నాన్ వెజ్ వినియోగంలో తెలంగాణ టాప్.. తాజా రిపోర్టు
అయితే.. కేవలం పది రోజుల వ్యవధిలోనే కేజీ మాంసం రూ.వెయ్యికు పైనే ధర పలుకుతుందన్న విషయం తాజా సర్వే లెక్కకట్టింది.
By: Tupaki Desk | 11 Jun 2024 4:11 AM GMTకార్యక్రమం ఏదైనా.. వేడుక మరేదైనా ముక్క ఉండాలన్నట్లుగా మారింది తెలంగాణలో. ముక్కలేకుంటే బంధాలు ముక్కలైపోతాయన్నట్లుగా మారిపోయింది. దీంతో.. నాన్ వెజ్ వినియోగం తెలంగాణలో అదరగొట్టేస్తోంది. దేశంలో టాప్ నాన్ వెజ్ వినియోగంలో తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ స్థానంలో నిలుస్తోంది. నాన్ వెజ్ వినియోగంలో జాతీయ సగటు కంటే ఎక్కువగా లాగించేస్తున్న విషయం తాజాగా వెల్లడైన రిపోర్టు స్పష్టం చేస్తోంది.
తాజాగా వెల్లడైన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో దేశంలో 70 శాతానికి పైగా ప్రజలు మాంసాహారాన్ని ఇష్టపడుతున్నట్లుగా తేలింది. దేశం మొత్తంలో 16.6 శాతం మంది పురుషులు.. 29.4 శాతం మంది మహిళలు తప్పించి.. మిగిలిన వారంతా నాన్ వెజ్ ను ఇష్టంగా లాగించేస్తారని తేల్చారు. ఇక.. దేశంలో నాన్ వెజ్ ఎక్కువగా తినే రాష్ట్రాల్లో 98.7 శాతంతో తెలంగాణ టాప్ ప్లేస్ లో ఉండగా.. రెండో స్థానంలో పశ్చిమ బెంగాల్ నిలిచింది. ఈ రాష్ట్రంలో నాన్ వెజ్ తినే వారు 98.5 శాతం. మరో తెలుగు రాష్ట్రమైన ఏపీలో 98.25 శాతంగా తేలింది.
ఆసక్తికరమైన మరికొన్ని అంశాలు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. అంతర్జాతీయ మార్కెట్ లో ఒక కేజీ మాంసం ఖరీదు రూ.500-600 మధ్య ఉంటే.. మన దగ్గర మాత్రం రూ.800 నుంచి రూ.వెయ్యి వరకు ఉండటం గమనార్హం. తెలంగాణలో వారానికి మూడుసార్లు మినిమంగా నాన్ వెజ్ లాగించేస్తున్నట్లుగా సర్వే వెల్లడించింది. ఒక వ్యక్తి ఏడాది వ్యవధిలో మాంసం కోసం ఖర్చు చేస్తున్న మొత్తం రూ.58వేలు కావటం గమనార్హం.
రోజులు గడిచే కొద్దీ నాన్ వెజ్ తినే తీరు అంతకంతకూ పెరుగుతోంది. 2014-15లో సగటున ఒక వ్యక్తి ఏడాది కాలంలో 12.95 కేజీల నాన్ వెజ్ తింటే.. అదే 2021-22 నాటికి 21.17 కేజీలకు పెరిగింది. అదిరప్పుడు 28.5 కేజీలుగా పెరిగింది. జాతీయ సగటు నాన్ వెజ్ వినియోగం 7.1 కేజీలు కాగా.. తెలంగాణలో మాత్రం ఇంత భారీగా ఉండటం విశేషం. జాతీయ పోషకాహార సంస్థ మార్గదర్శకాల ప్రకారం ఏడాదికి ఒక మనిషి 11 కేజీల వరకు మాంసాన్ని తినొచ్చు. ఈ లెక్కన చూస్తే తెలంగాణలో వినియోగం ఎంత భారీగా ఉందన్నది అర్థమవుతుంది.
ఇక్కడే మరో ఆసక్తికర అంశం వెలుగు చూసింది. మన లాగించే నాన్ వెజ్ కు అవసరమైన జంతువులు లేక.. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవటం ఎక్కువైంది. ఒకవేళ.. బయట నుంచి రావాల్సిన మాంసం రాకుండా బంద్ అయితే.. కేవలం పది రోజుల వ్యవధిలోనే కేజీ మాంసం రూ.వెయ్యికు పైనే ధర పలుకుతుందన్న విషయం తాజా సర్వే లెక్కకట్టింది.
దేశ మటన్ రాజధానిగా హైదరాబాద్ నిలిచింది. ఉత్తరాది రాష్ట్రాల నుంచి సరఫరా అయ్యే మాంసాన్ని హైదరాబాద్ లో నిల్వ ఉంచి.. ఇక్కడి నుంచి తమిళనాడు.. కర్ణాటక.. కేరళ రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నారు. దీంతో.. మాంసం సరఫరాకు హైదరాబాద్ కేంద్రంగా మారింది. మరోవైపు హైదరాబాద్ మహానగరంలో భారీగా హోటళ్లు.. రెస్టారెంట్లు ఉండటంతో భారీ ఎత్తున మటన్ వినియోగం సాగుతోంది. హోటల్లు.. రెస్టారెంట్లతో పాటు వ్యక్తిగత వినియోగం కోసం హైదరాబాద్ లో ప్రతి రోజు సుమారు 18వేలకు పైగా గొర్రెల్ని వధిస్తున్నట్లుగా తేలింది.
ఇక.. స్థానిక వినియోగంతో పాటు ఇతర రాష్ట్రాలకు ఎగుమతుల అవసరాల కోసం అన్ని జంతువులను కలిపి ఒక రోజులో తెలంగాణ వ్యాప్తంగా 45వేల నుంచి 50 వేల వరకు జంతువుల్ని వధిస్తున్నట్లుగా తేల్చారు. ఇందులో సగానికి పైనే హైదరాబాద్ లో వినియోగానికే సరిపోతవటం గమనార్హం.