ఏమిటీ జపాన్ డైట్? వారెందుకు ఆరోగ్యం ఉంటారు?
జపనీయుల డైట్ చూస్తే.. వారి ఆరోగ్య రహస్యం ఇట్టే తెలుస్తుందన్నమాట వినిపిస్తూ ఉంటుంది.
By: Tupaki Desk | 11 March 2025 10:31 AM ISTతినే తిండి.. ఉండే పరిసరాలు.. చుట్టూ ఉండే వాతావరణం ఏదీ ఆరోగ్యవంతంగా ఉండదన్న భావన అంతకంతకూ పెరుగుతోంది. ఇందుకు భిన్నంగా ఉంటుంది జపాన్. అక్కడి ప్రజలు వయసు మీద పడుతున్నా.. చలాకీగా ఉండటమే కాదు.. ఆరోగ్యంతో జీవిస్తుంటారు. దీనికి కారణం వారు తీసుకునే ఆరోగ్యకరమైన ఆహారం కూడా కారణమని చెబుతారు. జపనీయుల డైట్ చూస్తే.. వారి ఆరోగ్య రహస్యం ఇట్టే తెలుస్తుందన్నమాట వినిపిస్తూ ఉంటుంది. ఇంతకీ జపాన్ డైట్ లో ఏం ఉంటుంది? ప్రపంచంలోని అత్యుత్తమ ఆహార విధానాల్లో జపాన్ డైట్ ఎందుకు నిలిచింది? లాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికితే.. మనం తెలుసుకోవాల్సినవి.. మనం మార్చుకోవాల్సిన ఆహార అలవాట్లు ఇట్టే అర్థమవుతాయి.
ఆకలిగి మించి ఆహారం తీసుకోవటానికి జపనీయులు ఇష్టపడరు. తాము కడుపు నిండుగా తినకుండా అవసరమైన ఆహారానికి 80 శాతం మాత్రమే ఫుడ్ తీసుకోవటం.. 20 శాతం కడుపును ఖాళీగా ఉంచుకోవటం వారు అనుసరించే విధానాల్లో ఒకటి. అది చిన్నప్పటి నుంచే పిల్లలకు నేర్పిస్తారు. జపనీయులు తాజాగా తయారు చేసిన ఆహారానికి ప్రాధాన్యతను ఇస్తారు. నూనెలు తక్కువగా వినియోగిస్తారు. పాలు.. వెన్నె.. పెరుగు.. ఐస్ క్రీం లాంటి పాల ఉత్పత్తులు.. కొవ్వు శాతం ఎక్కువగా ఉండే నూనెలు.. వెన్నె.. సాస్ లు.. ఆహారాన్ని నిల్వ ఉంచేందుకు రసాయనాలు వినియోగించరు.
ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉండే సాల్మన్.. ట్యూనా లాంటి చేపలు.. సముద్రపు నాచును తీసుకుంటారు. ఇది చాలా శక్తివంతమైన ఆహారం. ఇందులో కణాల్ని ఆరోగ్యంగా ఉంచే విటమిన్ ఎ..సీ.. ఇ.. కెరోటినాయిడ్లు.. ప్లేవనాయిడ్స్ లాంటి యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఈ కారణంతోనే ఒబెసిటీ సమస్య తక్కువగా ఉండే దేశాల్లో జపాన్ ఒకటిగా నిలిచింది. ఆహారాన్ని నములుతూ తినటం.. నిదానంగా తినటం.. తక్కువ మోతాదులో ఆహారాన్ని తీసుకోవటం.. అందుకు చిన్న ప్లేట్లు.. గిన్నెల్ని వినియోగించటం లాంటివి చేస్తారు. ఆహారాన్ని తీసుకోవటానికి ముందు గ్రీన్ టీ తీసుకోవటం వారికి అలవాటు.