Begin typing your search above and press return to search.

అఫిషియల్‌... మరో బయోపిక్‌ రాబోతుంది

యూవీ బయోపిక్ గురించి చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. ఎట్టకేలకు అఫిషియల్‌ గా బయోపిక్ కి సంబంధించిన ప్రకటన వచ్చింది

By:  Tupaki Desk   |   20 Aug 2024 5:41 AM GMT
అఫిషియల్‌... మరో బయోపిక్‌ రాబోతుంది
X

ఇండియన్‌ సిల్వర్ స్క్రీన్‌ పై ఇప్పటికే ఎన్నో బయోపిక్ లు వచ్చాయి. వచ్చిన బయోపిక్ ల్లో ఎక్కువ శాతం క్రీడాకారులకు సంబంధించినవి ఎక్కువగా ఉన్నాయి. క్రికెటర్స్ సచిన్‌ టెండూల్కర్‌, ధోనీ తో పాటు ఇంకా ఎంతో మంది ప్రముఖ క్రికెటర్స్ బయోపిక్‌ లు ఇప్పటికే వెండి తెరపై సందడి చేశాయి. మరికొన్ని కూడా సినిమా రూపం దాల్చబోతున్నాయి. అందులో మొదటగా టీం ఇండియా మాజీ స్టార్‌ క్రికెటర్ యువరాజ్ సింగ్‌ బయోపిక్ రాబోతుంది. యూవీ బయోపిక్ గురించి చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. ఎట్టకేలకు అఫిషియల్‌ గా బయోపిక్ కి సంబంధించిన ప్రకటన వచ్చింది.

ప్రముఖ నిర్మాత భూషన్ కుమార్‌ మరియు రవి భాగచంద్కాలు ఈ సినిమాని నిర్మించబోతున్నారు. యూవీ పాత్రను చేయబోయే నటుడు ఎవరు అనే విషయం పై త్వరలో ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయి. బయోపిక్‌ ప్రకటన సందర్భంగా యువరాజ్ సింగ్‌ మాట్లాడుతూ... నాకు క్రికెట్‌ అంటే చాలా ఇష్టం. ఈ సినిమా భవిష్యత్తులో ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తుందని నమ్ముతున్నాను. ఈ సినిమాను చేసేందుకు ముందుకు వచ్చిన నిర్మాతలు భూషన్‌ కుమార్‌ మరియు రవి భాగచంద్కాలకు కృతజ్ఞతలు అన్నాడు.

యువరాజ్ సింగ్‌ క్రికెట్‌ ప్రయాణం చాలా ఆసక్తిగా సాగింది, ఈ ప్రాజెక్ట్‌ మేము చేయడం చాలా సంతోషంగా ఉందని భూషన్ కుమార్‌ అన్నారు. గత కొంత కాలంగా యూవీతో మంచి అనుబంధం కొనసాగుతుందని మరో నిర్మాత అన్నారు. వచ్చే ఏడాదిలో సినిమా షూటింగ్ ను మొదలు పెట్టే విధంగా ప్లాన్ చేస్తున్నామని నిర్మాతలు అన్నారు. యువరాజ్ సింగ్ క్రికెట్‌ జీవితంలోనే కాకుండా వ్యక్తిగత జీవితంలో కూడా ఎన్నో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. వాటన్నింటిని కూడా ఈ సినిమాలో చూపించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

1981 డిసెంబర్‌ 12న చండీగర్ లో జన్మించిన యువరాజ్ సింగ్‌ 2000 సంవత్సరం నుంచి వన్డే క్రికెట్‌ ఆడుతూ వచ్చాడు. 2007 ప్రపంచ కప్‌ క్రికెట్‌ లో ఇంగ్లాండ్‌ తో మ్యాచ్ లో వరుసగా 6 సిక్సర్లు కొట్టడం ప్రపంచ రికార్డ్‌ గా నిలిచింది. 2011 వన్డే ప్రపంచకప్‌ ను భారత్‌ గెలవడంలో యూవీ ప్రధాన పాత్ర పోషించాడు. టీ20 ల్లో తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించిన రికార్డ్‌ తో పాటు ఎన్నో అంతర్జాతీయ రికార్డులు యూవీ పేరిట ఇప్పటికీ ఉన్నాయి.

2011 ప్రపంచ కప్ తర్వాత యువీకి కాన్సర్ వ్యాధి సోకింది. అందులో నుండి బయట పడ్డాక క్రికెట్ లో మళ్ళి పునరాగమనం చేశాడు. ప్రస్తుతం ఐపీఎల్ జట్టు మెంటర్ గా వ్యవహరించడంతో పాటు పలు క్రికెట్‌ కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా క్రికెట్‌ అభిమానులకు చేరువగా ఉంటున్నాడు. అలాంటి యూవీ బయోపిక్ రాబోతున్న నేపథ్యంలో అందరి దృష్టి ఈ సినిమాపై ఉంది. ఇంతకు యూవీ పాత్రలో ఏ హీరో నటిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు...!