Begin typing your search above and press return to search.

1000 కోట్ల డైరెక్ట‌ర్ గొంతు కోశారు

ఇక ఎంఆర్ ఎఫ్ స్పై యూనివర్శ్ లో ప‌ఠాన్ 2 కూడా తెర‌కెక్కుతుంద‌ని క‌థ‌నాలొచ్చాయి.

By:  Tupaki Desk   |   31 March 2024 2:45 AM GMT
1000 కోట్ల డైరెక్ట‌ర్ గొంతు కోశారు
X

2023 సంవ‌త్స‌రంలో ది బెస్ట్ చిత్రాన్ని అందించాడు సిద్ధార్థ్ ఆనంద్. కింగ్ ఖాన్ షారూఖ్ దిగ‌జారిన గ్రాఫ్ ని స‌రి చేసాడు. అత‌డికి నిజానికి పున‌రుజ్జీవాన్ని ఇచ్చాడు. మ‌నం మాట్లాడుతున్న‌ది ఏ సినిమా గురించో చెప్పాల్సిన ప‌నిలేదు. కింగ్ ఖాన్ న‌టించిన 'ప‌ఠాన్' గురించే ఇదంతా. భారీ యాక్ష‌న్ విన్యాసాల‌తో ప‌ఠాన్ ని బెస్ట్ యాక్ష‌న్ చిత్రంగా నిల‌ప‌డంలో సిద్ధార్థ్ ఆనంద్ గొప్ప విజ‌యం సాధించాడు. ఈ సినిమా ఏకంగా బాక్సాఫీస్ వ‌ద్ద 1000 కోట్లు వ‌సూలు చేసింది. ఇక ఎంఆర్ ఎఫ్ స్పై యూనివర్శ్ లో ప‌ఠాన్ 2 కూడా తెర‌కెక్కుతుంద‌ని క‌థ‌నాలొచ్చాయి. ప‌ఠాన్ క్లైమాక్స్ లోనే దీనికి హింట్ కూడా ఇచ్చారు.


అంతా బాగానే ఉంది కానీ, ఇప్పుడు అంత పెద్ద విజ‌యాన్ని అందించిన ద‌ర్శ‌కుడిని వైఆర్ఎఫ్ ప‌క్క‌న పెడుతుండ‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. త‌దుప‌రి ప‌ఠాన్ 2ని అత్యంత భారీ బ‌డ్జెట్ తో నిర్మించ‌నున్న ఆదిత్యా చోప్రా ఈసారి ద‌ర్శ‌కుడిని మార్చే యోచ‌న చేస్తున్నాడ‌ని తెలుస్తోంది. సిద్ధార్థ్ ఆనంద్ ఫైనెస్ట్ యాక్ష‌న్ చిత్రాల‌తో నిరూపించిన ద‌ర్శ‌కుడు. అయినా కానీ సీక్వెల్ కి అత‌డు ప‌ని చేయ‌డ‌ని తెలుస్తోంది. షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనే నటించనున్న 'పఠాన్ 2'లో సిద్ధార్థ్ ఆనంద్ భాగం కాలేడని తాజా క‌థ‌నాలు వెల్లడిస్తున్నాయి.

YRF ప్రతిష్టాత్మక స్పైవర్స్ లో వార్- పఠాన్‌లకు దర్శకత్వం వహించిన సిద్ధార్థ్ ఆనంద్ ఇక ఈ ఫ్రాంఛైజీలో ప‌ని చేయ‌డ‌ని తెలియ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. అయితే నిర్మాత ఆదిత్యా చోప్రా ఈ నిర్ణ‌యం ఎందుకు తీసుకున్నారు? అంటే దానికి స‌హేతుక కార‌ణం కూడా ఉంది. YRF స్పైవర్స్ వెనుక సూత్రధారి అయిన నిర్మాత ఆదిత్య చోప్రా సీక్వెల్స్ కోసం ఇతర దర్శకులతో ప‌ని చేయాల‌ని .. ఫ్రాంచైజీలో దర్శకులను పునరావృతం చేయాలనుకోవడం లేదని స‌న్నిహిత‌ వర్గాలు పేర్కొన్నాయి. ఈ గూఢచారి విశ్వంలో భాగమైన పాత్రలకు సరికొత్త దృక్పథాన్ని తీసుకురావాలని అతడు మ‌ల్టీ ట్యాలెంటెడ్ డైరెక్ట‌ర్లను వెతుకుతున్న‌ట్టు తెలుస్తోంది.

హిందీ మీడియాలో వ‌చ్చిన తాజా క‌థ‌నాల ప్ర‌కారం... పఠాన్ 2 నిజానికి ప్రీప్రొడ‌క్ష‌న్ లో ఉందని తెలుస్తోంది. ఆదిత్య చోప్రా ప్రతి YRF స్పై యూనివర్స్ చిత్రానికి వ్యూహాత్మకంగా దర్శకులను ఎంచుకుంటున్నాడు. సీక్వెల్ సినిమాలకు దర్శకులను ఎన్నడూ పునరావృతం చేయలేదు. ఇది టైగర్ - వార్ సీక్వెల్‌ల విష‌యంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సంప్రదాయం పఠాన్ 2 కి కూడా కొనసాగుతుంది. సిద్ధార్థ్ ఆనంద్ సృష్టించిన‌ షారుఖ్ గూఢచారి పాత్రకు కొత్త‌ దృక్పథాన్ని చేర్చ‌డానికి కొత్త దర్శకుడి కోసం వెతుకుతూ అత‌డిని పక్కన పెట్టాడు. సీక్వెల్‌కి దర్శకుడు ఖరారు కానప్పటికీ, ఈ ఏడాది చివరికల్లా ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించాల‌ని ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈసారి ప‌ఠాన్ 2 కి ఒక సౌత్ ద‌ర్శ‌కుడు ద‌ర్శ‌క‌త్వం వ‌హించే అవ‌కాశాన్ని కాద‌న‌లేమ‌నే గుస‌గుస వినిపిస్తోంది. అత‌డు అట్లీ కావొచ్చు.. లేదా ఇంకెవ‌రైనా కావొచ్చ‌న్న ఊహాగానాలు కూడా సాగుతున్నాయి.

నిర్మాత ఆదిత్య చోప్రా ఆలోచ‌న గురించి తెలియాలంటే గ‌తాన్ని ప‌రిశీలించాలి. 2012లో ఏక్ థా టైగర్‌కు కబీర్ ఖాన్ దర్శకత్వం వహించగా, 2017లో అలీ అబ్బాస్ జాఫర్ టైగర్ జిందా హైకి దర్శకత్వం వహించారు. 2023లో టైగర్ 3కి మనీష్ శర్మ దర్శకత్వం వహించగా, వార్ 2కి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. టైగర్ -వార్ ఫ్రాంచైజీలతో పాటు, YRF స్త్రీ-కేంద్రీకృత స్పై థ్రిల్లర్‌ను కూడా నిర్మిస్తోంది. ఇందులో అలియా భట్, శర్వరీ వాఘ్ ప్రధాన పాత్రలలో నటించారు. దీనికి శివ రావైల్ దర్శకత్వం వహించనున్నారు. మరోవైపు 'టైగర్ vs పఠాన్‌'లో సల్మాన్ ఖాన్ - షారుఖ్ ఖాన్ ఒక‌రితో ఒక‌రు త‌ల‌ప‌డ‌నున్నారు. సిద్ధార్థ్ ఆనంద్ ఈ స్పైవర్స్‌లో భాగమైన ఈ భారీ యాక్షన్ ఎక్స్‌ట్రావాగాంజాలో భాగమవుతాడో లేదో ఇంకా వేచి చూడాలి. ఇప్ప‌టికి ప‌ఠాన్ నుంచి అత‌డిని తొల‌గించడం అభిమానుల‌ను ఆశ్చ‌ర్యంలో ముంచెత్తింది.