చైతూ.. చందూ మొండేటి తర్వాత ఎవరితో..
'కస్టడీ' సినిమాపై భారీ ఆశలు పెట్టుకుని రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు అక్కినేని నాగచైతన్య.
By: saisumeeth | 17 July 2023 11:59 AM GMT'కస్టడీ' సినిమాపై భారీ ఆశలు పెట్టుకుని రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు అక్కినేని నాగచైతన్య. కానీ అది ఊహించని రేంజ్ లో డిజాస్టర్ గా నిలిచింది. దీంతో ఈ సారి ఎలాగైనా గట్టి కమ్ బ్యాక్ ఇవ్వాలని పట్టుదలతో ఉన్నారాయన. అందులో భాగంగానే కాస్త నెమ్మదిగా అయినా సరే మంచి కథలతో ముందుకు రావాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ సారి ఎప్పుడు ట్రై చేయని డిఫరెంట్ జానర్స్ ను ఎంచుకుంటున్నారు. ఇప్పటికే ఒకటి కన్ఫామ్ అవ్వగా.. మరో రెండు కథలు చర్చల దశలో ఉన్నట్లు తెలిసింది.
ప్రస్తుతం చైతన్య.. మత్స్యకారుల బ్యాక్ డ్రాప్ లో చందూ మొండేటితో కలిసి ఓ సినిమా షురూ చేయనున్నారు. ఇందులో చైతూ మత్స్యకారుడిగా కనిపించనున్నారని తెలిసింది. ఈ క్యారెక్టర్ ను ఎమోషనల్ గా అలానే.. చాలా డిఫరెంట్ గా డిజైన్ చేస్తున్నారని వినికిడి. ఈ చిత్రానికి 'తండేల్' అనే టైటిల్ పరిశీలనలో ఉందట. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఇది రూపొందనుంది.
అయితే ఇంకా సెట్స్ పైకి వెళ్లనేలేదు. అప్పుడే మరో రెండు చిత్రాలను లైన్ లో పెట్టే ప్రయత్నాల్లో ఉన్నారు చైతూ. అందులో ఒకటి.. 'సామజవరగమన' డైరెక్టర్ రామ అబ్బరాజుతో అని తెలిసింది. రీసెంట్ గా అబ్బరాజు సామజవరగమనతో బిగ్ హిట్ ను అందుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఆయనకు కాస్త డిమాండ్ పెరిగింది. ఈ క్రమంలోనే ఆయన చైతూను కలిసి ఓ కథ వినిపించారని తెలిసింది. ఈ సినిమా కథ.. విడాకుల నేపథ్యంలో ఉంటుందని ప్రచారం సాగుతోంది. అయితే ఈ కథ చైతూకు నచ్చినప్పటికీ.. కొన్ని కరెక్షన్స్ చేయాలని సూచించారట.
ఇకపోతే రెండో సినిమా.. తనకు 'మజిలీ' చిత్రంతో గ్రాండ్ హిట్ ఇచ్చిన శివ నిర్వాణ తో అని తాజాగా సమాచారం అందింది. మైత్రి మూవీ మేకర్స్ దీనిని రూపొందించనుందని వార్తలు వచ్చాయి. దీనిని చైతూ 25వ ల్యాండ్ మార్క్ చిత్రంగా రూపొందించాలని ప్రయత్నాలు చేస్తున్నారట. ఈ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబరులో సెట్స్ పైకి తీసుకెళ్లాలని నిర్మాణ సంస్థ సన్నాహాలు చేస్తుందని తెలిసింది.
అలా చైతూ.. దర్శకులు రామ అబ్బరాజు, శివనిర్వాణలతో చర్చలు జరిపారని ప్రచారం సాగుతోంది. ఇప్పుడు చందూ మొండేటితో చేయబోయే సినిమా చైతూకు 23వది. ఈ చిత్రం పూర్తయ్యేసరికి దాదాపు ఐదు, ఆరు నెలలైనా పడుతుంది. అంటే డిసెంబర్ నాటికి పూర్తవుతుంది. ఈలోగా రామ అబ్బరాజు కథ కూడా ఓ కొలిక్కి వస్తుంది. కథ పక్కా అయితే.. చైతూ బ్యాలెన్స్ చేస్తూ.. ఒకేసారి రామ అబ్బరాజు, శివనిర్వాణల దర్శకత్వంలో నటించాల్సి వస్తుంది. లేదంటే ఒకటి తర్వాత మరొకటి సెట్స్ పైకి తీసుకెళ్లాలి.
అయితే ఇప్పటికే మైత్రీ మూవీ మేకర్స్ చైతూ 25వ చిత్రంగా డిసెంబరు నాటికి సెట్స్ పైకి తీసుకెళ్లి దీన్ని రూపొందించేలా ప్లాన్ చేస్తుందని అంటున్నారు. ఆ లెక్క ప్రకారం చూస్తే.. చైతూ రెండు సినిమాల్లో ఒకే సారి నటించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అదే రామ అబ్బరాజు కథ వర్కౌట్ అవ్వకపోతే మాత్రం.. చైతూ 24వ సినిమాగా శివ నిర్వాణతో మైత్రిమూవీ మేకర్స్ నిర్మించాల్సి వస్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..