ఆర్నెల్ల తర్వాత తొలిసారి తెలంగాణ సర్కారు కరోనా బులిటెన్!
అయితే.. ఇటీవల కాలంలో ఎప్పుడూ లేని విధంగా తాజాగా వెలుగు చేసిన జేఎన్ 1 వేరియంట్ పై ఆందోళన వ్యక్తమవుతోంది
By: Tupaki Desk | 20 Dec 2023 5:05 AM GMTప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి ఎంతటి ఆగం చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు.. వారు ఏ స్థాయికి చెందిన వారైనా సరే కరోనాతో కరెంటు షాక్ కొట్టిన పరిస్థితి. ఇప్పుడిప్పుడే ఆ చేదు అనుభవాల నుంచి బయటకు వస్తున్న పరిస్థితి. 2021 తర్వాత కరోనా భయాందోళనలు ఒక కొలిక్కి వచ్చినప్పటికీ.. అప్పుడప్పుడే ఏదో ఒక వేరియంట్ పేరుతో హడావుడి చేయటం.. ఆందోళనను వ్యక్తం చేయటం తెలిసిందే.
అయితే.. ఇటీవల కాలంలో ఎప్పుడూ లేని విధంగా తాజాగా వెలుగు చేసిన జేఎన్ 1 వేరియంట్ పై ఆందోళన వ్యక్తమవుతోంది. చాలా రోజుల తర్వాత కేంద్రంలోని మోడీ సర్కారు సైతం కరోనా కొత్త వేరియంట్ మీద అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని హెచ్చరికలు జారీ చేయటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఆర్నెల్ల గ్యాప్ తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరోనా హెల్త బులిటెన్ ను విడుదల చేసింది.
ప్రస్తుతం తెలంగాణలో తొమ్మిది కొవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నట్లుగా వైద్య ఆరోగ్య శాఖ నివేదిక స్పష్టం చేసింది. మొత్తం 402 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. అందులో నాలుగు కొత్త కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదైనట్లుగా నివేదిక వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో తెలంగాణ వ్యాప్తంగా నమోదైన కేసులు నాలుగే కావటం ఒకింత ఊపిరి పీల్చుకునేలా చేసినా.. అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందంటున్నారు.
ఇదిలా ఉంటే.. కరోనాకు నోడల్ ఆసుపత్రిగా వ్యవహరించిన గాంధీ ప్రభుత్వ ఆసుపత్రిలో కొవిడ్ కేసుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎప్పుడు కొవిడ్ పేషెంట్లు వచ్చినా చికిత్స చేసేందుకు వీలుగా సిబ్బంది సిద్ధంగా ఉన్నట్లుగా గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతానికి సాధారణ రోగుల కోసం 30 బెడ్స్.. గర్భిణుల కోసం మరో 20 బెడ్స్ సిద్ధం చేసినట్లుగా చెబుతున్నారు. కరోనా పీక్స్ లో ఉన్నప్పుడు గాంధీ ఆసుపత్రినే తెలంగాణ వ్యాప్తంగా నోడల్ ఆసుపత్రిగా నిర్వహించటం.. వేలాది మందికి వైద్యం ఇవ్వటం తెలిసిందే. మళ్లీ..కొత్త వేరియంట్ సందేహాల నేపథ్యంలో కాసింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి.