పొదుపులో భారత్ నెం.4.. ముందు మూడు ఏంటో తెలుసా!
చాలా మంది రూపాయిలో యాభై పైసలు పొదుపు చేయాలని అనుకుంటారు.
By: Tupaki Desk | 25 Dec 2024 6:30 PM GMTసంపాదనలో కనీసం 30 శాతం పొదుపు చేస్తే భవిష్యత్తు బాగుంటుంది అనేది పెద్దల మాట. ఆర్థిక నిపుణుల మాట సైతం అదే. చాలా మంది రూపాయిలో యాభై పైసలు పొదుపు చేయాలని అనుకుంటారు. కానీ 30 పైసల పొదుపుతో ప్రస్తుత జీవితం బాగుంటుంది, భవిష్యత్తు బాగుంటుంది అంటూ ఎంతో మంది ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు. ఇండియాలో పొదుపు చేస్తున్న వారి సంఖ్య భారీగా ఉంది. ఇండియాలో మద్యతరగతి వారు ఎక్కువ మంది ఉంటారు, వారిలో ఎక్కువ శాతం ఏదో ఒక అవసరాల నిమిత్తం అన్నట్లు తమ సంపాదనలో ఎంతో కొంత శాతం కచ్చితంగా పొదుపు చేస్తారని తాజా సర్వేలో వెల్లడి అయింది.
ప్రముఖ ఇండియన్ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎకోవ్రాప్ నివేదిక ప్రకారం భారతదేశం పొదుపు రేటు 30.2 శాతం ఉంది. ఇది ప్రపంచ సగటు 28.2 కంటే చాలా ఎక్కువ. డబ్బు పొదుపులో భారత్ ప్రపంచంలో నెం.4 స్థానంలో ఉంది. పేద వారు సైతం ఎంతో కొంత డబ్బును పొదుపు చేస్తున్నారు. రెండు దశాబ్దాల ముందు వరకు సాంప్రదాయ పద్దతిలో పొదుపు చేసేవారు. కానీ ఇప్పుడు ఇండియన్స్‌లో ఎక్కువ శాతం మంది మ్యూచువల్ ఫండ్స్, ఇతర ప్లాన్స్ ద్వారా డబ్బు సేవ్ చేస్తున్నట్లుగా ఎస్‌బీఐ తన సర్వేలో వెళ్లడించింది.
పొదుపులో భారత్ కంటే ముందు చైనా, ఇండోనేషియా, రష్యాలు ఉన్నాయి. చైనాకు చెందిన వారు ఏకంగా 46.6 శాతం పొదుపు చేస్తున్నారు. దాంతో చైనా పొదుపులో నెం. 1 స్థానంలో ఉంది. అక్కడి వారిలో దాదాపు 75 శాతం మంది ఎంతో కొంత మొత్తంలో వివిధ రూపాల్లో పొదుపు చేస్తుంటారని వెల్లడి అయింది. ఆ తర్వాత స్థానంలో ఇండోనేషియా నిలిచింది. ఇండోనేషియాకు చెందిన వారు 38.1 శాతం పొదుపు చేస్తారని వెల్లడి అయింది. ఇండోనేషియాలోనూ వివిధ రూపాల్లో పొదుపు చేస్తారు. ఎక్కువ శాతం ప్రముఖ బ్యాంక్స్‌లో మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెడుతున్నారని తెలిసింది.
ఇక మూడో స్థానంలో రష్యా నిలిచింది. 31.7 శాతం తో రష్యా మూడో స్థానంలో ఉంది. సంపాదనలో ముందు స్థానాల్లో ఉండే అమెరికా పొదుపులో టాప్‌లో లేకపోవడం విశేషం. అక్కడ జనాలు పొదుపు పై కంటే ప్రస్తుత సమయంలో ఆ డబ్బును వినియోగించడంపై ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. పైగా వారసులకు అక్కడ ఆస్తులను, పొదుపు చేసి డబ్బును ఇవ్వాలనే ఆలోచన ఉండదు. కనుక అక్కడి వారు చారటీతో పాటు ఎప్పటికప్పుడు సంపాదించిన డబ్బును ఖర్చు చేసే విధంగా ప్లాన్ చేసుకుంటారు. ప్రతి రూపాయిని అవసరాల కోసం ఖర్చు చేయడంతో పాటు వ్యాపారాల్లో పెట్టుబడిగా వినియోగిస్తారని సర్వేలో వెల్లడి అయింది.