ఎండీహెచ్.. ఎవరెస్టు మసాల పొడులకు మరిన్ని చిక్కులు
ఈ రెండు బ్రాండ్లకు సంబంధించిన మసాల పొడుల శాంపిళ్లను పరీక్షలు చేయగా.. క్యాన్సర్ కు కారకమైన ఎథిలీన్ ఆక్సైడ్ ఉన్నట్లుగా తొలుత హాంకాంగ్ సెంటర్ ఫర్ ఫుడ్ సేఫ్టీ ఏప్రిల్ ఐదున ప్రకటించటం తెలిసిందే.
By: Tupaki Desk | 20 May 2024 4:53 AM GMTదేశీయంగానే కాదు అంతర్జాతీయంగానూ పేరు ప్రఖ్యాతులున్న మసాలా పొడుల బ్రాండ్లుగా ఎవరెస్టు.. ఎండీహెచ్ లకు సంబందించి ఉత్పత్తుల్లో నాణ్యతా లోపాలు తెర మీదకు రావటం తెలిసిందే. సింగపూర్.. హాంకాంగ్.. అమెరికా.. ఆస్ట్రేలియా దేశాలు ఈ అంశంపై ఫోకస్ పెట్టగా.. తాజాగా ఆ జాబితాలోకి న్యూజిలాండ్ చేరింది. ఈ రెండు బ్రాండ్లకు చెందిన మసాలా పొడుల ఉత్పత్తుల్లో "ఎథిలీన్ ఆక్సైడ్" రసాయనం మోతాదుకు మించి ఉన్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి.
ఈ రెండు బ్రాండ్లకు సంబంధించిన మసాల పొడుల శాంపిళ్లను పరీక్షలు చేయగా.. క్యాన్సర్ కు కారకమైన ఎథిలీన్ ఆక్సైడ్ ఉన్నట్లుగా తొలుత హాంకాంగ్ సెంటర్ ఫర్ ఫుడ్ సేఫ్టీ ఏప్రిల్ ఐదున ప్రకటించటం తెలిసిందే. ఈ ఉత్పత్తులను కొనొద్దని ప్రజలకు చెప్పింది. హాంకాంగ్ ఫుడ్ సేఫ్టీ సంస్థ ప్రకటనను ఆధారంగా చేసుకొని సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ సైతం ఈ ఉత్పత్తులను రీకాల్ చేసింది. అందులో ఎవరెస్ట్ ఫిష్ కర్రీ మసాలా.. ఎండీహెచ్ కు చెందిన మద్రాస్ కర్రీ పౌడర్.. సాంబార్ మసాలా మిక్స్డ్ మసాలా పౌడర్.. కర్రీ పౌడర్ మిక్సెడ్ మసాలా పౌడర్లు న్నాయి.
తాజా ఆరోపణల నేపథ్యంలో భారత్ నియంత్రణ సంస్థలు సైతం స్పందించాయి. మన దేశంలోని ఈ రెండు సంస్థలకు చెందిన ప్లాంట్లను తనిఖీలు నిర్వహించి.. వాటి పరీక్షల కోసం అంతర్జాతీయ తనిఖీలకు పంపారు. వీటి ఫలితాలు రావల్సి ఉంది.
ఇదే సమయంలో న్యూజిలాండ్ సైతం స్పందించి.. ఈ ఉత్పత్తులపై ఆంక్షలు విధించటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎండీహెచ్.. ఎవరెస్టు ఉత్పత్తుల్లో క్యాన్సర్ కారక రసాయనం ఉందన్న అంశంపై న్యూజిలాండ్ సంస్థ విచారణ చేపట్టటం ఈ సంస్థలకు కొత్త చిక్కుగా మారినట్లుగా చెబుతున్నారు. మరి.. తుది ఫలితాలు ఏ రీతిలో ఉంటాయన్నది ఇప్పుడు ఉత్కంటగా మారింది.