Begin typing your search above and press return to search.

ద‌క్షిణాది స్టార్ల వెంట‌ప‌డుతున్న హిందీ అగ్ర‌బ్యాన‌ర్ లాజిక్?

ప్ర‌తిష్ఠాత్మ‌క య‌ష్ రాజ్ ఫిలింస్

By:  Tupaki Desk   |   24 July 2023 6:03 AM GMT
ద‌క్షిణాది స్టార్ల వెంట‌ప‌డుతున్న హిందీ అగ్ర‌బ్యాన‌ర్ లాజిక్?
X

ప్ర‌తిష్ఠాత్మ‌క య‌ష్ రాజ్ ఫిలింస్ (YRF) 50 సంవ‌త్సరాలు పూర్తి చేసుకున్న వేళ 'ప‌ఠాన్' లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాన్ని అందించింది. అయితే అంత‌కుముందు వ‌రుస‌గా కొన్ని భారీ చిత్రాలు బిగ్ ఫ్లాప‌వ్వడం య‌ష్ రాజ్ బ్యాన‌ర్ ని తీవ్రంగా నిరాశ‌ప‌రిచింద‌న్నది గ‌మ‌నించ‌ద‌గిన‌ది. ఇక ఇటీవ‌ల పాన్ ఇండియా హిట్లు కొట్ట‌డంలో సౌత్ దూసుకుపోతుంటే బాలీవుడ్ వెన‌క‌బడిపోవ‌డం య‌ష్ రాజ్ బ్యాన‌ర్ ని తీవ్రమైన ఆలోచ‌న‌లో ప‌డేసింద‌న్న‌ది వాస్త‌వం. ఓ వైపు తాము వ‌రుస ఫ్లాపులు డిజాస్ట‌ర్ల‌తో అలుసైపోతుంటే సౌత్ సినిమాలు పాన్ ఇండియా హిట్లు కొడుతూ 1000 కోట్ల క్ల‌బ్ లు సృష్టిస్తూ చ‌రిత్ర‌గా మారాయి. ఆర్.ఆర్.ఆర్ - కేజీఎఫ్ 2 సంచ‌ల‌న విజ‌యాలు సాధించ‌డంలో ఉత్త‌రాది ఆడియెన్ పాత్ర ఎంతో కీల‌క‌మైన‌ది. హిందీ ట్రేడ్ స‌హా సినీప్ర‌ముఖులు దీనిని స్ప‌ష్ఠంగా గ‌మ‌నించారు.

అయితే బాలీవుడ్ స్టార్ హీరోలు సౌత్ లో ఇలాంటి ఫీట్ ని సాధించగ‌ల‌రా? అన్న‌దే వారి ముందున్న ప్ర‌శ్న‌. నిజానికి సౌత్ స్టార్ హీరోలు ఉత్త‌రాది ప్రేక్ష‌కుల మ‌న‌సులు దోచారు. కానీ హిందీ హీరోలు తెలుగు ప్రేక్ష‌కులు లేదా సౌత్ ప్రేక్ష‌కుల మ‌న‌సులు దోచేయ‌డం అన్న‌ది అంత సులువైన ప‌ని కాద‌ని వారికి తెలుసు.

అందుకే ఇప్పుడు బాలీవుడ్ సినిమాల‌కు ద‌క్షిణాది మార్కెట్ కావాలంటే క‌చ్ఛితంగా ఎవ‌రైనా ఒక ద‌క్షిణాది అగ్ర హీరో త‌మ సినిమాల్లో న‌టించాల్సి ఉంది. అది కూడా పాన్ ఇండియా స్టార్లుగా ఓ వెలుగు వెలిగిన ద‌క్షిణాది హీరోల్ని త‌మ సినిమాల్లో న‌టింప‌జేస్తే పాన్ ఇండియా మార్కెట్ ని కొల్ల‌గొట్ట‌డం అంత క‌ష్ట‌మేమీ కాద‌ని హిందీ అగ్ర‌బ్యాన‌ర్లు విశ్లేషించాయి. ఈ విష‌యంలో య‌ష్ రాజ్ ఫిలింస్ ఇప్పుడు తెలివైన ఎత్తుగ‌డ‌ల‌తో ముందుకు సాగుతోంది. ద‌క్షిణాది మార్కెట్ ని క్లీన్ స్వీప్ చేయాల‌న్న ప‌ట్టుద‌ల‌తో ర‌క‌ర‌కాల వ్యూహాల్ని తెర‌పైకి తెచ్చింది స‌ద‌రు సంస్థ‌.

ఇందులో భాగంగానే త‌దుప‌రి హృతిక్ రోష‌న్ వార్ 2లో ఆర్.ఆర్.ఆర్ స్టార్ ఎన్టీఆర్ కి అవ‌కాశం క‌ల్పించింది. YRF స్పైవర్స్ సినిమాలలో ఇక‌పై సౌత్ స్టార్లు భాగం అవుతార‌ని య‌ష్ రాజ్ బ్యాన‌ర్ దీంతో సంకేతం ఇచ్చింది. YRF స్పైవర్స్ మొత్తం సల్మాన్ ఖాన్- షారుఖ్ ఖాన్- హృతిక్ రోషన్ - టైగర్ ష్రాఫ్‌ సహా బాలీవుడ్ స్టార్స్ మాత్రమే ఉన్నారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేక పాత్రలో ప్రవేశించనున్నారు. దీని ఉద్దేశం... YRF సంస్థ మునుముందు టాలీవుడ్ అగ్ర హీరోల‌తో చేతులు కలిపేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసింద‌ని అర్థ‌మ‌వుతోంది. మునుముందు య‌ష్ రాజ్ సంస్థ‌లో స్పైవర్స్ చిత్రానికి సోలో లీడ్ గా తెలుగు స్టార్లు న‌టించే అవ‌కాశం లేక‌పోలేదు. ఎన్టీఆర్ తో పాటు రామ్ చ‌ర‌ణ్‌- ప్ర‌భాస్- మ‌హేష్‌- య‌ష్- ద‌ళ‌ప‌తి విజ‌య్ లాంటి స్టార్లు య‌ష్ రాజ్ బ్యాన‌ర్ సినిమాల్లో న‌టించేందుకు ఆస్కారం ఉందన‌డంలో సందేహం లేదు.

య‌ష్ రాజ్ బ్యాన‌ర్ నుంచి భారీ యాక్ష‌న్ సినిమా 'టైగర్ 3' ఇప్ప‌టికే విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. అయితే ఇందులో కేవ‌లం స‌ల్మాన్- ష‌రూఖ్ మాత్ర‌మే క‌నిపిస్తారు. సౌత్ హీరోకి ఛాయిస్ లేదు. త‌దుప‌రి వార్ 2, టైగర్ వర్సెస్ పఠాన్ ఇతర స్పైవర్స్ చిత్రాలను YRF సంస్థ వ‌రుస‌గా తెర‌కెక్కిస్తోంది. వీటిలో ద‌క్షిణాది అగ్ర హీరోలకు ఆస్కారం ఉంది. సౌత్ స్టార్ల‌ను త‌మ సినిమాల్లోకి ప్ర‌వేశ పెట్ట‌డం ద్వారా సౌత్ లో భారీ వ‌సూళ్ల‌ను సాధించాల‌నే ఎత్తుగ‌డ‌ను వైఆర్.ఎఫ్ సంస్థ ఇక‌పై అనుస‌రించ‌నుంది.

తాము తెర‌కెక్కించే ప్ర‌తి సినిమాలో సౌత్ స్టార్ హీరోని భాగం చేయ‌డం ద్వారా అనుకున్న ల‌క్ష్యాన్ని ఛేధించ‌డం సాధ్య‌మ‌వుతుంద‌ని య‌ష్ రాజ్ బ్యాన‌ర్ భావిస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు స‌హా త‌మిళ‌నాడు క‌ర్నాట‌క‌లో మార్కెట్ ని పెంచుకోవాల‌నే వ్యూహాన్ని బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ‌లు అనుస‌రించ‌నున్నాయి. య‌ష్ రాజ్ బ్యాన‌ర్ బాట‌లోనే ఇత‌ర హిందీ అగ్ర నిర్మాణ సంస్థ‌లు ముందుకు సాగుతాయ‌న‌డంలో సందేహం లేదు. తారక్ త‌ర్వాత య‌ష్ రాజ్ బ్యాన‌ర్ లో ఏ ద‌క్షిణాది హీరోకి జాక్ పాట్ ద‌క్కుతుందో వేచి చూడాలి.