లిక్కర్ తీసుకునే అలవాటు ఉందా? చదవటం మిస్ చేయొద్దు
హాని అన్న విషయం తెలిసినా.. పట్టించుకోకుండా వ్యవహరించే తీరు కనిపిస్తుంది. అది ధూమపానం విషయంలో కానీ మద్యపానం అంశంలో కానీ
By: Tupaki Desk | 23 Sep 2024 4:09 AM GMTహాని అన్న విషయం తెలిసినా.. పట్టించుకోకుండా వ్యవహరించే తీరు కనిపిస్తుంది. అది ధూమపానం విషయంలో కానీ మద్యపానం అంశంలో కానీ. ప్రతి సిగిరెట్ పాకెట్ మీదా.. ప్రతి లిక్కర్ సీసా మీదా.. డేంజర్ అలెర్టు ఉండటమే కాదు.. ఆరోగ్యం ఎంత ఖరాబు అవుతుందన్న విషయాన్ని చెప్పినా.. పట్టించుకోకుండా ఉండటం చూస్తూనే ఉంటాం. తాజాగా మద్యపానం అలవాటు ఉన్న వారికి మెదడులో రక్తస్రావం అధికంగా ఉండే ముప్పు ఉందన్న విషయాన్ని అమెరికాలో చేపట్టిన తాజా అధ్యయనం వెల్లడించింది. ఈసందర్భంగా పలు అంశాల్ని గుర్తించారు.
ఫ్లోరిడా అట్లాంటిక్ వర్సిటీకి చెందిన షిమిట్ కాలేజీ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు చేపట్టిన అధ్యయనంలో కింద పడటం కారణంగా తలకు గాయాలపాలైన 3128 మందిపై పరిశోధనలు చేపట్టారు. వీరిలో 18.2 శాతం మందికి మద్యం అలవాటు ఉందని.. అందులో ఆరు శాతం మంది రోజూ తాగుతారన్న విషయాన్ని గుర్తించారు. మద్యం తాగని వారితో పోలిస్తే.. అప్పుడప్పుడు మద్యం తీసుకునే వారి మెదడులో రక్తస్రావం కావటం రెట్టింపుగా ఉన్నట్లు గుర్తించారు.
అదే సమయంలో అప్పుడప్పుడు మద్యం తాగే వారిలో ఉండే ఈ ముప్పుతో పోలిస్తే.. రోజు మద్యం తాగే వారిలో ఈ ముప్పు 150 శాతం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. జర్నల్ ఆఫ్ ది అమెరికన్ కాలేజీ ఆఫ్ ఎమర్జెన్సీ ఫిజీషియన్స్ ఓపెన్ లో ఈ ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. ఇదంతా 65 ఏళ్లకు పైబడిన పెద్ద వయస్కులు కింద పడి తలకు దెబ్బ తగిలి తీవ్ర గాయాలు అయినప్పుడు ఈ పరిస్థితి ఉందని గుర్తించారు. మొత్తంగా మద్యం తాగే వారిలో మెదడుపై పడే ప్రభావం.. రక్తస్రావానికి సంబంధించిన కారణాలపై కొందరు వైద్యులు మరిన్ని ఆసక్తికర అంశాల్ని చెబుతున్నారు.
తల పుర్రెకు మెదడుకు మధ్య చిన్నచిన్న రక్తనాళాలు అనేకం ఉండటం తెలిసిందే. మామూలుగా కపాలం.. మెదడు మధ్య ఖాళీ ఉండదని.. వయసు పెరిగేకొద్దీ గ్రే మ్యాటర్ తగ్గుతూ మెదడు కుంచించుకుపోతుందని చెబుతున్నారు. మద్యం తాగే వారిలో ఇది వేగంగా.. ఎక్కువగా ఉంటుందని.. ఫలితంగా మెదడు.. కపాలం మధ్య ఖాళీ ఏర్పడి.. చిన్న గాయమైనా రక్తనాళాలు తెగి రక్తస్రావానికి అవకాశం ఉందంటున్నారు. దెబ్బ తగిలిన వెంటనే కాకున్నా.. కొద్ది రోజుల తర్వాత రక్తస్రావం జరుగుతుందని చెబుతున్నారు. దీర్ఘకాలంగా మద్యం తీసుకునే వారిలో బీ1 లోపం వస్తుందని.. దీని కారణంగా మతిమరుపు.. గందరగోళం.. ఒక వస్తువు రెండుగా కనిపించటం..కంటి కండరాలు పని చేయకపోవటం లాంటివి తలెత్తుతాయని చెబుతున్నారు.
ఇక.. లిక్కర్ తీసుకునే వారికి.. వారి కాలేయం మీద ప్రభావం పడటం తెలిసిందే. శరీరంలో చేరే కొన్ని విషపదార్థాలు సహజంగా బయటకు వెళ్లిపోవాలి. కాలేయం పని చేయనప్పుడు అమ్మోనియా.. మాంగనీస్ రక్తంలో పేరుకుపోతాయని.. ఈ రెండింటి కారణంగా మెదడు దెబ్బ తింటుందని.. చురుకుదనం తగ్గి..జీవితకాలం తగ్గటం జరుగుతుందని చెబుతున్నారు. అంతేకాదు మెదడులో గ్రేమ్యాటర్.. వైట్ మ్యాటర్ అనేవి రెండు ఉంటాయని.. అల్కహాల్ తాగేవారిలోఆ రెండింటికి నష్టం జరుగుతుందని.. ఫలితంగా ఫ్రాంటల్ బోబ్ పని చేయదని హెచ్చరిస్తున్నారు. మద్యం తాగే వారు తస్మాత్ జాగ్రత్త.