జీవితం క్రూరమైనది.. యువన్‌కి ఓదార్పు..
వైరల్ అవుతున్న వీడియోలో యువన్ భవతారిణి తనను సంగీతంలో ఎలా ప్రోత్సహించారో యువన్ వెల్లడించారు
By: Tupaki Desk | 26 Jan 2024 11:21 AM GMTఇళయరాజా కుమార్తె భవతారిణి జనవరి 25, గురువారం రాత్రి కన్నుమూశారు. ఆమె నాల్గవ దశ కాలేయ క్యాన్సర్‌తో పోరాడుతూ దానికి చికిత్స పొందుతున్నట్లు కథనాలొచ్చాయి. భవతారిణి శ్రీలంకలో మరణించింది. 47 ఏళ్ల గాయని మరణానికి అభిమానులు సంతాపం వ్యక్తం చేసారు. కొన్ని సోషల్ మీడియా హ్యాండిల్ లో ఆమె సోదరుడు, సంగీతదర్శకుడు యువన్ శంకర్ రాజా తన కెరీర్‌పై సోదరి ప్రభావం గురించి మాట్లాడిన వీడియోని రీపోస్ట్ చేసారు.
వైరల్ అవుతున్న వీడియోలో యువన్ భవతారిణి తనను సంగీతంలో ఎలా ప్రోత్సహించారో యువన్ వెల్లడించారు. తమిళంలో ఈ ప్రసంగం సాగింది. ''నాకు సంగీతం తెలియదు.. నేను సంగీతం నేర్చుకోలేదు. నాకు సంగీతం నేర్పిన మొదటి వ్యక్తి నా సోదరి. ఆమె నా చేయి పట్టుకుని పియానో వాయించడం నేర్పింది. దానిపై నా చేతిని ప్రయత్నించమని ఆమె నన్ను కోరింది'' అని అన్నారు. ఆ వీడియోలో దివంగత విజయకాంత్ కూడా ఉన్నారు. ఈ క్లిప్ నెటిజనుల దృష్టిని ఆకర్షించింది. చాలామంది యువన్, ఇళయరాజాలకు, అలాగే వారి కుటుంబానికి తమ ప్రేమ మద్దతును అందించారు. జీవితం కొన్నిసార్లు క్రూరంగా ఉంటుంది.. యువన్ బలంగా ఉండండి! అని ఒకరు వ్యాఖ్యానించారు.
హిందుస్థాన్ టైమ్స్ కథనం ప్రకారం.. భవతారిణి చికిత్స కోసం భారతదేశం నుండి శ్రీలంకకు వెళ్లారు. ఐదు నెలలుగా ఆయుర్వేద చికిత్స చేయించుకున్నప్పటికీ ఆమె ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో గురువారం సాయంత్రం 5:20 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆమె పార్థివదేహాన్ని నేడు చెన్నైకి తరలించనున్నారు.
47 సంవత్సరాల వయస్సు నాటికి చలనచిత్ర పరిశ్రమలో భవతారిణి ప్రముఖ వ్యక్తి.. 30 చిత్రాలలో అనేక హిట్ పాటలకు తన గాత్రాన్ని అందించింది. ఆమె అకాల మరణం మొత్తం వినోద ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది.
'రాసయ్య' చిత్రంతో ప్లేబ్యాక్ సింగర్‌గా అరంగేట్రం చేసిన భవతారిణి తన పాట భారీ హిట్ కావడంతో మంచి గుర్తింపు పొందింది. తన తండ్రి, సోదరులు సృష్టించిన సంగీత కంపోజిషన్లకు తన గాత్రాన్ని అందించడం కొనసాగించింది. దేవా, సిర్పి వంటి కళాకారుల కోసం పాటలు పాడింది.