Begin typing your search above and press return to search.

ప్ర‌పంచాన్ని ఎదిరించిన నేత‌కు అరెస్టు భ‌యం.. ఎవ‌రు? ఎందుకు?

దీనికి కార‌ణం.. పుతిన్ క‌నుక దేశం విడిచి బ‌య‌ట‌కు వ‌స్తే.. అరెస్టు చేస్తార‌నే భ‌యం వెంటాడుతుండ‌డ‌మే.

By:  Tupaki Desk   |   20 July 2023 3:51 AM GMT
ప్ర‌పంచాన్ని ఎదిరించిన నేత‌కు అరెస్టు భ‌యం.. ఎవ‌రు?  ఎందుకు?
X

ఆయ‌న ప్ర‌పంచాన్ని సైతం ఎదిరించారు. నిత్యం మీడియా చ‌ర్చ‌ల్లోనూ ఉంటున్నారు. అంతేకాదు.. ప్ర‌పంచ దేశాలు వారించినా.. వెన‌క్కి త‌గ్గ‌కుండా ఉక్రెయిన్‌పై యుద్ధ శ‌త‌ఘ్నుల‌ను ముమ్మ‌రంగా ప్ర‌యోగించిన వాడు. ఆయ‌నే ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాద‌మిర్ పుతిన్‌.

దాదాపు ఏడాదిన్న‌ర పైగా కాలంగా ఆయ‌న ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో అమెరికా, బ్రిట‌న్‌, భార‌త్ వంటి అగ్ర‌దేశాలు అనేక సార్లు విజ్ఞ‌ప్తి చేశాయి. శాంతి యుత పంథానే శ‌ర‌ణ్య‌మ‌ని భార‌త్ మొత్తుకుంది. అయినా.. కూడా పుతిన్ ఇప్ప‌టికీ యుద్ధం చేస్తున్నారు.

అంతేకాదు.. త‌న వ‌ద్ద అణుబాంబులు సైతం ఉన్నాయ‌ని, త‌న‌ను ఎదిరించేవారికి బుద్ధి చెబుతాన‌ని కూడా మ‌ధ్య‌లో ఒక‌సారి హెచ్చ‌రించి ప్ర‌పంచ స్థాయిలో ప్ర‌క‌ట‌న‌లు పుట్టించారు. అంతటి ధీశాలిగా త‌న‌ను తాను పేర్కొనే పుతిన్‌.. తాజాగా హ‌డ‌లి పోతున్నారు. త‌న‌ను ఎక్క‌డ అరెస్టు చేస్తారోన‌నే భ‌యంతో గ‌డ‌ప దాటి బ‌య‌ట‌కు రావ‌డ‌మే లేదు. ఇదే విష‌యాన్ని తాజాగా అంత‌ర్జాతీయ మీడియా చెప్పుకొచ్చింది. ''ర‌ష్యా అధినేత దేశం విడిచి వ‌చ్చేందుకు స‌సేమిరా అంటున్నారు'' అని బీబీసీ ప్ర‌క‌ట‌న చేసింది.

మ‌రి ఇంత భ‌యానికి కార‌ణం.. త‌న‌ను ఎందుకు అరెస్టు చేస్తార‌ని పుతిన్ భావిస్తున్నారు? అనేది ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌గా మారింది. విష‌యంలోకి వెళ్తే.. జోహానెస్‌బర్క్‌లో వ‌చ్చే నెల 22-24 తేదీల్లో బ్రిక్స్ దేశాల స‌ద‌స్సు జ‌ర‌గ‌నుంది.

ఈ బ్రిక్స్ దేశాల్లో భార‌త్‌, చైనా, ర‌ష్యా, బ్రిట‌న్‌, ద‌క్షిణాఫ్రికాలు స‌భ్య దేశాలు. వార్షిక స‌ద‌స్సు ఈ సంవ‌త్స‌రం ద‌క్షిణాఫ్రికాలో ఏర్పాటు చేశారు. అయితే.. ఈ స‌మావేశానికి ఆయా దేశాల అధినేత‌లు(ప్ర‌ధానులు లేదా అధ్య‌క్షులు) పాల్గొన‌డం సంప్ర‌దాయం. అయితే.. ఈ సారి స‌ద‌స్సుకు పుతిన్ హాజ‌రు కావ‌డం లేద‌ని ర‌ష్యా అధికారికంగా ప్ర‌క‌టించింది.

పుతిన్ బ‌దులుగా సెర్గీ లావ్రోవ్ వెళ్తున్న‌ట్టు ర‌ష్యా పేర్కొంది. దీనికి కార‌ణం.. పుతిన్ క‌నుక దేశం విడిచి బ‌య‌ట‌కు వ‌స్తే.. అరెస్టు చేస్తార‌నే భ‌యం వెంటాడుతుండ‌డ‌మే. ఉక్రెయిన్‌పై పుతిన్ యుద్ధం చేస్తున్న‌ కారణంగా మాన‌వ హ‌న‌నానికి సంబంధించి ఆయనపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు గత మార్చిలో అరెస్టు వారెంటు జారీ చేసింది.

పుతిన్‌ బ్రిక్స్ సదస్సుకు వస్తే ఆయనను దక్షిణాఫ్రికా అరెస్టు చేయక తప్పని పరిస్థితి ఏర్ప‌డింది. దీంతో త‌న‌ను ఎక్క‌డ అరెస్టు చేస్తారోన‌నే భ‌యంతో పుతిన్ దేశ స‌రిహ‌ద్దులు దాట‌డం లేద‌ని బీబీసీ వెల్ల‌డించ‌డం విశేషం. ఇదే విష‌యాన్ని ద‌క్షిణాఫ్రికా కూడా ప్ర‌క‌టించింది. దీనిపై నెటిజ‌న్లు స‌టైర్లు వేస్తున్నారు ప్ర‌పంచాన్ని ఎద‌రించిన ధీశాలి అరెస్టుకు భ‌య‌ప‌డుతున్నారే! అని కామెంట్లు చేస్తున్నారు.