భార్యకు విడాకులు.. చాహల్ 60 కోట్లకు ఒప్పందం?
భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ - ధనశ్రీ వర్మ విడాకుల గురించి చాలా రోజులుగా పుకార్లు షికార్ చేస్తున్నాయి.
By: Tupaki Desk | 20 Feb 2025 3:32 AM GMTభారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ - ధనశ్రీ వర్మ విడాకుల గురించి చాలా రోజులుగా పుకార్లు షికార్ చేస్తున్నాయి. గత సంవత్సరం చివరిలో ఇద్దరూ ఇన్‌స్టాలో ఒకరినొకరు అన్‌ఫాలో చేయడంతో ఊహాగానాలు మరింత తీవ్రమయ్యాయి. ఒకరితో ఒకరు కలిసి ఉన్న ఫోటోలను తొలగించడం పుకార్లకు అదనంగా ఆజ్యం పోసింది.
అయితే ధనశ్రీ చాహల్‌తో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేస్తూనే ఉండటంతో, ఈ వాదనలలో నిజం ఉండకపోవచ్చునని కొందరు భావిస్తున్నారు. అయితే ఇంతలోనే ఈ జంట విడిపోవడం ఖాయమని, విడాకుల పరిష్కారంలో భాగంగా చాహల్ తన భార్య ధనశ్రీకి దాదాపు రూ.60 కోట్ల మొత్తాన్ని ఒకేసారి చెల్లిస్తాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే విడాకుల గురించి లేదా భరణ ఒప్పందం గురించి ఆ ఇద్దరిలో ఎవరూ బహిరంగంగా వ్యాఖ్యానించలేదు. కనీస ధృవీకరణ కూడా చేయలేదు.
ఇంతకుముందు ధనశ్రీ వర్మ (నటి కం డ్యాన్సర్) తమపై వస్తున్నవన్నీ వదంతులు అని కొట్టి పారేసింది. అనామక వ్యక్తులు నిరాధారమైన వాదనలు చేస్తున్నారని ఆరోపించింది. సోషల్ మీడియాల్లో ఊహాగానాలు చేసే ప్రతిదాన్ని నిజం అని భావించకూడదని వ్యాఖ్యానించింది. చాహల్ గత నెలలో ఇన్‌స్టాలో ఒక క్రిప్టిక్ పోస్ట్‌ను షేర్ చేస్తూ సోషల్ మీడియా ఊహాగానాలను నమ్మవద్దని ప్రజలను కోరారు. ఈ పుకార్లు తనను, తన కుటుంబాన్ని తీవ్రంగా బాధిస్తున్నాయని ఆందోళనను వ్యక్తం చేశారు.
2020లో కోవిడ్ సమయంలో చాహల్ -ధనశ్రీ మధ్య స్నేహం మొదలైంది. సోషల్ మీడియాలో ధనశ్రీ డ్యాన్స్ వీడియోలను చూసి చాహల్ ఇంప్రెస్ అయ్యాడు. ఆ తర్వాత అతడు డ్యాన్స్ నేర్చుకోవడానికి ధనశ్రీని సంప్రదించాడు. టీచర్- స్టూడెంట్ బంధం కాస్తా నిజమైన ప్రేమానుబంధంగా మారింది. ఆ సంవత్సరం చివర్లో ఆ జంట వివాహం చేసుకున్నారు. నాలుగేళ్లలోనే ఇప్పుడు విడాకుల పుకార్లు ఇబ్బందికరంగా మారాయి.
ఈ పుకార్ల నడుమ చాహల్ ఇటీవల ఆర్జే మహవాష్ సహా ఇతర స్నేహితులతో క్రిస్మస్ జరుపుకుంటున్న ఫోటోలు వీడియోలు వైరల్ అయ్యాయి. ఇప్పటికీ చాహల్, ధనశ్రీ ఇద్దరూ పుకార్ల గురించి నోరు విప్పలేదు. వారి మధ్య ఏం జరుగుతోందో ఎవరికీ ఎలాంటి స్పష్ఠతా లేదు.