కోహ్లి.. రకుల్.. సమంత.. ఒళ్లు ‘జల’దరించే చికిత్స
By: Tupaki Desk | 13 Aug 2023 10:48 AM GMTచల్లగా ఉన్న పదార్థాన్ని కాసేపు పట్టుకోవడమే కష్టం.. చల్లటి వాతావరణంలో మామూలు నీళ్లతో స్నానం చేయడం చాలామందికి బహు కష్టం.. చల్లటి పదార్థం నోటికి తగిలితే దెబ్బతిన్న దంతాలు జివ్వుమంటాయి. ఫ్రిజ్ లో ఏదైనా పదార్థం గడ్డకడితే దానిని పగలకొట్టడమూ కష్టమే.. కానీ, పూర్తిగా కోల్డ్ థెరపీతో ఓ చికిత్స ఉన్న సంగతి మీకు తెలుసా? దీనిని పలువురు ప్రముఖులు పాటిస్తున్న సంగతి మీకు తెలుసా?
క్రికెట్, సినిమా.. భారత దేశంలో ఆ రెండూ పెద్ద మతాలు. క్రికెట్ హీరోలు, సినిమా స్టార్లకు ఉండే ఆదరణ ఇంతాఅంతా కాదు. అయితే, స్టార్ డమ్ ను కాపాడుకోవడానికి వారి ప్రయత్నాలు అన్నీఇన్నీ కాదు. క్రికెటర్లకు ఫిట్ నెస్ ఎంత ముఖ్యమో..? సినీ స్టార్లకు గ్లామర్ అంత ముఖ్యం. దీనికోసం వారి ప్రయత్నాలు సాధారణమైనవి కాదు. జిమ్ లు, యోగాలు, ట్రైనర్లను పెట్టుకుని ప్రత్యేక కసరత్తులు.. ఇలాంటి వాటిలో కొన్ని. వీటన్నిటికీ మించినది ‘‘ఐస్ థెరపీ’’ అంటున్నారు.
ఐస్.. అంత సులువు కాదు బ్రదర్
మనందరికీ ఐస్ క్రీమ్ అంటే ఇష్టమే. వేసవి కాలంలో అయితే మహా ఎంజాయ్ చేస్తాం.. అసలు కాలంతో సంబంధం లేకుండా లాంగిచేస్తాం.. కొందరు పిల్లలైతే డీప్ ఫ్రిజ్ లో గడ్డకట్టిన ఐస్ ను బయటకు తీసి ఆడుకుంటారు. కొన్నిసార్లు వారికి దెబ్బలు తగిలితే వాపు తగ్గేందుకు ఐస్ పెడుతుంటాం. కండరాలు పట్టేసినప్పుడు కూడా ఇలానే చేస్తుంటాం. ఇలాంటిదే ‘‘కోల్డ్ థెరపీ’’ అట. దీనిని ఒళ్లంతటికీ ఇచ్చినా మేలు చేస్తుందంటున్నారు డాక్టర్లు. ఇలాంటి వైద్యాన్ని ‘‘క్రయో థెరపీ’’గా పేర్కొంటున్నారు.
మైనస్ డిగ్రీల వాతావరణంలో..
దాదాపు 70 ఏళ్ల వయసులో ఆ మధ్య రష్యా అధ్యక్షుడు పుతిన్ అతి చల్లటి సైబీరియా వాతావరణంలో గడ్డకట్టని సముద్రంలోకి దిగి అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే, ఇలాంటి క్రయో థెరపీ. అతి చల్లని నీటిలో స్నానం. మంచు ముక్కల మధ్యలో కూర్చోవడం, మైనస్ వంద డిగ్రీలుండే చల్లటి గదుల్లో గడపడం ఈ చికిత్సలే భాగమట. ఈ చల్లదనం కూడా మైనస్ 15- మైనస్ 100 డిగ్రీల మధ్య మాత్రమే ఉండాలి.
సెకన్లే.. కానీ నరకం..
క్రయో థెరపీ సాగేది కేవలం ముప్ఫై సెకన్ల నుంచి మూడు నిమిషాలే.. అయితే, ఒంట్లోంచి బయటకు వచ్చే ఆవిరే గడ్డకట్టే అతి సంక్లిష్ట వాతావరణంలో అదీ ఎక్కువే. కానీ క్రయో థెరపీ కదా? అంతకుమించి ఉండకూడదు. ఉండలేం కూడా. స్పాలూ, రిసార్టులూ ఈ థెరపీ కోసం నిపుణుల ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాయి.
కోహ్లి, సమంత
స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి ఫిట్ నెస్ కు ఎంత ప్రాధాన్యం ఇస్తాడో అందరికీ తెలిసిందే. ఒకప్పటి కోహ్లికి ఇప్పటి కోహ్లికి తేడా చూస్తనే ఈ విషయం తెలిసిపోతుంది. అతడి ట్రైనింగ్ సెషన్లు అత్యంత కఠినంగా ఉంటాయి. ఇక సినిమా స్టార్లలో రకుల్ ప్రీత్ సింగ్ ఫిట్ నెస్ ఫ్రీక్. ఆమె యోగా చేస్తున్న ఫొటోలు చూసి పదేళ్ల కిందటే ఔరా అన్న పరిస్థితి. సమంత సైతం అంతే. వర్ధమాన నటి ప్రగ్యా జైశ్వాల్ కూడా ఫిట్ నెస్ ప్రియురాలు. ఇటీవల వీరితో పాటు మరికొందరు సెలబ్రిటీలు క్రయో థెరపీ ఫాలో అవుతున్నారు. ఒత్తిడి నుంచి బయటపట్టేందుకు దీనినో సాధనంగా ఎంచుకుంటున్నారు.
ఇవీ ప్రయోజనాలు..
క్రయో థెరపీతో ఒంట్లో రక్త ప్రసరణ మెరుగవుతుంది. లైఫ్ స్టయిల్ జబ్బులూన రక్త పోటు, మధుమేహం అదుపులో ఉంటాయి. కీళ్ల నొప్పులు, మానసిక ఒత్తిడి దగ్గరికి రావు. ఇప్పటికే ఆ వ్యాధులు ఉంటే ఉపశమనం దొరుకుతుంది. అందుకే గజగజ వణికిపోతూ కూడా ప్రముఖులు చలో ‘‘కోల్డ్ థెరపీ’’ అంటున్నారు.