సరదాగా చప్పట్లు కొట్టడం వల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్..
సంతోషంగా ఉన్నప్పుడు లేకపోతే ఇతరులను అభినందించడానికి మనం చప్పట్లు కొడతాం
By: Tupaki Desk | 15 July 2024 5:30 AM GMTసంతోషంగా ఉన్నప్పుడు లేకపోతే ఇతరులను అభినందించడానికి మనం చప్పట్లు కొడతాం. మరి ఉత్సాహంగా ఉన్నప్పుడు.. లేక మన అభిమాన క్రికెటర్ సిక్సర్ కొట్టినప్పుడు కూడా ఎంతో ఆనందంగా మనం క్లాప్స్ కొడతాము. అయితే ఇలా చప్పట్లు కొట్టడం మన శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది అంటే మీరు నమ్ముతారా..
చప్పట్లు.. అభిమానించడానికి అయినా, మన అభిమానం చాటుకోవడానికి అయినా ఉపయోగించే సాధనం. అయితే ఇలా చప్పట్లు కొట్టడం వల్ల పలు రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అన్న విషయం చాలామందికి తెలియదు. ఎటువంటి శారీరక శ్రమ లేకుండా రోజుకి ఐదు నుంచి ఆరు నిమిషాల వరకు ఇలా చప్పట్లు కొట్టడం వల్ల మనకు ఎన్నో రోగాలు నయమవుతాయట. అయితే ఎలా పడితే అలా కొట్టకూడదు.. దీనికి కూడా ఓ క్రమ పద్ధతి ఉందట. మరి అదేమిటో? చప్పట్లు కొట్టడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం పదండి..
సంతోషకరమైన సందర్భంలో కొట్టే చప్పట్లు మన ఆనందాన్ని వ్యక్తం చేస్తాయి.. అయితే ఓ క్రమబద్ధతిలో రోజు ఎక్ససైజ్ లాగా కొట్టే చప్పట్లు మన ఆరోగ్యాన్ని అభివృద్ధి చేస్తాయి. ఎందుకంటే చప్పట్లు కొట్టడం వల్ల మన శరీరంలోని శక్తి కేంద్రాలు ఉత్తేజితమవుతాయి. శారీరకంగానే కాకుండా కొన్ని మానసికమైన సమస్యలకు కూడా రోజూ చప్పట్ల ఎక్ససైజ్ చాలా మంచిది. డిప్రెషన్ తో బాధపడే వారికి కూడా ఇది మంచి ఉపశమనం కలిగిస్తుంది.
శక్తి చక్రాలు ఉత్తేజితం..
ఆయుర్వేదం ప్రకారం రోజుకు కనీసం ఒక 10 నిమిషాల పాటు చప్పట్లు కొట్టడం వల్ల మన శరీరంలో ఉన్న ఏడు చక్రాలు ఉత్తేజితమవుతాయి. దీనివల్ల మనకు ఏకాగ్రత పెరగడంతో పాటు మన శరీరం యొక్క శక్తి, సామర్థ్యం పెరుగుతుంది. తలనొప్పి, టెన్షన్, స్ట్రెస్, డిప్రెషన్ వంటివి సులభంగా దూరమవుతాయి.
నిద్రలేమి దూరం..
ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ లో చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. నిద్రలేమి సమస్య ఉన్నవారు సాయంత్రం పూట ఒక ఐదు నిమిషాలు చప్పట్లు కొట్టడం వల్ల శరీరం మొత్తం ఉత్తేజితమవుతుంది.. బ్లడ్ సర్కులేషన్ బాగా ఇంక్రీజ్ అయి బాడీ రిలాక్స్ అవుతుంది. దీంతో క్రమంగా వారికి నిద్రలేమి సమస్య దూరం అవుతుంది.
ఆరోగ్యకరమైన అలవాటు ..
రోజు ఇలా చప్పట్లు కొట్టడం ద్వారా ఉదర సంబంధిత సమస్యలతో పాటు మెడ, నడుము నొప్పులు తగ్గుతాయి. అంతేకాదు మూత్రపిండాలు, ఊపిరితిత్తుల పనితీరు మెరుగవ్వడంతో పాటు అనేక సమస్యలు దూరం అవుతాయి. అందుకే ప్రతిరోజు పొద్దున సాయంత్రం మీ వ్యాయామంలో ఒక ఐదు నిమిషాల పాటు చప్పట్లు కొట్టడం అలవాటు చేసుకుంటే చాలా మంచిది.
ఎలా కొట్టాలి..
చప్పట్లు కొట్టడం ఆరోగ్యానికి మంచిది కదా అని ఎలా పడితే అలా కొట్టకూడదు.. దీనికి ఒక క్రమబద్ధతి. రెండు చేతులు మీ భుజాలకు ఎదురుగా పైకి లేపాలి, ఆ తర్వాత చేతులను వీలైనంత వెడల్పుగా చాచి మెల్లిగా చప్పట్లు కొట్టాలి. మొదట నిమిషం పాటు చప్పట్లను నెమ్మదిగా కొట్టి ఆ తర్వాత క్రమంగా స్పీడ్ పెంచుకోవాలి. రెండు నిమిషాల తర్వాత కాస్త గ్యాప్ ఇచ్చి తిరిగి మళ్ళీ చప్పట్లు కొట్టాలి. ఇలా నాలుగు నుంచి ఐదు సార్లు చేయాలి.