జాకీర్ హుస్సేన్ నికర ఆస్తి విలువ
జాకీర్ నికర ఆస్తుల విలువ దాదాపు రూ. 8.48 కోట్లు. అతడు ఒక కచేరీకి 5 -10 లక్షలు అందుకుంటాడు.
By: Tupaki Desk | 17 Dec 2024 3:30 AM GMTప్రఖ్యాత తబలా విద్వాంసుడు, ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ 73 ఏళ్ల వయసులో అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఇడియోపతిక్ పల్మనరీ ఫైబ్రోసిస్, దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధి కారణంగా అతడు మరణించాడు. శాన్ ఫ్రాన్సిస్కోలోని భారతీయ కాన్సులేట్ సంగీతానికి ఆయన చేసిన సేవలను కొనియాడింది. ఆయన మరణానంతరం కుటుంబానికి ప్రగాఢ సానుభూపతిని వ్యక్తపరిచింది.
ఆరు దశాబ్దాల కెరీర్ లో జాకీర్ సంపాదన ఎంత? అంటే...జాకీర్ హుస్సేన్ తబలా కళాకారుడిగా గొప్ప పేరు తెచ్చుకోవడమే గాక ఆర్థికంగాను స్థిరపడ్డారు. జాకీర్ నికర ఆస్తుల విలువ దాదాపు రూ. 8.48 కోట్లు. అతడు ఒక కచేరీకి 5 -10 లక్షలు అందుకుంటాడు.
హుస్సేన్ భారతీయ శాస్త్రీయ సంగీతానికి ప్రపంచ రాయబారి. 1973లో అతడు జాన్ మెక్‌లాఫ్లిన్ సహా ఇతరులతో కలిసి జాజ్‌తో భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని మిళితం చేస్తూ శక్తి సహ-స్థాపన చేశాడు. ఈ ఫ్యూజన్ స్టైల్ అతనికి అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టింది. అతను 2024లో ఐదు గ్రామీ అవార్డులను గెలుచుకున్నాడు. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ పురస్కారాలను అందుకున్నారు.
కుటుంబ వివరాలు:
జాకీర్ హుస్సేన్ ప్రముఖ తబలా వాద్యకారుడు ఉస్తాద్ అల్లా రఖాకు పెద్ద కుమారుడు. ముంబైలో 1951లో అతడు జన్మించాడు. తన తండ్రి ప్రేరణతో ఏడు సంవత్సరాల వయస్సులో తబలా నేర్చుకోవడం ప్రారంభించాడు. అతడు 12 సంవత్సరాల వయస్సులో భారతదేశం అంతటా ప్రదర్శన ఇచ్చాడు. సెయింట్ మైఖేల్స్ హైస్కూల్‌లో తన పాఠశాల విద్యను పూర్తి చేసి, సెయింట్ జేవియర్స్ కళాశాల నుండి పట్టభద్రుడయ్యాడు. హుస్సేన్ కథక్ నర్తకి , ఉపాధ్యాయురాలు అయిన ఆంటోనియా మిన్నెకోలాను వివాహం చేసుకున్నాడు. వారికి అనిసా, ఇసాబెల్లా అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సంగీతంతో పాటు సినిమాల్లో అతిథిగా కొన్నిసార్లు కనిపించాడు. సాజ్, మంకీ మ్యాన్ వంటి చిత్రాలలో కొన్ని సీన్లలో కనిపించాడు.