Begin typing your search above and press return to search.

స్టార్లు చెవిలో పువ్వు ఎలా పెడ‌తారో భ‌లేగా చెప్పాడు!

బాలీవుడ్ తారల ఈ కపటత్వాన్ని యూట్యూబర్ ప్రశ్నించారు. ''తార‌ల‌ నుండి జీవితం - పోషకాహార సలహా తీసుకోవద్దు.

By:  Tupaki Desk   |   1 Sep 2024 2:45 AM GMT
స్టార్లు చెవిలో పువ్వు ఎలా పెడ‌తారో భ‌లేగా చెప్పాడు!
X

త‌మను ఆరాధ్య దేవ‌త‌లుగా భావించే ప్ర‌జ‌ల‌కు త‌మ ఫేవ‌రెట్ స్టార్లు ఎలా చెవిలో పుష్పం పెడ‌తారో చూపించే ఒక వీడియో ఇప్పుడు వైర‌ల్ గా మారింది. ఫిట్‌నెస్ ఇన్‌ఫ్లుయెన్సర్ - యూట్యూబర్ నితిన్ మౌర్య ఫేవ‌రెట్ స్టార్లు తాము ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తూ అనారోగ్యకరమైన ఆహారాన్ని, కోలాల్ని ఆమోదిస్తున్నారని విమర్శించారు. ఇటీవల ఆలియా భట్, సమంతా రూత్ ప్రభు, కార్తీక్ ఆర్యన్ సహా పలువురు ప్రముఖులు జంక్ ఫుడ్ ఐటమ్స్ కోసం టెలివిజన్ వాణిజ్య ప్రకటనలలో నటించినప్పటికీ ఆరోగ్యంగా ఉండాల‌ని ప్ర‌జ‌ల‌కు చెబుతున్న వీడియోను యూట్యూబర్ విడుద‌ల చేసాడు. దీనికి అద్భుత స్పంద‌న వ‌స్తోంది.

పిజ్జాలు, బ‌ర్గర్‌లు, చక్కెర వంటి జంక్ ఫుడ్‌లకు దూరంగా ఉండటం ప్రాముఖ్యతను ప‌లువురు స్టార్లు ఈ వీడియోలో వివ‌రిస్తున్నారు. హీరో కార్తీక్ ఆర్యన్ జంక్ ఫుడ్ గురించి చర్చిస్తున్న‌ వీడియో ని చూపించాక‌.. అతడు బర్గర్ బ్రాండ్‌ను ప్రమోట్ చేయ‌డం అప‌హాస్యంగా క‌నిపిస్తుంది. పాడ్‌కాస్ట్‌లో షుగర్, చాక్లెట్‌లను వ‌దులుకోవాల్సిన ఆవ‌శ్య‌క‌త గురించి సమంత మాట్లాడుతోంది. కానీ కొబ్బరి నూనె వినియోగాన్ని ప్రోత్సహిస్తుంది. చాక్లెట్ బ్రాండ్‌ను ఆమోదించడం కూడా కనిపిస్తుంది. ఇదే వీడియోలో ఆలియా భట్ షుగర్ (చ‌క్కెర‌) ఆరోగ్యానికి ఎందుకు మంచిది కాదు అనే దాని గురించి మాట్లాడుతుంది. ది కపిల్ శర్మ షోలో ఆలియా చక్కెరతో కాఫీ తీసుకోవడానికి నిరాకరించిన‌ క్లిప్ ఇందులో ఉంది. అయితే ఇంత‌లోనే ఆలియా చాక్లెట్ బ్రాండ్‌ను ప్రచారం చేస్తూ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది.

సారా అలీ ఖాన్ ఒక టెలివిజన్ వాణిజ్య ప్రకటనలో పిజ్జా తింటూ శీతల పానీయం తాగినట్లు చూపించారు. అయితే అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా ఒక ఇంటర్వ్యూలో జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాల‌ని పేర్కొంది. అనన్య పాండే తనకు సిగరెట్ కాల్చడం తెలియదని చెప్పింది ఓ వీడియోలో. అయితే ఒక వైరల్ క్లిప్‌లో ధూమపానం చేస్తూ కనిపించింది. ఇది షారుఖ్ ఖాన్ -అజయ్ దేవగన్ పొగాకు బ్రాండ్‌ను ఆమోదించడంతో ముగుస్తుంది.

బాలీవుడ్ తారల ఈ కపటత్వాన్ని యూట్యూబర్ ప్రశ్నించారు. ''తార‌ల‌ నుండి జీవితం - పోషకాహార సలహా తీసుకోవద్దు. వారు మీరు అనుస‌రించాల్సిన త‌ర‌హా కాదు. వారు కూడా మీలాగా లేదా నాలాగా లోపభూయిష్టులు. నైతికత -విలువలు లేనివారు. వాళ్లు పొగాకు తినరు.. కానీ మ‌న‌ల్ని తినమని అడుగుతారు. వారు విషాన్ని తినరు.. కానీ మీరు తినాల‌ని అంటారు. వారు బెట్టింగ్‌లో తమ డబ్బును రిస్క్ చేయరు.. కానీ అలా చేయమని మిమ్మల్ని అడుగుతారు. మీకు అర్థమైందా?'' అని నిల‌దీసాడు.

ఈ వీడియో ఆన్‌లైన్‌లో షేర్ చేసిన వెంటనే పలువురు నెటిజ‌నులు దీనిపై స్పందించారు. బాలీవుడ్ తారలపై నిరాశను వ్యక్తం చేశారు. ఇది ప్రతి ఒక్క భారతీయుడితో షేర్ చేయాల్సిన వీడియో! అని నెటిజ‌నుల్లో ఒకరు రాశారు. మీ హీరోలను తెలివిగా ఎన్నుకోండి.. వారిలో ఎక్కువ మంది నటులు..వారు నటించారు అని మరొకరు కామెంట్ చేసారు.