ఇంకా ప్రజల వద్దే రూ.2వేల నోట్లు.. ఎన్ని కోట్లు ఉన్నాయంటే?
ఈ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ, ఇప్పటికీ ప్రజల వద్ద రూ. 6,471 కోట్ల విలువైన రూ. 2 వేల నోట్లు మిగిలి ఉన్నట్లు ఆర్బీఐ తాజా ప్రకటనలో వెల్లడించింది.
By: Tupaki Desk | 2 March 2025 7:00 AM ISTరిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా నివేదికలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. రద్దు అయిపోయిన రూ.2వేల నోట్లు ఇంకా ప్రజల వద్దనే కొన్ని ఉన్నాయన్న విషయాన్ని ఆర్బీఐ బయటపెట్టింది. ఇదే ఇప్పుడు సంచలనమైంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2023 మేలో రూ. 2 వేల నోట్లను సర్క్యులేషన్ నుంచి ఉపసంహరించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ప్రజలకు తమ వద్ద ఉన్న రూ. 2 వేల నోట్లను బ్యాంకులకు తిరిగి అందజేయాలని సూచించింది. ఈ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ, ఇప్పటికీ ప్రజల వద్ద రూ. 6,471 కోట్ల విలువైన రూ. 2 వేల నోట్లు మిగిలి ఉన్నట్లు ఆర్బీఐ తాజా ప్రకటనలో వెల్లడించింది.
- 98.18% నోట్లు బ్యాంకులకు చేరిక
2023 మే 19న ఆర్బీఐ ఈ నోట్ల ఉపసంహరణ ప్రకటన చేసినప్పుడు, సర్క్యులేషన్‌లో మొత్తం రూ. 3.56 లక్షల కోట్ల విలువైన రూ. 2 వేల నోట్లు ఉన్నట్లు అంచనా వేసింది. ముందుగా బ్యాంకుల్లో మార్చుకునే అవకాశాన్ని 2023 సెప్టెంబర్ 30 వరకు ఇచ్చి, తర్వాత అక్టోబర్ 7 వరకు పొడిగించింది. అయితే, అప్పటి నుంచి బ్యాంకుల ద్వారా మార్చుకునే అవకాశం నిలిపివేసి, దేశవ్యాప్తంగా ఉన్న ఆర్బీఐ 19 ప్రాంతీయ కార్యాలయాల్లో మాత్రమే మార్పిడికి అనుమతి ఇచ్చింది.
ఇప్పటివరకు 98.18% నోట్లు బ్యాంకింగ్ వ్యవస్థలోకి తిరిగి చేరినప్పటికీ 1.82% నోట్లు (రూ. 6,471 కోట్లు) ఇంకా ప్రజల వద్ద ఉన్నట్లు ఆర్బీఐ తెలిపింది.
- నోట్ల మార్పిడికి అందుబాటులో ఉన్న కేంద్రాలు
ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో రూ. 2 వేల నోట్ల మార్పిడికి వెసులుబాటు కల్పించింది. హైదరాబాద్‌తో పాటు బెంగళూరు, అహ్మదాబాద్, ముంబై, నాగ్‌పుర్, ఢిల్లీ, పట్నా, తిరువనంతపురం, చెన్నై, ఛండీగఢ్, భువనేశ్వర్, భోపాల్, భేల్‌పుర్, కాన్పుర్, జైపూర్, గువాహటి, లక్నో, కోల్‌కతా, జమ్మూ ప్రాంతీయ కార్యాలయాల్లో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. అలాగే, ఆర్బీఐ కార్యాలయాలకు వ్యక్తిగతంగా వెళ్లలేని వారు పోస్టల్ డిపార్ట్‌మెంట్ ద్వారా తమ నోట్లను పంపించవచ్చు.
- రూ. 2 వేల నోట్ల లీగల్ టెండర్ స్థితి
రూ. 2 వేల నోట్లను ఉపసంహరించినప్పటికీ, ఇవి ఇప్పటికీ చట్టబద్ధ కరెన్సీ (లీగల్ టెండర్)గా కొనసాగుతున్నట్లు ఆర్బీఐ స్పష్టం చేసింది. అంటే ఈ నోట్లు చెల్లుబాటు అయ్యే కరెన్సీగానే కొనసాగుతున్నాయని స్పష్టత ఇచ్చింది.