వచ్చే జనవరిలో మేకిన్ హైదరాబాద్ యాపిల్ ఇయర్ బడ్స్
యాపిల్ ఇయర్ బడ్స్ కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు
By: Tupaki Desk | 16 Aug 2023 4:43 AM GMTయాపిల్ ఇయర్ బడ్స్ కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మార్కెట్లో ఇయర్ బడ్స్ ను ఉత్పత్తి చేసే సంస్థలు బోలెడున్నా.. యాపిల్ ప్రొడుక్టులకు ఉండే ప్రత్యేక స్థానం తెలిసిందే. యాపిల్ ఉత్పత్తుల్లో ఐఫోన్ల తర్వాత ఎక్కువగా అమ్ముడయ్యే వాటిల్లో ఇయర్ బడ్స్ ఒకటని చెబుతుంటారు. ఈ బడ్స్ ను హైదరాబాద్ కేంద్రంగా తయారు చేస్తున్నారు. దీనికి సంబంధించి గతంలోనే కసరత్తు మొదలైనా.. తాజాగా ఆ ప్రక్రియ పూర్తి కావటమే కాదు.. ఉత్పత్తి ఎప్పుడు మొదలు కానుందన్న అంశం మీదా క్లారిటీ వచ్చేసింది.
యాపిల్ ఉత్పత్తుల్ని వివిధ సంస్థలు తయారు చేస్తుండటం తెలిసిందే. ఇయర్ బడ్స్ విషయానికి వస్తే తైవాన్ కు చెందిన ఫోక్స్ కాన్ సంస్థ ఉత్పత్తి చేస్తోంది. ఈ సంస్థకు చెందిన ఫ్యాక్టరీ.. హైదరాబాద్ సమీపంలో ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు 400కోట్ల మొత్తాన్ని హైదరాబాద్ లోని ప్లాంట్ కోసం వెచ్చించనుంది.
ఈ ఫ్యాక్టరీ నుంచి ఈ డిసెంబరు నుంచి ఉత్పత్తి మొదలయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన పనులు వేగవంతం అయ్యాయి. ఇప్పటి వరకు ఉన్న అంచనా ప్రకారం చూస్తే.. వచ్చే ఏడాది జనవరి నాటికి మార్కెట్ లోకి హైదరాబాద్ లో తయారు చేసిన యాపిల్ ఇయర్ బడ్స్ అందుబాటులోకి వస్తాయని చెబుతున్నారు.
ఐఫోన్ తర్వాత యాపిల్ సంస్థ మన దేశంలో ఉత్పత్తి చేస్తున్న రెండో ప్రొడక్టు ఇయర్ బడ్స్. ప్రపంచ మార్కెట్ లో యాపిల్ ఇయర్ బడ్స్ కు ఉన్న ఆదరణను చూస్తే.. గత ఏడాది డిసెంబరు నాటికి 36 శాతం మార్కెట్ వాటా ఉంది. మొత్తానికి హైదరాబాద్ మేక్.. యాపిల్ ఇయర్ బడ్స్ ను కొత్త సంవత్సరం.. మొదటి నెలలో చేతికి రానుందన్న మాట.