రూ.1,83,01,500 కోట్లు.. ఏడాదిలో మనోళ్లు దేనికి ఖర్చు చేశారో తెలుసా?
2024లో రూ.1,83,01,500 కోట్ల భారీ మొత్తాన్ని దేశ ప్రజలు వస్తు సేవల కోసం వెచ్చించారని.. అంతకు ముందు ఏడాది (2023లో) ఇది రూ.87,15,000 కోట్లు మాత్రమేనని అధ్యయనం వెల్లడించింది.
By: Tupaki Desk | 2 March 2025 2:00 PM ISTఏడాది వ్యవధిలో వస్తు సేవల కోసం భారతీయులు ఖర్చు చేసిన మొత్తంపై డెలాయిట్ - ఆర్ఏఐలు తాజాగా విడుదల చేసిన అధ్యయన వివరాలు ఆసక్తికరంగానే కాదు.. ఆశ్చర్యానికి గురి చేసేలా ఉన్నాయని చెబుతున్నారు. 2024లో రూ.1,83,01,500 కోట్ల భారీ మొత్తాన్ని దేశ ప్రజలు వస్తు సేవల కోసం వెచ్చించారని.. అంతకు ముందు ఏడాది (2023లో) ఇది రూ.87,15,000 కోట్లు మాత్రమేనని అధ్యయనం వెల్లడించింది.
7.2 శాతం వ్రద్ధితో అమెరికా.. చైనా.. జర్మనీ కంటే భారత్ వేగంగా ఉన్నట్లు ఈ రిపోర్టు పేర్కొంది. 2026 నాటికి ప్రపంచంలోనే మూడో అతి పెద్ద వినియోగదారుల మార్కెట్ గా అవతరించే దిశగా వెళుతుందని పేర్కొన్నారు. ఇది 2030 నాటికి రూ.20,04,450 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేశారు. 2030 నాటికి ఏడాదికి రూ.8.71 లక్షల కంటే ఎక్కువ సంపాదించే భారతీయుల సంఖ్య దాదాపు మూడు రెట్లు దూసుకెళ్లి 16.5 కోట్లకు చేరుతుందని పేర్కొన్నారు. 2024లో ఇది కేవలం 6 కోట్లు మాత్రమే కావటం గమనార్హం.
దేశంలో మధ్యతరగతి వర్గాల వ్రద్ధిని.. విచక్షణా వ్యయంవైపు ప్రాథమిక మార్పును చెబుతున్నట్లుగా అధ్యయనం వెల్లడించింది. జనాభాలో 52 శాతం ఉన్న జనరేషన్ జెడ్.. మిలీనియల్స్ ఈ మార్పునకు కారణంగా చెబుతున్నారు ప్రీమియం బ్రాండ్లు.. స్థిర ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతున్నట్లుగా వెల్లడించారు. 2030 నాటికి భారతదేశ తలసరి ఆదాయం రూ.3,48,600 దాటుతుందని అంచనా వేశారు. వివిధ రంగాల్లో కొత్త అవకాశాల్ని ఇది తెరుస్తుందని పేర్కొన్నారు. తమ వాదనకు బలం చేకూరేలా ఒక ఉదాహరణను ఇందులో పేర్కొన్నారు, గత ఏడాది క్రెడిట్ కార్డుల సంఖ్య 10.2 కోట్లు ఉందని.. 2030 నాటికి ఈ సంఖ్య 29.6 కోట్లకు దూసుకెళుతుందని చెబుతున్నారు. దీంతో.. వినియోగదారులు చేసే ఖర్చులు మరింత పెరుగుతాయని పేర్కొన్నారు.