు సీనియర్ హీరోలు, స్టార్ హీరోలు ఒకానొక సమయంలో సీనియర్ దర్శకులతో కమిట్ అయ్యి, క్యాన్సిల్ చేసుకుని కొత్త దర్శకులతో, జూనియర్ దర్శకులతో సినిమాలు చేసేందుకు సిద్ధం అయ్యారు. మొత్తానికి సీనియర్ ల మీద జూనియర్ లు డామినేట్ చేస్తున్నారు.