కొత్త వ్యాది "హవానా సిండ్రోమ్"... భారత్ లో ప్రభావం...?
సుఖం పెరిగే కొద్దీ సమస్య పెరుగుతుందని కొందరంటే... ఒత్తిడి పెరిగే కొద్దీ ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని చెబుతున్నారు
By: Tupaki Desk | 10 Aug 2023 3:30 PM GMTరోజు రోజుకీ కొత్త కొత్త రోగాలు పెరిగిపోతున్నాయని అంటుంటారు. సుఖం పెరిగే కొద్దీ సమస్య పెరుగుతుందని కొందరంటే... ఒత్తిడి పెరిగే కొద్దీ ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని చెబుతున్నారు. ఈ క్రమంలో తాజాగా హవానా సిండ్రోమ్ వ్యాది తెరపైకి వచ్చింది. దీంతో... భారత్ లో దీని ప్రభావం ఎంతనే చర్చ మొదలైంది.
అవును... అమెరికాతో పాటు పలుదేశాల అగ్ర నేతలు, దౌత్యకార్యాలయ అధికారులను హవానా సిండ్రోమ్ కలవరపెడుతోందని అంటున్నారు. దీంతో... భారత్ లోనూ ఈ మిస్టరీ సిండ్రోమ్ ప్రభావం ఉందా? అనే విషయంపై ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో... తాజాగా ఈ వ్యాదిపై భారత ప్రభుత్వం కూడా దృష్టి సారించింది. దర్యాప్తు చేస్తామని తెలిపింది.
బెంగళూరుకు చెందిన అమర్నాథ్ చాగు అనే వ్యక్తి కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. భారత్ లో హవానా సిండ్రోమ్ వ్యాప్తి, నిర్మూలన చర్యలపై దర్యాప్తు జరపాలని అందులో పేర్కొన్నారు. ఇటీవల ఈ పిటిషన్ విచారణకు రాగా.. దీనిపై కేంద్ర ప్రభుత్వం తన స్పందనను తెలియజేసింది.
ఈ సిండ్రోమ్ ఉనికికి సంబంధించి మూడు నెలల్లో దర్యాప్తు పూర్తి చేస్తామని హైకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దీంతో మరోసారి ఈ సిండ్రోమ్ వ్యవహారం చర్చనీయాంశమయ్యింది. ఇప్పుడు ఈ వ్యాది భారత్ లో కూడా ఉందా.. ఉంటే దాని తీవ్రత ఎలా ఉందనేది ఆసక్తిగా మారింది.
కాగా... అమెరికా ఇంటెలిజెన్స్ తో పాటు వివిధ దేశాల దౌత్యకార్యాలయ అధికారులకు ఎదురైన మానసిక ఆరోగ్య లక్షణాలనే హవానా సిండ్రోమ్ గా వ్యవహరిస్తున్నారు. ఈ వ్యాది బారిన పడిన వారిలో... బయట ఎటువంటి శబ్దం లేకున్నా భారీ శబ్దం వినిపించడం, మైగ్రెయిన్, జ్ఞాపకశక్తి మందగించడం, మైకం వంటి లక్షణాలు కనిపిస్తున్నట్లు గుర్తించారు.
ఈ వ్యాది లక్షణాలు ఇలా ఉన్నప్పటికీ.. అందుకు కారణమైన కచ్చితమైన కారణాలు మాత్రం ఇప్పటివరకు గుర్తించలేకపోయారు. దీంతో ఇదో మిస్టరీగానే ఉండిపోయింది. అయితే, ఎలక్ట్రానిక్ పరికరాల నుంచి వచ్చే మైక్రోవేవ్ తరంగాల కారణంగా ఈ పరిస్థితి తలెత్తుతోందని అమెరికా అనుమానిస్తోంది.
అయితే అధిక ఫ్రీక్వెన్సీ కలిగిన ధ్వని తరంగాలు ఇందుకు కారణం కావొచ్చని కొందరి వాదన కాగా... హిస్టీరియా లేదా మానసిక వ్యాధికారణాల వల్ల ఈ సమస్య తలెత్తే అవకాశం ఉందని మరికొందరు నిపుణులు చెబుతున్నారు. ఏదేమైనా ఈ సమస్యకు స్పష్టమైన కారణాలు మాత్రం ఇంకా వెల్లడికాలేదు.
ఈ సిండ్రోమ్ ను తొలిసారి క్యూబాలోని హవానా నగరంలోని అమెరికా దౌత్యకార్యాలయం సిబ్బందిలో గమనించారు. దీంతో ఆ నగరం పేరుమీదుగా దీన్ని "హవానా సిండ్రోమ్" గా పిలుస్తున్నారు.