డైనింగ్ టేబుల్ మీద కాదు నేల మీద కూర్చొని తింటే ఇన్ని లాభాలు
ఇంతకూ నేల మీద కూర్చొని తింటే కలిగే లాభాల జాబితా పెద్దదే. నేల మీద కూర్చొని తినటం వల్ల పొట్ట చుట్టూ ఉండే కండరాల్లో నొప్పి ఉంటే తొలిగిపోతుంది.
By: Tupaki Desk | 1 March 2025 2:00 PM ISTకాలం మారింది. వసతులకు కొదవ లేని పరిస్థితి. ఊళ్లను పక్కన పెడితే పట్టణాలు.. నగరాల్లోని ప్రతి ఇంట్లోనూ డైనింగ్ టేబుల్ అన్నది కామన్ గా మారింది. ఒకప్పుడు నేల మీద కూర్చొని తినే అలవాటు ఇప్పటితరంలో దాదాపు కనిపించటం లేదు. కొందరు టీవీ ఎదురుగా.. మంచ మీద కూర్చొని ప్లేట్ ను ఒళ్లో పెట్టుకొని తినేస్తుంటారు. డైనింగ్ టేబుల్ ను వదిలేసి నేల మీద కూర్చొని తింటే కలిగే లాభాలు.. ఆరోగ్యానికి చేసే మేలు గురించి తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్లుగా నేల మీద కూర్చొని తినే అలవాటు రోజు కాకుండా తరచూ చేయటం చాలామంచిదన్న విషయం మీకు తెలుసా?
ఇంతకూ నేల మీద కూర్చొని తింటే కలిగే లాభాల జాబితా పెద్దదే. నేల మీద కూర్చొని తినటం వల్ల పొట్ట చుట్టూ ఉండే కండరాల్లో నొప్పి ఉంటే తొలిగిపోతుంది. ఇలా రోజు కింద కూర్చొని తినటం అలవాటు చేసుకుంటే కండరాల్లో కదలిక పెరిగి అవి ఫ్లెక్సిబుల్ గా.. బలంగా మారతాయి. నేల మీద కూర్చొని తినే భంగిమ పలు రకాల శారీరక నొప్పుల నుంచి ఉపశమనాన్ని ఇస్తుందని చెబుతారు.
తినే పళ్లాన్ని నేల మీద ఉంచి ముందుకు వంగి తినటం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఎందుకుంటే ముందకు వెనక్కి వెంటవెంటనే చేసే భంగిమలు ఆహారం జీర్ణం కావటానికి అవసరమైన అమ్లాలు శరీరంలో ఉత్పత్తి అవుతాయని చెబుతారు. దీంతో జీర్ణ సంబంధిత సమస్యలు రాకుండా ఉండేందుకు వీలవుతుందని చెబుతారు. అదే సమయంలో శరీరానికి అవసరమైన శక్తి కూడా అందుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇక్కడో అంశాన్ని ప్రస్తావించాలి. నడుము నొప్పి.. కీళ్ల నొప్పులు ఉన్న వారు మాత్రం వైద్యుల సలహా.. సూచనలకు అనుగుణంగా ఎలా కూర్చొని తింటే మంచిదని చెబితే దాన్ని ఫాలో కావటం ఉత్తమం.
నేల మీద కూర్చొని తినటం ద్వారా బరువు తగ్గే వీలుందన్నది మరో ఆసక్తికర కోణం. సాధారణంగా మనకు సరిపోయేంత తిన్నావా? లేదా? అన్నది తెలియటానికి పొట్ట నుంచి మెదడుకు సిగ్నల్ అందించే నాడి ఉంటుంది. డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తినటం కంటే కింద కూర్చొని తినటం వల్ల ఈ నాడి మరింత సమర్థంగా పని చేస్తుందని.. దీంతో మనకు అవసరమైనంత మాత్రమే తినే వీలుందని చెబుతారు. కింద కూర్చొని తినే అలవాటు తెలీకుండానే ఇంట్లో వారంతా ఒకేసారి కలిసి కూర్చొని తినే అలవాటుకు కారణమవుతుంది. ఇది కుటుంబంలోని సభ్యుల మధ్య బంధాన్ని మరింత పెంచేలా చేస్తుంది. ఇలాంటి ప్రయోజనాల నేపథ్యంలో కింద కూర్చొని తినే అలవాటు షురూ చేసి.. డైనింగ్ టేబుల్ ను వాడే అలవాటుకు టాటా చెప్పాల్సిన అవసరం ఉంది.