ఫ్రాన్స్ లో వణుకు పుట్టిస్తున్న ప్రమాదకర ఇన్ ఫెక్షన్
కరోనా తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్య అంశాల మీద మరింత శ్రద్ధ పెరిగింది.
By: Tupaki Desk | 29 Oct 2023 1:30 PM GMTకరోనా తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్య అంశాల మీద మరింత శ్రద్ధ పెరిగింది. అదే సమయంలో.. కొత్తగా వస్తున్న పలు ఇన్ఫెక్షన్లు కలవరానికి గురయ్యేలా చేస్తున్నాయి. కొన్ని దేశాల్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్న కొన్ని వైరస్ లు.. కొత్త తరహా ఇన్ఫెక్షన్లు ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. తాజాగా అలాంటిదే ఫ్రాన్స్ లో పెద్ద ఎత్తున వ్యాపిస్తోంది.
కళ్లలో రక్త స్రావం జరిగే ఒక ప్రమాదకర వైరల్ ఇన్ఫెక్షన్ ఇప్పుడు ఆందోళనకు గురి చేస్తోంది. క్రిమియన్ కాంగో హెమరేజిక్ ఫీవర్ అనే వ్యాధి ఒక రకం పురుగు ద్వారా వ్యాపిస్తోందని అంచనా వేస్తున్నారు. ఫ్రాన్స్ -స్పెయిన్ సరిహద్దుల్లో వెలుగు చూసిన ఈ ప్రమాదకర ఇన్ఫెక్షన్ నేపథ్యంలో బ్రిటన్ తన పౌరుల్ని జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేసింది. ఎబోలా వైరస్ మాదిరే.. ఆఫ్రికా.. పశ్చిమ ఆసియా తదితర ప్రాంతాల్లో ఈ సీసీహెచ్ఎఫ్ కనిపిస్తుందని చెబుతున్నారు.
వాతావరణ మార్పుల కారణంగా ఈ వ్యాధి మరికొన్ని ప్రాంతాలకు విస్తరించే వీలుందని.. బ్రిటన్ కూ వ్యాపించే వీలుందని హెచ్చరిస్తున్నారు. ‘హయలోమా మార్గినాటమ్’ అనే పురుగు కుట్టటం కారణంగా ఈ ఇన్ఫెక్షన్ బారిన పడతారు. దీని ప్రభావం ఎంతలా ఉంటుందంటే.. వ్యాధి సోకిన వారి శరీర ద్రవాల ద్వారా కూడా ఇతరులకు అంటే వీలుంది.దీని లక్షణాలు ఎబోలా మాదిరి ఉంటాయని చెబుతున్నారు.
దీని బారిన పడిన వారిలో కండరాల నొప్పి.. గొంతులో మంట.. వాంతులు.. కడుపు నొప్పితో ఇబ్బందులకు గురవుతారు. దీని తీవ్రత పెరిగే కొద్దీ.. లక్షణాలు తీవ్రం కావటమే కాదు.. ముక్కు.. కళ్లు.. చర్మంలోని రక్తనాళాలు పగిలి.. వాటి నుంచి రక్తస్రావం తలెత్తే ప్రమాదం ఉందంటున్నారు. జ్వరం.. కళ్లు తిరగటం.. మెడ.. వెన్ను.. తలనొప్పి.. కళ్లు ఎర్రబాడటం.. వెలుగును చూడలేని పరిస్థితి ఉంటుందని చెబుతున్నారు. కళ్ల నుంచి రక్తం కారే దీనికి టీకాల్లేవు.దీని బారిన పడిన ప్రతి వంద మందిలో 10-40 శాతం మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ వ్యాధి ఇప్పుడు ఫ్రాన్స్ లో పెద్ద ఎత్తున నమోదు కావటం ఆందోళన కలిగిస్తోంది.