రానా 'హిరణ్యకశ్యప' ముందు ఎన్ని సవాళ్లో
ఇప్పుడు ఆయన నుంచి రాబోతున్న మరో కొత్త సినిమా 'హిరణ్యకశ్యప'. 'అమర్ చిత్ర కథ' కామిక్ స్టోరీ ఆధారంగా దీన్ని రూపొందించనున్నారు.
By: Tupaki Desk | 22 July 2023 12:13 PM GMTటాలీవుడ్ యాక్టర్ నటుడు రానా దగ్గుబాటి కెరీర్ ప్రారంభం నుంచి హీరోగానే కాకుండా కథకు బలమున్న పాత్రలను పోషిస్తూ వస్తున్నారు. ఇండియా వైడ్ గా పాపులారిటీని సంపాదించుకున్నారు. ఇప్పుడు ఆయన నుంచి రాబోతున్న మరో కొత్త సినిమా 'హిరణ్యకశ్యప'. 'అమర్ చిత్ర కథ' కామిక్ స్టోరీ ఆధారంగా దీన్ని రూపొందించనున్నారు. అయితే ఇప్పుడీ సినిమా.. దర్శకుడు గుణశేఖర్ ట్వీట్ తో కొత్త వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే.
వాస్తవానికి ఈ సినిమాను దర్శకుడు గుణశేఖర్.. రానాతో కలిసి చేయాల్సింది. కానీ ఏమైందో తెలీదుకానీ... మూవీ పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు గుణశేఖర్ పేరు లేదు. కేవలం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ పేరు మాత్రమే ఉంది. ఆయనే ఈ చిత్రానికి కథ అందించనున్నట్లు అందులో ఉంది. దీంతో గుణశేఖర్.. రానా, త్రివిక్రమ్ పై పరోక్ష విరుచుకుపడ్డారు.
అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయమేమిటంటే.. సినిమాను ఎవరు తెరకెక్కించినా.. కొన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ సినిమాలో ఎంత మంచి కథ ఉన్నా దాన్ని ప్రజెంట్ చేసే విధానం బాగుండాలి. ఆ విషయంలో గుణశేఖర్ ఈ మధ్య ఫెయిల్ అయ్యారన్న సంగతి తెలిసిందే. గతంలో ఆయనకు చారిత్రాత్మక సినిమాలు తీసే విషయమై, అందుకు తగ్గ సెట్టింగ్ లు రియాలిస్టిక్ గా తీర్చిదిద్దే విషయమై ఎంత మంచి పేరున్నా... రీసెంట్ గా ఆయన తెరకెక్కించిన శాకుంతలం డిజాస్టర్ గా నిలిచిపోయింది. ఓ అద్భుతమైన కథను చెడగొట్టారనే విమర్శలను మూటగట్టుకున్నారు. దీంతో ఆయనపై మూవీ లవర్స్ కాస్త నమ్మకాన్ని కోల్పోయారు. అందుకే రానా కూడా గుణశేఖర్ పేరును వెల్లడించలేదని అనుకున్నారు.
ఇకపోతే రానా.. 'హిరణ్యకశ్యప'ను భారీ వీఎఫ్ఎక్స్ చిత్రంగా రూపొందించాలనుకుంటున్నారు. అంటే కేవలం త్రివిక్రమ్ ఇచ్చిన స్క్రీన్ ప్లే, మాటలు, కథ మాత్రమే సరిపోదు. సినిమాగా బాగా అద్భుతంగా తీర్చిదిద్దగల ఓ టాలెంట్ ఉన్నా బడా దర్శకుడు కావాలి. మరి ఎలాగో గణశేఖర్ ఆ నమ్మకాన్ని కోల్పోయారు. మరి ఇలాంటి సందర్భంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించే ఆ దర్శకుడు ఎవరన్నది ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న అతిపెద్ద ప్రశ్న.
ఒకవేళ ఈ చిత్రానికి దర్శకుడు దొరికి రానా సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లితే.. దర్శకుడు గుణశేఖర్ ఏం చేస్తారన్నది ఇక్కడ మరో ఆసక్తికరం విషయం. ఎందుకంటే ఆయన ఇప్పటికే ఈ సినిమాపై బాగా రిసెర్చ్ చేసి వర్క్ కూడా చేశారు. దీనిపై గతంలో రానాతో చర్చలు జరిపారు. మరి ఇటువంటి సమయంలో రానా మరో దర్శకుడితో ఈ సినిమా చేస్తే.. గుణశేఖర్ కాపీరైట్ క్లైమ్ చేస్తారా? లేదా.. గణశేఖరే సొంతంగా ఈ కథను మరో హీరోతో చేస్తారా? లేదంటే.. రానానే కాపీ రైట్ క్లైమ్ చేస్తారా?. నిజానికి అసలు ఇది అయ్యే అవకాశమే లేదు. ఎందుకంటే ఈ కథ పురాణాలకు సంబంధించినది. ఎవరైనా దీన్ని తెరకెక్కించవచ్చు. కాపీరైట్ సమస్య ఉండదు.
అయితే దీన్ని చాలా జాగ్రత్తగా తీర్చిదిదాల్సిన అవసరం ఉంటుంది. లేదంటే విమర్శలను మూటగట్టుకుని భారీ నష్టాన్ని కోరి తెచ్చుకున్నట్లు అవుతుంది. అందుకు ఉదాహరణే ప్రభాస్ 'ఆదిపురుష్'. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం భారీ డిజాస్టర్ ను అందుకుంది. రామాయణాన్ని వక్రీకరించారని అందరూ విమర్శించారు. కాబట్టి దీనిని దృష్టిలో ఉంచుకుని ఎవరి మనోభావాలను దెబ్బతీయకుండా సినిమా చేయాల్సిన అవసరం ఉంది. చూడాలి మరి ఈ చిత్రాన్ని రానా ఎలా తెరకెక్కిస్తారో, ఏ దర్శకుడి చేతిలో బాధ్యతలను పెడతారో..