Begin typing your search above and press return to search.

బతుకులను కాదు.. 'బడ్జెట్'లను ఆసాంతం మార్చేసిన బీజేపీ

కేంద్రంలో పదేళ్లు దాటిపోయింది బీజేపీ ప్రభుత్వం ఏర్పడి.. మరో ఐదేళ్లూ వారిదే పాలన.. ఇప్పటికే పది బడ్జెట్ లను ప్రవేశపెట్టారు

By:  Tupaki Desk   |   11 July 2024 12:48 PM GMT
బతుకులను కాదు.. బడ్జెట్లను ఆసాంతం మార్చేసిన బీజేపీ
X

కేంద్రంలో పదేళ్లు దాటిపోయింది బీజేపీ ప్రభుత్వం ఏర్పడి.. మరో ఐదేళ్లూ వారిదే పాలన.. ఇప్పటికే పది బడ్జెట్ లను ప్రవేశపెట్టారు.. ఈ ఏడాది ఎన్నికల నేపథ్యంలో ఫిబ్రవరి 1న ఓటాన్ అకౌంట్ తో సరిపెట్టారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఈ నెల 23న పూర్తిస్థాయి బడ్జెట్‌ ను సమర్పించనున్నారు. తెలుగు వారి కోడలు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరో బడ్జెట్ తేనుండడం ప్రత్యేకత. ఈ నెల 22 నుంచి ఆగస్టు 12 వరకు బడ్జెట్ సమావేశాలు జరుగనున్నాయి.

నిర్మల ఏడోసారి..

2019లో రెండోసారి అధికారంలోకి వచ్చాక మోదీ ప్రభుత్వంలో నిర్మలకు ఆర్థిక శాఖ అప్పగించారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ తర్వాత బడ్జెట్‌ ప్రవేశపెట్టిన రెండో మహిళ ఈమెనే కావడం విశేషం. అంతేకాదు.. వరుసగా ఆరు బడ్జెట్ లను తెచ్చిన ఆమె ఏడోదీ ప్రవేశపెట్టనున్నారు. మూడో విడత మోదీ పాలనలో పూర్తిస్థాయిలో నిర్మలనే ఆర్థిక మంత్రిగా ఉంటే 11 బడ్జెట్ లను ప్రవేశపెట్టిన ఘనతను అందుకోనున్నారు. బహుశా మరే మహిళా మంత్రి కూడా దీనిని చేరుకోలేరేమో? ఇప్పటి వరకు మొరార్జీ దేశాయ్‌ వరసగా ఆరుసార్లు బడ్జెట్‌ సమర్పించారు. దీనిని నిర్మల బద్దలు కొట్టనున్నారు.

సూట్ కేస్ లో కాక..

భారత బడ్జెట్ అంటే.. గతంలో గుర్తొచ్చేది సూట్‌ కేసు. కానీ, నిర్మల మంత్రి అయ్యాక.. రాజముద్ర ఉన్న ఎరుపు రంగు వస్త్రంలో బడ్జెట్‌ ప్రతులను తీసుకొచ్చే సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. కాగా, వాజ్ పేయీ హయాంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన 1999లోనే బడ్జెట్ కు సంబంధించి భారీ మార్పు జరిగింది. సాయంత్రం 5 గంటలకు ప్రవేశపెట్టే సంప్రదాయానికి వాజ్ పేయీ ప్రభుత్వం చరమగీతం పాడింది. దీనిని బ్రిటిష్ సంప్రదాయంగా పేర్కొంది. ఉదయం 11 గంటల నుంచే బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యేలా చేసింది.

2021 నుంచి డిజిటల్..

మోదీ వచ్చాక సూట్ కేస్ సంప్రదాయానికి చెక్ పెట్టారు. 2021 నుంచి డిజిటల్ బడ్జెట్ కు మళ్లారు. సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగాలూ (రెండున్నర గంటలకు పైగానే) బీజేపీ హయాంలోనివే. ఇక పద్దుకు సంబంధించి మరో కీలక మార్పు.. రైల్వే బడ్జెట్ విలీనం. అంతకుముందు రైల్వే బడ్జెట్ ను విడిగా ప్రవేశపెట్టారు. మోదీ వచ్చాక దానిని ప్రధాన బడ్జెట్ లో కలిపేశారు. ఫిబ్రవరి 28న బడ్జెట్ ప్రవేశపెట్టే సంప్రదాయానికి కూడా బీజేపీ ప్రభుత్వం వీడ్కోలు పలికింది. ఫిబ్రవరి 1కి మార్చింది.

ఆశలు నెరవేరలేదు

బడ్జెట్ పై అనేక సంస్కరణలు తీసుకొచ్చినప్పటికీ మోదీ సర్కారుపై ఇప్పటికీ చాలా విమర్శలున్నాయి. ధనికుల ప్రయోజనాల కోసం బడ్జెట్ విధానాలు రూపొందిస్తున్నారని, పన్ను మినహాయింపు విషయంలో వేతన జీవులు ఆశించినంతగా మార్పులు తేలేకపోయిందని, ఇతర ప్రజాకర్షన పథకాలలోనూ తమదైన ముద్ర వేయలేకపోయిందనేది వీటిలో ప్రధానమైనవి.