మహరాష్ట్రలో జీబీఎస్ తొలిమరణం... సర్కార్ కీలక నిర్ణయం!
గత కొన్ని రోజులుగా మహారాష్ట్రలో గిలియన్-బారే సిండ్రోమ్ (జీబీఎస్) కు సంబంధించిన వార్తలు తీవ్ర కలకలం రేపుతోన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 27 Jan 2025 10:23 AM GMTగత కొన్ని రోజులుగా మహారాష్ట్రలో గిలియన్-బారే సిండ్రోమ్ (జీబీఎస్) కు సంబంధించిన వార్తలు తీవ్ర కలకలం రేపుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పూణెలో ఇప్పటివరకూ నమోదైన జీబీఎస్ కేసుల సంఖ్య 101కి చేరుకుందని.. అందులో 16 మంది వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారని అంటున్న వేళ ఓ మరణం సంభవించడం ఆందోళన కలిగిస్తోంది.
అవును... మహారాష్ట్రలో గిలియన్-బారే సిండ్రోమ్ తీవ్ర కలకలం రేపుతోందంటూ కథనాలు హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో సోలాపూర్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి తాజాగా మరణించగా.. అందుకు కారణం జీబీఎస్ అని అనుమానిస్తున్నట్లు వైద్య వర్గాలు చెబుతున్నాయని తెలుస్తోంది. దీంతో... ఈ విషయం ఒక్కసారిగా వైరల్ గా మారింది.
మరోపక్క దీని బారిన పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతుండటంతో వీటి దర్యాప్తు కోసం మహారాష్ట్ర రాష్ట్ర ఆరోగ్యశాఖ ఒక బృందాన్ని ఇప్పటికే ఏర్పాటు చేసిందని చెబుతున్నారు. ఈ సందర్భంగా స్పందించిన వైద్యులు... ప్రజలు భయాందోళనకు గురికావొద్దని.. జీబీఎస్ అంటువ్యాధి కాదని, చికిత్సతో దీన్ని నయం చేయొచ్చని చెబుతున్నారు.
ఇదే సమయంలో... డయేరియాకు కారణమయ్యే కాంపిలోబ్యాక్టర్ జెజునీ బాక్టీరియా ఈ గిలియన్-బారే సిండ్రోమ్ (జీబీఎస్) కు కారణం కావొచ్చని వైద్యులు అనుమానిస్తున్నారని తెలుస్తోంది. ఇక ఈ వ్యాధి సోకిన వారిలో డయేరియా, పొత్తికడుపు నొప్పి, జ్వరం, వాంతులు వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయని చెబుతున్నారు.
కలుషిత ఆహారం, నీటి ద్వారా ఆ బాక్టిరియా సోకుతుందని చెబుతున్నారు. బాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్ కారణంగా రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న వ్యక్తులు ఈ జీబీఎస్ బారినపడే అవకాశాలు ఉంటాయని వైద్యులు వెల్లడించారు.
ఇక ఈ వ్యాధికి సంబంధించిన చికిత్స ఖర్చుతో కూడుకున్నదని చెబుతున్నారు. ఈ చికిత్సకు సంబంధించిన ఇమ్యునోగ్లోబిన్ ఇంజెక్షన్లు ఒక్కొక్కటీ వేల రూపాయలు ఉంటాయని అంటున్నారు. దీంతో.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా జీబీఎస్ చికిత్స అందిస్తామని మహారాష్ట్ర ఆర్థిక మంత్రి అజిత్ పవార్ వెల్లడించారు