రోజుకు 6 గంటల కంటే తక్కువ నిద్రపోతున్నారా? అయితే జాగ్రత్త..
రోజు తక్కువ నిద్రపోవడం వల్ల మనకు తెలియకుండా ఎన్నో నష్టాలు కలుగుతాయి.
By: Tupaki Desk | 9 Aug 2024 1:30 PM GMTమనం ఆరోగ్యంగా ఉండాలి అంటే వ్యాయామం, ఆహారం పట్ల ఎంత శ్రద్ధ చూపిస్తామో మనం తీసుకునే నిద్ర పట్ల కూడా అంతే శ్రద్ధ చూపించాలి. రోజుకు కనీసం 6 గంటల కంటే తక్కువ నిద్రపోయేవారు రాను రాను ఎక్కువైపోతున్నారు. ప్రస్తుతం ఉన్న హడావిడి జీవనశైలి, స్ట్రెస్, ఉద్యోగాల పని వేళలలో మార్పు.. ఇలా ఎన్నో కారణాలవల్ల ప్రతిరోజు మనం నిద్రించే సమయం చాలా వరకు తగ్గిపోతుంది. అయితే ఇలా తరచూ చేసే వారి హెల్త్ డేంజర్ జోన్ లో ఉన్నట్టే అంటున్నారు నిపుణులు.
రోజు తక్కువ నిద్రపోవడం వల్ల మనకు తెలియకుండా ఎన్నో నష్టాలు కలుగుతాయి. తక్కువ సమయం నిద్రించే వారిలో అలసట, చిరాకు, కోపం తరచూ మనం గమనించవచ్చు. అలసిపోయిన శరీరానికి అవసరమైన విశ్రాంతి ఎంతో అవసరం. అలా ఇచ్చినప్పుడే మన శరీరంలోని మిగిలిన అవయవాల పనితీరు సరిగ్గా సాగుతుంది. అలా కాకుండా మనం తక్కువసేపు నిద్రించడం వల్ల శరీరంపై తీవ్రమైన ప్రభావం పడుతుంది. దీంతో మనకు ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.
ఏకాగ్రత మందగించడం, కళ్ళు మంటలు, ఒళ్ళు నొప్పులు ఇలాంటి చిన్న చిన్న సమస్యలతో మీరు తరచూ బాధపడుతూ ఉంటే కచ్చితంగా మీరు నిద్రించే వేళల గురించి ఒకసారి ఆలోచించండి. మనలో చాలామంది రోజుకు ఎనిమిది గంటలు పడుకుంటే సరిపోతుంది కదా అనే ఉద్దేశంతో పొద్దున పూట బాగా నిద్రపోయి రాత్రి పూట ఫోన్ చూసుకుంటూ కాలం గడిపేస్తారు. అయితే ఇలా చేయడం వల్ల కూడా ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం పడుతుంది.
నిద్ర తక్కువ పోవడం వల్ల శరీరంలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి మీకు తెలియకుండానే బరువు పెరిగిపోతారు. జీవక్రియ మందగించడంతో తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణం కాక పలు రకాల ఉదర సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. అంతేకాదు మీలోని రోగ నిరోధక శక్తి పూర్తిగా తగ్గిపోతుంది. తక్కువ నిద్ర తీసుకునే వారికి గుండె సమస్యలు కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని అధ్యయనాల్లో తేలింది.
చాలామంది ఫోన్ చూస్తూ పడుకుంటే నిద్ర వస్తుంది అనే ఉద్దేశంతో ఫోన్ చూస్తూ అలా కూర్చుండి పోతారు. రాత్రి 12 పైన పడుకొని మళ్లీ తిరిగి మధ్యాహ్నం కాసేపు పడుకోవడం ఇంట్లో ఉండే హౌస్ వైఫ్ కి అలవాటు. అయితే ఇలా చేసేవారికి క్రమంగా అధిక రక్తపోటు సమస్యతో పాటు డయాబెటిస్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. తక్కువ నిద్రపోయేవారిలో ఆందోళన, ఒత్తిడి పెరగడంతో మానసిక సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి కచ్చితంగా మీరు రోజుకి 6 నుంచి 8 గంటలు సరియైన సమయంలో నిద్ర పోయేలాగా జాగ్రత్తలు తీసుకోండి.