తూర్పు నుంచి వైసీపీ రెండవ వికెట్ పడుతుందా...!?
జగన్ సిద్ధం అంటూ విశాఖ జిల్లా భీమిలీలో ఎన్నికల శంఖారావం పూరించారు. ఇక్కడ నుంచే యుద్ధం అంటూ గర్జించారు
By: Tupaki Desk | 29 Jan 2024 3:46 AM GMTజగన్ సిద్ధం అంటూ విశాఖ జిల్లా భీమిలీలో ఎన్నికల శంఖారావం పూరించారు. ఇక్కడ నుంచే యుద్ధం అంటూ గర్జించారు. తాను అర్జునుడిని అని కూడా చెప్పుకున్నారు. అయితే జగన్ సభకు కీలక నేత గైర్ హాజరు కావడం విశేషం. ఆమె భీమిలి కి చెందిన వారు. పైగా వీఎమ్మార్డీయే చైర్ పర్సన్ గా ఉంటున్నారు. ఆమె అక్రమాని విజయనిర్మల.
ఆమె 2019 ఎన్నికల్లో విశాఖ తూర్పు నుంచి వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి వెలగపూడి రామక్రిష్ణబాబు మీద ఓడిపోయారు. ఆమె ఆరు నెలల క్రితం వరకూ విశాఖ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ ఇంచార్జిగా ఉన్నారు.
ఎపుడైతే విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ తూర్పు ఇంచార్జి అయ్యారో అప్పటి నుంచి ఆమె పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇటీవల ఆమె పార్టీ మారుతారు అని ప్రచారం కూడా సాగింది. ఇవన్నీ ఇలా ఉంటే సాక్షాత్తూ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి తమ ప్రాంతానికి వచ్చి మీటింగ్ పెడితే అక్రమాని గైర్ హాజరు కావడం విడ్డూరమే అంటున్నారు
పైగా జగన్ సిద్ధం సభ పెట్టిన ప్రాంతం కూడా ఆమెదే. తన సొంత స్థలంలో వైసీపీ భారీ మీటింగ్ ఎన్నికల సభ పెడితే ఆమె ఆ దగ్గరలోనే ఇంట్లో నుంచి ఆ మీటింగ్ ని అంతా టీవీల ద్వారా చూశారు తప్ప సభకు రాలేదు. దీంతో ఆమె పార్టీకి దూరమేనా అన్న చర్చ మరోసారి వస్తోంది.
విశాఖ తూర్పు అయినా భీమిలీ అయినా తనకు టికెట్ ఇవ్వాలని ఆమె అధినాయకత్వాన్ని కోరుతున్నారు అని అంటున్నారు. ఆమె గతంలో భీమునిపట్నం మున్సిపల్ చైర్ పర్సన్ గా చేశారు. దాంతో ఆమె భీమినిపట్నం సీటు అడుగుతున్నారు. అది వీలు కాకపోతే తూర్పు అయినా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే భీమిలీకి మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు ఉన్నారు.
తూర్పు సీటు ఎంవీవీకి గ్యారంటీగా ఇస్తారు. దాంతో పార్టీకి పనిచేస్తే అధికారంలోకి వచ్చిన తరువాత అవకాశాలు ఇస్తామని హామీ మాత్రమే ఇస్తున్నారుట. దాంతో ఆమె పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. అయితే ఆమె టీడీపీలో చేరుతారా లేక జనసేనలోనా అన్నది తెలియడంలేదు ఆ రెండు పార్టీలలో చేరినా ఆమెకు టికెట్ అయితే హామీ ఉండదని అంటున్నారు.
కానీ వైసీపీ మీద కోపంతో పార్టీ మారక తప్పదు కదా అని ఆమె అనుచరులు అంటున్నారు. ఇప్పటికే తూర్పు టికెట్ దక్కలేదని వైసీపీ ఎమ్మెల్సీ వంశీ క్రిష్ణ శ్రీనివాస్ జనసేనలోకి వెళ్ళిపోయారు. ఇపుడు అదే తూర్పు నుంచి రెండవ వికెట్ పడుతుందా అన్న చర్చ సాగుతోంది. అదే జరిగితే ఎంపీ ఎంవీవీ గెలుపు కోసం గట్టిగా కష్టపడాలని అంటున్నారు. ఎందుకంటే పార్టీని వీడుతున్న వారు అంతా బీసీలు తూర్పులో బలమైన యాదవ సామాజిక వర్గానికి చెందిన వారు కావడం గమనార్హం.మరి అధినాయకత్వం ఆమెకు ఏ విధంగా నచ్చచెబుతుందో చూడాల్సి ఉంది.