కొత్త టెన్షన్: 4..6..9..12.. డేట్ మారే కొద్దీ పెరుగుడే!
ఇదిలా ఉండగా శనివారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన కరోనా కేసుల బులిటెన్ ప్రకారం రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 1322 టెస్టులు చేయగా 12 కేసులు పాజిటివ్ గా తేలినట్లుగా పేర్కొన్నారు.
By: Tupaki Desk | 24 Dec 2023 4:39 AM GMTప్రపంచాన్ని వణికించిన మహమ్మారి.. గడిచిన కొంతకాలంగా మాట్లాడుకున్నదే లేదు. తాజాగా జేఎన్ 1 వేరియంట్ పుణ్యమా అని పలు దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇలాంటి వేళ.. దేశంలో కేరళలో మొదలైన కొవిడ్ కేసుల పరంపర.. అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. తెలంగాణ విషయానికి వస్తే.. నాలుగైదు రోజుల క్రితం నాలుగు కేసులతో మొదలైన కౌంటింగ్ రోజు గడిచే కొద్దీ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.
తొలిరోజున నాలుగుగా ఉన్న పాజిటివ్ కేసులు.. తర్వాతి రోజుకు ఆరుకు వెళ్లటం.. ఆ వెంటనే తొమ్మిదిగా మారిన ఈ కేసులు ఇప్పుడు రోజులో పన్నెండు కేసులు వెలుగు చూశాయి. రెండు రోజుల క్రితం ఇద్దరు చిన్నారుల్లో కొవిడ్ లక్షణాలు బయటకు రావటం ఆందోళన కలిగించింది. అయితే.. తాజాగా వెలుగు చూస్తున్న కొవిడ్ కేసులు ఏ వేరియంట్ కు చెందినవన్న విషయంపై స్పష్టత రావటం లేదు.
ఇదిలా ఉండగా శనివారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన కరోనా కేసుల బులిటెన్ ప్రకారం రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 1322 టెస్టులు చేయగా 12 కేసులు పాజిటివ్ గా తేలినట్లుగా పేర్కొన్నారు. ఈ పన్నెండు కేసుల్లో హైదరాబద్ లో 9.. వరంగల్, రంగారెడ్డి.. సంగారెడ్డి జిల్లాల్లో ఒక్కొక్క కేసు చొప్పున నమోదైనట్లుగా వెల్లడించారు. రోజు వ్యవధిలో వీరిలో ఒకరు కోలుకోగా.. మిగిలిన వారు చికిత్స తీసుకుంటున్నారు. మరో ముప్ఫై మందికి సంబంధించిన రిపోర్టులు రావాల్సి ఉంది. మొత్తంగా తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతానికి 38 మంది కొవిడ్ చికిత్స తీసుకుంటున్న వారున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య నెమ్మదిగా పెరుగుతున్నాయి. పెరుగుతున్న కేసుల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి దామోదర్ రాజనర్సింహా రివ్యూ చేశారు. ఆసుపత్రుల్లో ఆక్సిజన్ సిలిండర్లు.. వెంటిలేటర్లు.. ఇతర అంశాలపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా అధికారులు మంత్రి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చప్పే క్రమంలో రాష్ట్ర పరిధిలో ఉన్న ల్యాబుల్లో రోజు వ్యవధిలో 16,500 ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేసే సామర్త్యం ఉందని పేర్కొన్నారు.
మరో 84 ప్రైవేటు ఆర్టీపీసీఆర్ ల్యాబ్ లు ఉన్నాయని.. అవసరమైతే వేలాది పరీక్షలు ఒకేసారి చేయించగల సామర్థ్యం ఉందని చెప్పాలి. తాజాగా నిర్వహించిన సమీక్షా సమావేశంలో రోజుకు నాలుగు వేల చొప్పున పరీక్షలు చేయటమే లక్ష్యంగా పెట్టుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అంతేకాదు.. ప్రతి రోజు కొవిడ్ పరీక్షలు.. ఫలితాలకు సంబంధించిన హెల్త్ బులిటెన్ సాయంత్రం 4గంటల్లోపే విడుదల చేయాలని ఆదేశించటం గమనార్హం.