మీ పిల్లలు కొవిడ్ బారిన పడితే దీన్ని చదవటం మిస్ చేయొద్దు!
మానవ నాగరిక జీవితాన్ని కొవిడ్ కు ముందు.. కొవిడ్ తర్వాత అన్న విభజన రేఖ ఎంత స్పష్టమన్నది తెలిసిందే.
By: Tupaki Desk | 17 July 2024 5:47 AM GMTమానవ నాగరిక జీవితాన్ని కొవిడ్ కు ముందు.. కొవిడ్ తర్వాత అన్న విభజన రేఖ ఎంత స్పష్టమన్నది తెలిసిందే. సామాజిక అంశాలతో పాటు.. ఆర్థిక.. ఆరోగ్య అంశాల్లోనూ తీవ్రంగా ప్రభావితం చేసిన కొవిడ్.. మనిషిని తీవ్రంగా నష్టపోయేలా చేసింది. తాజాగా వెలుగు చూసిన అధ్యయనం చూస్తే.. కొవిడ్ బారిన చిన్నారులకు ఉన్న ఒక రిస్కు గురించి పేర్కొన్నారు. కొవిడ్ 19 బారిన పడిన చిన్నారుల్లో టైప్ 1 మధుమేహానికి సంబంధించిన లక్షణాలు చాలా వేగంగా బయటపడతాయన్న విషయాన్ని తాజా అధ్యయనం స్పష్టం చేసింది.
కరోనా తీవ్రత ఎక్కువగా సాగిన కాలంలో చిన్నారుల్లో ఈ వ్యాధి నిర్ధారణ రేటు ఎక్కువని వివరించింది. టైప్ 1 మధుమేహం అన్నది ఆటోఇమ్యూన్ రుగ్మతగా పేర్కొన్నారు. మరింత వివరంగా దీని గురించి చెప్పాలంటే.. వ్యాధి కారక బ్యాక్టీరియా నుంచి రక్షణ కల్పించాల్సిన రోగనిరోధక వ్యవస్థ అదుపు తప్పుతుందని.. ఆరోగ్యంగా ఉన్న స్వీయ కణాలు.. అవయువాల మీదనే దాడి చేస్తుందని తేల్చారు.
ఈ రుగ్మత బారిన పడిన వారిలోఅసాధారణ స్థాయిలో దాహం వేయటంతో పాటు ఆకలి.. తరచూ మూత్రానికి వెళ్లాల్సి వస్తుందని చెబుతున్నారు. అంతేకాదు.. తీవ్ర అలసట.. కంటిచూపు మందగించటం లాంటి లక్షణాలకు అవకాశం ఉందంటున్నారు. రక్త నమూనాలో వీటి ఉనికి ఆధారంగా టైప్ 1 మధుమేహాన్ని గుర్తించొచ్చని.. కొవిడ్ 19 బారిన పడ్డ చిన్నారుల్లో ఈ ఐలెట్ ఆటో యాంటీబాడీల స్థాయి అధికంగా ఉన్నట్లుగా పరిశోధనల్లో తేలింది.
ఈ అంశానికి సంబంధించి జర్మనీలోని ఇన్ స్టిట్యూట్ ఆఫ్ డయాబెటీస్ రీసెర్చ్ కు సంబంధించిన సైంటిస్టులు మరో అంశాన్ని గుర్తించినట్లుగా తాజా నివేదిక స్పష్టం చేస్తోంది. దీని ప్రకారం ఐలెట్ ఆటో యాంటీబాడీలు ఉన్న చిన్నారులు కొవిడ్ బారిన పడితే..వారిలో టైప్ 1 మధుమేహ వ్యాధి లక్షణాలు చాలా వేగంగా బయటపడే వీలుందన్న విషయాన్ని గుర్తించారు. సో.. మీ పిల్లలు కొవిడ్ బారిన పడి ఉంటే.. వారిలో ఏదైనా అనారోగ్య లక్షణాలు అదే పనిగా గుర్తిస్తే.. వైద్యులను సంప్రదించటం చాలా అవసరమన్న విషయాన్ని మర్చిపోకూడదు.