బాబు బాటలో షర్మిల : ఇక తేల్చాల్సింది పవనేనా...?
తెలంగాణా ఎన్నికల్లో బహుముఖ పోటీలు ఉంటాయని అంతా అనుకున్నారు. మెల్లగా మబ్బులు వీడిపోతున్నట్లుగా రాజకీయ స్పష్టత వస్తోంది.
By: Tupaki Desk | 3 Nov 2023 9:30 AM GMTతెలంగాణా ఎన్నికల్లో బహుముఖ పోటీలు ఉంటాయని అంతా అనుకున్నారు. మెల్లగా మబ్బులు వీడిపోతున్నట్లుగా రాజకీయ స్పష్టత వస్తోంది. అంతా కలసి కూడబలుక్కున్నట్లుగా ఒక్కొక్కరూ పోటీ నుంచి తప్పుకుంటున్నట్లుగా ప్రకటిస్తున్నారు. నిన్నటికి నిన్న టీడీపీ తెలంగాణలో పోటీ చేయడం లేదు అని చెప్పేసింది.
ఇపుడు వైఎస్సార్టీపీ వంతు అన్నట్లుగా షర్మిల కూడా పోటీకి దూరం అని స్టేట్మెంట్ ఇచ్చేశారు. అంతే కాదు ఆమె మరో అడుగు ముందుకేసి తమ పార్టీ మద్దతు కాంగ్రెస్ కే అంటూ ట్విస్ట్ ఇచ్చారు. ఆ మాట చంద్రబాబు పార్టీ అయితే అనలేదు, కానీ కాంగ్రెస్ కి మద్దతు కోసమే టీడీపీ తప్పుకుందని ప్రచారం అయితే సాగుతోంది. ఒక బలమైన సామాజిక వర్గం ఈసారి కాంగ్రెస్ వైపు నిలిచి ఉందని, అందుకే చీలికను అడ్డుకోవడానికి పోటీ నుంచి తప్పుకుంది టీడీపీ అని అంటున్నారు.
దీని మీద బీజేపీ నేత ఈటెల రాజేందర్ కూడా చంద్రబాబు వైఖరిని తప్పుపడుతూ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ ని పైకి లేపే ప్రయత్నంలో భాగమే బాబు తన పార్టీని పోటీ చేయించకపోవడం అని ఆయన అంటున్నారు. ఇక ఇపుడు మరో పార్టీ వైపు అందరి చూపూ ఉంది. అదే జనసేన. చాలా కాలం క్రితమే 32 సీట్లకు తెలంగాణాలో తాము పోటీ చేస్తున్నట్లుగా పవన్ కళ్యాణ్ ఏపీ నుంచి ప్రకటించారు.
దాంతో అది నాడు సంచలనం అయింది. ఆ తరువాత పోటీ చేసి తీరాల్సిందే అని తెలంగాణా జనసేన క్యాడర్ కూడా పవన్ ని కలసి వినతి చేశారు. ఈ నేపధ్యంలో బీజేపీ మద్దతు కోరడం జరిగింది. అలా కిషన్ రెడ్డి పవన్ ఇద్దరూ ఢిల్లీ వెళ్ళి కేంద్ర మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు.
పొత్తులో భాగంగా కొన్ని సీట్లు జనసేనకు ఇచ్చేందుకు కూడా బీజేపీ అంగీకరించింది. ఈ కీలకమైన టైం లో పవన్ విదేశాల్లో ఉన్నారు. పవన్ వచ్చిన తరువాత పొత్తులు ఒక కొలిక్కి వస్తాయని బీజేపీ సహా అంతా ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇపుడు జనసేన నిజంగా పోటీ చేస్తుందా అన్న చర్చ అయితే సాగుతోంది.
ఎదుకంటే అటు బీయారెస్ ఇటు కాంగ్రెస్ అంటూ రెండు పార్టీల మధ్యనే భీకరమైన పోరు సాగే సన్నివేశం తెలంగాణాలో కనిపిస్తోంది. బీజేపీ పోటీ చేసినా గెలిచేది ఎక్కడ అన్నది కూడా ప్రశ్నగా ఉంది. మూడవ పక్షంగా కొంతలో కొంత ఉనికి చాటుకుంటే మేలు కానీ అలా కాకుండా పోటీ చేయడం అన్నది బీజేపీ వ్యూహం కావచ్చు కానీ పొత్తు పెట్టుకుని జనసేన ఎందుకు తెలంగాణా రాజకీయాల్లో ఇబ్బంది పడాలన్న చర్చ కూడా సాగుతోంది.
ఏపీలో చంద్రబాబుతో పొత్తు ఉంది. తెలంగాణాలో బీజేపీతో పొత్తు అంటే దానికి సిద్ధాంతబద్ధత మీద సందేహాలు ఉన్నాయి. వాటిని పక్కన పెట్టినా బీజేపీకే పెద్దగా స్కోప్ లేని చోట జనసేన ఎలా గెలుస్తుంది అన్నది కూడా సందేహంగా ఉంది అని అంటున్నారు. అంతిమంగా ఓట్ల చీలిక జరిగి అది బీయారెస్ కి రాజకీయంగా లాభం చేకూరుస్తుంది అని అంటున్నారు.
మరి ఏపీలో వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని శపధం చేసిన పవన్ తెలంగాణాలో బీయారెస్ వ్యతిరేక ఓటుని చీలుస్తారా అన్నది కూడా మరో ప్రశ్న. విషయానికి వస్తే తెలంగాణాలో జనసేన పుంజుకోవడం కంటే ఏపీ పాలిటిక్స్ మాత్రమే పవన్ కి ఇంపార్టెంట్ అని అంటున్నారు.
దాంతో పవన్ ఇపుడు ఏ రకమైన స్టెప్ తీసుకుంటారు అన్నది ఆసక్తిని కలిగిస్తోంది. నిజానికి అమిత్ షాని కలసిన తరువాత పవన్ సైలెంట్ అయ్యారని గుర్తు చేస్తున్నారు. పోటీ చేసే విషయం మీద ఆసక్తి ఉంటే వెంటనే యాక్షన్ లోకి దిగేవారు అని అంటున్నారు. ఏపీ సెటిలర్స్ కూడా ఈసారి కాంగ్రెస్ కే ఓటు వేసేందుకు ఫిక్స్ అయిన నేపధ్యంలో నానాటికీ బీజేపీ గ్రాఫ్ తగ్గుముఖం పడుతున్న క్రమంలో పోటీ చేయడం అవసరమా అన్నదైతే జనసేనలో ఉందిట. పోటీ చేసి పరువు పోగొట్టుకోవడం కంటే తప్పుకోవడం ఉత్తమం అని అంటున్నారు. సో పవన్ డెసిషన్ కూడా సంచలనంగా ఉండే చాన్స్ ఉంది అని అంటున్నారు.