ఆ నగరంలో మాంసం అమ్మకాలు చట్ట విరుద్ధం... భారత్ లోనే!
ప్రపంచంలోనే మాంసం అమ్మకాలు చట్టవిరుద్ధం చేసిన తొలి నగరంగా గుజరాత్ రాష్ట్రంలొని భావ్ నగర్ లోని పాలిటనా నిలిచింది.
By: Tupaki Desk | 14 July 2024 2:30 AM GMTప్రపంచంలోనే మాంసం అమ్మకాలు చట్టవిరుద్ధం చేసిన తొలి నగరంగా గుజరాత్ రాష్ట్రంలొని భావ్ నగర్ లోని పాలిటనా నిలిచింది. ఈ సిటీలో మాంసం కోసం జీవాలను చంపడం, మాంసం అమ్మడం, జీవాలను అమ్మడం, రవాణా చేయడం చట్ట విరుద్ధమని స్థానిక అధికారులు తెలిపారు. ఈ మెరకు నిబంధనలు తీసుకొచ్చారు. త్వరలోనే ఇతర చోట్లా అమలుచేస్తామని ప్రకటించారు!
అవును... నాన్ వెజ్ చట్టవిరుద్ధమైన ప్రపంచంలోనే మొదటి నగరంగా గుజరాత్ లోని పాలిటానా ప్రకటించబడింది. జైనుల ప్రఖ్యాత పుణ్యక్షేత్రమవ్వడం వల్ల పాలిటానాలో ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. నగరంలో ఉన్న మాంసపు దుకాణాలను మూసివేయాలని డిమాండ్ చేస్తూ సుమారు 200 మంది జైన సన్యాసులు నిరసన చేసిన తర్వాత ఈ చర్య జరిగింది.
అయితే... మాంసాహారానికి వ్యతిరేకంగా నిరసనలు రావడం గుజరాత్ లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఇదే తొలిసారి కాదు, కొత్తా కాదు. అయితే గుజరాత్ లో మహాత్మగాంధీ శాఖాహారాన్ని పాటించడంతో ఆయనను ఉదాహరణగా తీసుకుని ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ల మంది దీన్ని పవిత్రమైన విధిగా పాటిస్తున్నారు.
గుజరాత్ లోని శాఖాహారం ఎక్కువగా ఆధిపత్య వైష్ణవ హిందూ సంస్కృతిచే ప్రభావితమైందని చెబుతారు. గుజరాత్ జనాభాలో హిందువులు 88.5% ఉండగా.. జైనులు 1% వరకూ ఉంటారు. ఇక ముస్లింలు, క్రైస్తవులు 10% ఉన్నారు. ఈ రాష్ట్రంలో వైష్ణవం ప్రధానమైన మత సంస్కృతిగా ఉంటుంది. ఏది ఏమైనా... పాలిటానా నగరం నాన్ వెజ్ నిషేదించబడిన తొలి నగరంగా రికార్డ్స్ కెక్కింది.