మీ పిల్లలు బరువుగా ఉంటారా? మిస్ కాకుండా చదవండి
స్కూల్ కావొచ్చు.. బహిరంగ ప్రదేశాలు ఏవైనా కావొచ్చు. కాసేపు ఒక పక్కన కూర్చొని తదేకంగా మీ చుట్టూ ఉన్న పరిసరాల్ని చూడండి.
By: Tupaki Desk | 13 Jun 2024 2:30 PM GMTస్కూల్ కావొచ్చు.. బహిరంగ ప్రదేశాలు ఏవైనా కావొచ్చు. కాసేపు ఒక పక్కన కూర్చొని తదేకంగా మీ చుట్టూ ఉన్న పరిసరాల్ని చూడండి. చుట్టూ ఉన్న పిల్లల్లో అత్యధికంగా వారు ఉండాల్సిన బరువు కంటే ఎక్కువగా ఉండటం కనిపిస్తుంది. ఊబకాయం కామన్ గా కనిపిస్తుంది. ఇప్పుడు మీ ఇంట్లో ఉన్న పిల్లల్ని చూడండి. నూటికి డెబ్భై శాతం మంది పిల్లలు వారు ఉండాల్సిన బరువు కంటే ఎక్కువగా ఉన్న వైనం కనిపిస్తుంది. మారిన పెంపకం.. ఆహార అలవాట్లు పిల్లల్లో బరువు పెంచేందుకు కారణమవుతోంది.
ఊబకాయం కారణంగా పిల్లల్లో మేధో సామర్థ్యం తగ్గుతుందన్న కొత్త అంశాన్ని తాజా అధ్యయనం స్పష్టం చేసతోంది. అమెరికా శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలో వెల్లడైన షాకింగ్ నిజం ఇప్పుడు అందరిని ఆందోళనకు గురి చేసేలా మారింది. బరువు ఎక్కువగా ఉన్న పిల్లల్లో ఐక్యూ తగ్గే వీలుందని.. దీని కారణంగా వారు మానసిక కుంగుబాటు సమస్యను ఎదుర్కొంటారని పేర్కొంటున్నారు. తొమ్మిది నుంచి పదకొండేళ్ల మధ్య ఉన్న ఐదు వేల మంది చిన్నారులను చెక్ చేయటం ద్వారా ఈ రిపోర్టును సిద్ధం చేశారు.
పిల్లల డేటాను 2016 జూన్ నుంచి 2018 అక్టోబరు మధ్యలో సేకరించారు. రెండేళ్ల పాటు వారి తీరు తెన్నుల్ని తెలుసుకున్నారు. వారి శరీర ఎత్తు.. బరువు మధ్య తేడాను గుర్తించారు. ఇందుకు వారి నడుము సైజును తీసుకున్నారు. అనంతరం వారి మానసిక సామర్థ్యాన్ని తెలిపే పరీక్షను నిర్వహించారు. ఆరోగ్యకర బరువు ఉన్న వారితో పోలిస్తే బరువు ఎక్కువగా ఉన్న పిల్లల మానసిక సామర్థ్యం ఒక పాయింట్ మేర తక్కువగా ఉన్నట్లు గుర్తించారు.
బీఎంఐ అధికంగా ఉండటం ద్వారా కుంగుబాటు సమస్య కనిపించినట్లుగా సైంటిస్టులు తేల్చారు. ఊబకాయానికి జీవక్రియ.. ఆహారం.. శారీరక శ్రమ.. తక్కువ నిద్రలు కారణమని తేల్చారు. ఇక.. జన్యు అంశాల కారణంగా ఉండే ఊబకాయాన్ని తగ్గించటం సాధ్యం కాదని చెబుతున్నారు. పిల్లల్ని చురుగ్గా ఉండేలా కార్యకలాపాల్ని నిర్వహించటంతోపాటు.. పండ్లు. .కూరగాయలు ఎక్కువగా తినేలా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. అంతేకాదు.. చక్కెర అధికంగా ఉండే ఫుడ్.. చక్కెర అధికంగా ఉండే డ్రింక్స్ కు దూరంగా ఉంచాలని చెబుతున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటే పిల్లల్లో ఉబకాయం సమస్యను దూరంగా ఉండొచ్చని చెప్పొచ్చు. పిల్లల అధిక బరువులో తల్లిదండ్రులే ఎక్కువ పాత్ర అని చెప్పక తప్పదు.