ఏఐ వైద్యులను భర్తీ చేయదు కానీ... టాప్ సర్జన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ఆర్టిఫిషియల్ ఎంటరవ్వని రంగం లేదనే చర్చ ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా మొదలైన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 23 March 2024 6:30 AM GMTఆర్టిఫిషియల్ ఎంటరవ్వని రంగం లేదనే చర్చ ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా మొదలైన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో మిగిలిన రంగాల సంగతి కాసేపు పక్కనపెడితే.. వైద్య రంగం సంగతేమిటి అనే ప్రశ్న తెరపైకి వచ్చింది. ఈ సమయంలో వైద్య రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంశంపై టాప్ సర్జన్ లలో ఒకరైన డాక్టర్ అతుల్ గవాండే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా ఏఐ ఉపయోగించని వైద్యులు భర్తీ చేయబడవచ్చని అన్నారు.
అవును... యూఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్ మెంట్ (యూ.ఎస్.ఏ.ఐ.డి)లో గ్లోబల్ హెల్త్ చీఫ్, ప్రఖ్యాత అమెరికన్ సర్జన్, రచయిత డాక్టర్ అతుల్ గవాండే తాజాగా జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. వైద్య శాస్త్రంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పై ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఇందులో భాగంగా... "ఏఐ వైద్యులను భర్తీ చేయదు కానీ... ఏఐ ని వాడని వైద్యులు మాత్రం సాంకేతికతను ఉపయోగించే మరో వైద్యుడితో భర్తీ చేయబడే అవకాశాలున్నాయి" అని తెలిపారు.
తాజాగా భారత్ - అమెరికా గ్లోబల్ హెల్త్ పార్ట్నర్ షిప్ బలోపేతం దిశగా భారత్ పర్యటనలో ఉన్న అతుల్ గవాండే... ఈ సందర్భంగా పలు విషయాలపై ముచ్చటించారు. ఇందులో భాగంగానే... ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంతో వచ్చే ఉపయోగాలు ఇప్పటికే మన కళ్ల ముందు ఉన్నాయని అన్నారు. ఈ క్రమంలోనే... ఏఐ సిస్టం ద్వారా వెంటనే రీడ్ చేయగలిగే ఛాతీ ఎక్స్-రే సిస్టంస్ అభివృద్ధి చేయబడ్డాయని తెలిపారు.
ఫలితంగా రోగి పరిస్థితిని తక్షణమే ఆకళింపు చేసుకోవచ్చని తెలిపారు. దీనివల్ల రోగికి సత్వరమే చికిత్స అందుతుందని.. ఫలితంగా రోగి ప్రాణాలు కాపాడటంలో ఇది సహకరించినట్లవుతుందని స్పష్టం చేశారు. ఇదే క్రమంలో.. ఎంతోమంది ప్రాణాలను బలిగొంటున్న టీబీ వంటి వ్యాదులను ముంగుగానే గుర్తించి చికిత్స అందిచడంలోనూ ఏఐ ఉపకరిస్తుందని అతుల్ గవాండే తెలిపారు.
ఇదే క్రమంలో... వ్యాక్సిన్ ల కోసం ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన తయారీ కేంద్రంగా భారతదేశం మారిందని తెలిపిన గవాండే... సంక్షోభంలో మొత్తం ప్రపంచానికి సేవచేయగల సామర్ధ్యం మనకు అవసరమని నొక్కి చెప్పారు. మరోపక్క భారతదేశంలో చాలా మంది వ్యక్తులు యాంటీబయాటిక్స్ ని ఎక్కువగా తీసుకుంటున్నారని గవాండే ఆందోళన వ్యక్తం చేశారు!!