Begin typing your search above and press return to search.

ఉదయం 8 గంటలకు బ్రేక్ ఫాస్ట్.. తినకుంటే అంత నష్టమా?

ఉదయాన్నే తినే టిఫిన్ ఎన్ని గంటలకు తింటున్నారు? అన్న ప్రశ్న వేస్తే..ఒక్కొక్కరు ఒక్కో సమాధానం ఇస్తారు

By:  Tupaki Desk   |   16 Jan 2024 10:30 AM GMT
ఉదయం 8 గంటలకు బ్రేక్ ఫాస్ట్.. తినకుంటే అంత నష్టమా?
X

ఉదయాన్నే తినే టిఫిన్ ఎన్ని గంటలకు తింటున్నారు? అన్న ప్రశ్న వేస్తే..ఒక్కొక్కరు ఒక్కో సమాధానం ఇస్తారు. చాలామంది ఉదయం 9-10 గంటల మధ్యలో అని చెబుతారు. దాదాపు లక్షకు పైగా శాంపిళ్లను పరిశీలించిన ఒక కొత్త రిపోర్టు చెప్పే విషయం తెలిస్తే వెంటనే ఉదయం టిఫిన్ తినే టైంను మార్చుకోవాలన్న అంశంపై ఫోకస్ చేయాలనుకోవటం ఖాయం. ఏం తింటున్నామన్నది ఎంత ముఖ్యమో.. ఎన్ని గంటలకు తింటున్నామన్నది కూడా అంతే ముఖ్యమన్న సంగతి తెలిసిందే.

ఉదయాన్నే తీసుకునే టిఫిన్ విషయంలో ఇది చాలా కీలకమని ఐఎస్ గ్లోబల్ నిర్వహించిన అధ్యయనం చెబుతోంది. ఉదయం 9 గంటల తర్వాత తీసుకునే టిఫిన్ వల్ల ప్రయోజనం సంగతి ఎలా ఉన్నా.. షుగర్ జబ్బు వచ్చే ముప్పు ఉందన్న విషయం వెల్లడైంది. ఉదయం 9 గంటల తర్వాత టిఫిన్ తినే వారితో పోలిస్తే.. ఉదయం 8 గంటల్లోపు టిఫిన్ తినే వారికి మధుమేహం 59 శాతం తగ్గుతున్నట్లుగా తాజా అధ్యయనం స్పష్టం చేసింది.

రోజువారీగా మనం తీసుకునే ఆహార వేళలు రక్తంలో గ్లూకోజు.. కొలెస్ట్రాల్ మోతాదుల్ని నియంత్రించే విషయంలో కీలకంగా వ్యవహరిస్తాయి. అందుకే.. తాజా అధ్యయనాన్ని తినే తిండి టైం మీద ఫోకస్ చేవారు. ఫుడ్ తీసుకునే టైం మధ్య గ్యాప్.. తినే టైంతో పాటు.. టైప్ 2 మధుమేహం మధ్య లింకును గుర్తించటానికి పరిశోధకులు ప్రయత్నించారు. ఇందులో భాగంగా 1.03 లక్షల మంది శాంపిళ్లను సేకరించారు. వారిచ్చిన డేటాను విశ్లేషించారు. రెండేళ్లుగా వారి ఆహార అలవాట్లు.. మధుమేహం లెక్కల్ని తీశారు.

ఉదయం తొమ్మిది గంటల తర్వాత టిఫిన్ చేసే వారికి షుగర్ ముప్పు ఎక్కువగా ఉందన్న విషయాన్ని గుర్తించారు. ఇందులోని శాస్త్రీయత ఏమిటన్నది చూస్తే.. అల్పాహారం మానేయటం వల్ల గ్లూకోజ్.. కొలెస్ట్రాల్ నియంత్రణ గతి తప్పుతుంది. ఇన్సులిన్ హార్మోన్ మోతాదులు అస్తవ్యవస్తం అయ్యే ఛాన్సులు ఉన్నాయి. అందుకే.. ఉదయాన్నే 8 గంటలకు టిఫిన్ తీసుకోవటం.. రోజు మొత్తంలో కొద్ది మొత్తంలో ఐదుసార్లు ఆహారాన్ని తీసుకోవటం మంచిదని చెబుతున్నారు. చివరిసారి మాత్రం రాత్రి ఏడు గంటల్లోపే తినటం చాలామంచిదని చెబుతున్నారు.

ఉదయాన్నే ఆలస్యంగా టిఫిన్ చేసే వారికి షుగర్ ముప్పు ఎలా ఉందో.. రాత్రి వేళ ఆలస్యంగా అంటే పది గంటల తర్వాత తినే వారికి మధుమేహం ముప్పు ఉంటుందని గుర్తించారు. తక్కువ తక్కువగా రోజుకు ఐదుసార్లు తినే వారికి షుగర్ ముప్పు తక్కువని గుర్తించారు. అంతేకాదు.. ఎక్కువగా ఉపవాసం ఉన్న వారు సైతం ఉదయం 8 గంటల్లోపు టిఫిన్ చేసి.. రాత్రి ఏడు గంటల్లోపు డిన్నర్ పూర్తి చేస్తే మధుమేహం ముప్పు తగ్గటానికి వీలవుతుందని గుర్తించారు. సో.. మీ ఫుడ్ టైం సైకిల్ ను చెక్ చేసుకొని.. అందుకు తగ్గట్లు మార్పులు చేసుకోవటం మంచిది.